ETV Bharat / international

వైద్యులు లేకుండానే కరోనా రోగుల పర్యవేక్షణ ఇలా...

author img

By

Published : May 31, 2020, 12:43 PM IST

కరోనా రోగుల చికిత్సలో భాగంగా ప్రముఖ ఆరోగ్య సాంకేతిక సంస్థ 'రాయల్​ ఫిలిప్స్'​ సరికొత్త పరికరాన్ని అభివృద్ధి చేసింది. వైరస్ బాధితులను పర్యవేక్షించేందుకు.. బయోసెన్సార్​ను తీసుకొచ్చింది. ఆసుపత్రుల్లో వినియోగించేందుకు ఇప్పటికే అమెరికాకు చెందిన ఎఫ్​డీఏ నుంచి క్లియరెన్స్​ పొందినట్లు సంస్థ ప్రకటించింది.

Philips launches biosensor to monitor COVID-19 patients
కరోనా రోగుల పాలిట వరం 'బయోసెన్సార్​'​

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వైద్య సిబ్బంది, పీపీఈ కిట్ల కొరత ఓవైపు వేధిస్తోంది. ఫలితంగా వారి రక్షణ గాలిలో దీపంలా తయారైంది. ఈ నేపథ్యంలో రోగి ఆరోగ్య పరిస్థితిని ప్రతి నిమిషం పర్యవేక్షించడం కష్టతరంగా మారింది. ఇందుకు పరిష్కారంగా నెదర్లాండ్స్ ఆమ్​స్టర్​డ్యామ్​కు చెందిన ప్రముఖ ఆరోగ్య సాంకేతిక సంస్థ 'రాయల్​ ఫిలిప్స్​' సరికొత్త ఆవిష్కరణ చేపట్టింది. ఆసుపత్రుల్లో కరోనా రోగులను పర్యవేక్షించేందుకు వీలుగా బయోసెన్సార్​ను అభివృద్ధి చేసింది.

ఇది ఏక కాలంలో ఎక్కువ మంది రోగులపై దృష్టి సారించేందుకు ఉపయోగపడనుంది. ఆసుపత్రుల్లో వినియోగించేందుకు అమెరికాకు చెందిన ఆహార ఔషధ నిర్వహణ సంస్థ(ఎఫ్​డీఏ) నుంచి క్లియరెన్స్​ పొందినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇలా పనిచేస్తుంది...

ఫిలిప్స్​ బయోసెన్సార్​ బీఎక్స్​100 అని పిలిచే ఈ పరికరం ఎంతో తేలికైనది. దీనిని రోగి ఛాతికి అమర్చుతారు. ఈ పరికరమే బాధితుడి శ్వాసకోస, హృదయ స్పందన రేటును ప్రతి నిముషానికి నమోదు చేసి భద్రపరుస్తుంది. ఫలితంగా రోగికి మరింత కచ్చితత్వంతో చికిత్స అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆరోగ్య పరిస్థితుల్లో అనూహ్య మార్పు సంభవిస్తే వెంటనే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.

" ప్రస్తుతం ఉన్న కరోనా కాలంలో ఫిలిప్స్​ బయోసెన్సార్​ బీఎక్స్ 100 పరికరం రోగులపై నిఘా ఉంచేందుకు సాయపడుతుంది. అంతే కాకుండా వైద్య సంరక్షకులకు వైరస్​ సోకకుండా కాపాడే వీలుంటుంది. పీపీఈ కిట్ల కొరతకు తీర్చేందుకు ఇది ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది".

-పీటర్​ జీసే, ఫిలిప్స్​ జనరల్​ మేనేజర్​ మానిటరింగ్​ అంట్​ అనలిటిక్స్​

ఇప్పటికే నెదర్లాండ్స్​లోని ప్రముఖ ఆసుపత్రి ఓఎల్​జీవీలో.. కరోనా రోగుల కోసం బయోసెన్సార్​ను ఉపయోగిస్తున్నట్లు సంస్థ తెలిపింది. రక్షణ పరికరాలు లేకుండా రోగి గదిలోకి వెళ్లడం ప్రమాదకరమని.. ఇటువంటి ఆవిష్కరణల ద్వారా వైద్యులు మరింత మెరుగ్గా పనిచేసేందుకు వీలుంటుందని పేర్కొంది.

ప్రస్తుతం ఈ బయోసెన్సార్​ను ఐదు రోజులు మాత్రమే వినియోగించే వీలుంది. ఆ తర్వాత మరొకటి మార్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరింతగా దీన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చూడండి:జంతువుల నుంచి మనుషులకు కరోనా ఇలా వ్యాపించింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.