ETV Bharat / international

చైనా టీకా‌ సురక్షితం- బ్రెజిల్​ ఇనిస్టిట్యూట్​ వెల్లడి!

author img

By

Published : Oct 20, 2020, 2:36 PM IST

చైనాకు చెందిన సినోవాక్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వైరస్‌ టీకా మూడో దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు ఇచ్చినట్లు తేలింది. ఈ మేరకు బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ బయోమెడికల్ పరిశోధనా కేంద్రమైన సావో పాలో బుటాంటన్‌ ఇనిస్టిట్యూట్ ఓ ప్రకటన విడుదల చేసింది.

Chinese sinovac vaccine trials has shown positive results
చైనా టీకా‌ సురక్షితమేనని వెల్లడి!

చైనాకు చెందిన సినోవాక్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వైరస్‌ టీకా తుది దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు ఇచ్చినట్లు వెల్లడైంది. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ బయోమెడికల్ పరిశోధనా కేంద్రమైన సావో పాలో బుటాంటన్‌ ఇనిస్టిట్యూట్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా తొమ్మిది వేల మంది వాలంటీర్లపై రెండు డోసులుగా ఈ టీకా‌(కరోనా వ్యాక్)‌ను ఇచ్చామని తెలిపింది. అలాగే ఎవరూ తీవ్ర అస్వస్థతకు గురికాలేదని ఇనిస్టిట్యూట్ ఉన్నతాధికారులు వెల్లడించారు. బ్రెజిల్‌లో చివరి దశకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ప్రాథమిక ఫలితాలు సోమవారం వెల్లడికావడంతో.. ఈ దశకు చేరుకున్న తొలి వ్యాక్సిన్ తయారీ సంస్థగా సినోవాక్‌ నిలిచింది.

ఇక వ్యాక్సిన్‌ మొదటి డోసు అనంతరం ఇంజెక్షన్ కారణంగా 20 శాతం మందిలో కొద్దిపాటి నొప్పి, 15 శాతం మందిలో తలనొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. రెండో డోసులో 10 శాతం మందికి మాత్రమే తలనొప్పి, 5 శాతం మందికి అలసట, వికారం, కొద్దిగా కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయని తెలిపారు. అయితే, మొత్తంగా ట్రయల్స్‌లో పాల్గొంటున్న 15వేల మందిపై వ్యాక్సిన్ ప్రయోగాలు పూర్తయిన తర్వాతే వైరస్‌ కట్టడిలో వ్యాక్సిన్‌ సమర్థతకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని బుటాంటన్‌ డైరెక్టర్ వెల్లడించారు. దీనిపై సావోపాలో స్టేట్ హెల్త్ సెక్రటరీ మాట్లాడుతూ.. ఈ వ్యాక్సిన్ శరీరంలో యాంటీబాడీలను తయారు చేస్తున్నట్లు వెల్లడైందన్నారు. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని, అలాగే 2021 ప్రారంభం నుంచి ప్రజలందరికి దాన్ని అందివ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'మా జవాను త్వరగా తిరిగొస్తాడని ఆశిస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.