ETV Bharat / international

జంతువుల నుంచి మనుషులకు కరోనా ఇలా వ్యాపించింది!

author img

By

Published : May 31, 2020, 7:41 AM IST

కరోనా వైరస్ జంతువుల నుంచి మానవులకు ఎలా వ్యాప్తి చెందిందనే విషయంపై పరిశోధన జరిపారు అమెరికా శాస్త్రవేత్తలు. గబ్బిలాల నుంచి ఇతర జంతువులకు వ్యాప్తి చెంది, జన్యు పదార్థంలో మార్పుల ద్వారా చివరకు మానవులలోకి ప్రవేశించినట్లు తేల్చారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం జర్నల్ సైన్స్ అడ్వాన్స్​లో ప్రచురితమైంది.

'How coronavirus jumped from animals to humans decoded'
జంతువుల నుంచి మానవులకు కరోనా ఎలా వ్యాపించిందంటే...

మానవాళి మనుగడకు సవాలుగా మారి ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్​ మహమ్మారి మూలాన్ని కనుగొన్నారు అమెరికా పరిశోధకులు. ఈ వైరస్ జంతువుల నుంచి వివిధ రూపాల్లోకి మారి చివరకు మనుషులకు హాని చేసే సామర్థ్యాన్ని పొందినట్లు వెల్లడించారు. టెక్సాస్​ యూనివర్సిటీ సహా మరికొంత మంది శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం జర్నల్​ సైన్స్ అడ్వాన్సెస్​లో ప్రచురితమైంది.

కరోనా వైరస్ జన్యు విశ్లేషణ అనంతరం గబ్బిలాల్లో వాప్తి చెందే వైరస్​కు దీనితో దగ్గరి సంబంధాలున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. క్లిష్టమైన జన్యు భాగం మార్పిడి ద్వారా వైరస్ వివిధ రకాలుగా రూపాంతరం చెంది గబ్బిలాల నుంచి అలుగులకు(పాంగోలిన్​ జంతువు), ఆ తర్వాత మనుషులకు వ్యాప్తి చెందినట్లు అధ్యయనం తెలిపింది.

జంతువుల నుంచి జంతువులకు వ్యాప్తి చెందుతూ.. జన్యు పదార్థంలో మార్పుల ద్వారా మానవ కణాల్లోకి ప్రవేశించగల సామర్థ్యాన్ని వైరస్​ పొందినట్లు శాస్త్రవేత్తలు వివరించారు.

గతంలో సార్స్ వైరస్​ గబ్బిలాల నుంచి పునుగులకు, ఆ తర్వాత మానవులకు వ్యాప్తి చెందినట్లు గానే ఇప్పుడు కరోనా వైరస్​ కూడా జన్యుపదార్థం మార్పుల ద్వారా జంతువుల నుంచి మానవులకు వ్యాపించినట్లు పరిశోధనలో పాల్గొన్న ఫెంగ్​ గావ్​ చెప్పారు. వైరస్ పరిణామ క్రమాన్ని కనుగొనడం వల్ల భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను అరికట్టడమే గాక వ్యాక్సిన్ అభివృద్ధి పరిశోధనలకూ మార్గనిర్దేశం చేయవచ్చన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.