ETV Bharat / business

'అదే జరిగితే.. సొంత స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తా'.. యాపిల్, గూగుల్​లకు మస్క్ వార్నింగ్​

author img

By

Published : Nov 26, 2022, 7:56 PM IST

ఒకవేళ గూగుల్‌, యాపిల్‌లు తమ యాప్‌ స్టోర్‌ల నుంచి ట్విట్టర్‌ను తొలగిస్తే.. ప్రత్యామ్నాయ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తానని తెలిపారు ఆ సంస్థ అధినేత ఎలాన్​ మస్క్. ఈ ట్వీట్ నెట్టింట వైరల్​ అవుతోంది.

twitter head elon musk
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్

Elon Musk Tweet : ట్విట్టర్‌ చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ తాజాగా మరో కీలక ట్వీట్‌ చేశారు. ఒకవేళ గూగుల్‌, యాపిల్‌లు తమ యాప్‌ స్టోర్‌ల నుంచి ట్విట్టర్‌ను తొలగిస్తే.. ప్రత్యామ్నాయ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తానని తెలిపారు. యాపిల్‌, గూగుల్‌ల మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైతే.. వాటి యాప్ స్టోర్‌ల నుంచి ట్విట్టర్‌ను తొలగించే అవకాశం ఉందని ట్విటర్‌ ట్రస్ట్‌, సేఫ్టీ విభాగం మాజీ అధిపతి యేల్‌ రోత్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మస్క్‌ తాజా ట్వీట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

'ఒకవేళ యాపిల్, గూగుల్‌లు తమ అప్లికేషన్‌ స్టోర్‌ల నుంచి ట్విట్టర్‌ను తొలగిస్తే.. మస్క్‌ తన సొంత స్మార్ట్‌ఫోన్‌ తీసుకురావాలి. పక్షపాత వైఖరి, గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడే ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌లను సగం అమెరికా వదిలేస్తుంది. పైగా.. అంగారకుడిపై వెళ్లేందుకు రాకెట్లు నిర్మించే మనిషికి.. చిన్నపాటి స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయడం సులభమే!' అని ఓ వినియోగదారు ట్వీట్‌ చేశారు. దీనిపై ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ.. 'ఇటువంటి పరిస్థితి రాదని ఆశిస్తున్నా. కానీ, ఇదే జరిగి, వేరే అవకాశం లేకపోతే మాత్రం.. ప్రత్యామ్నాయ ఫోన్ తయారు చేస్తా' అని చెప్పారు.

ఈ రిప్లై ట్వీట్‌ కాస్త వైరల్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. స్మార్ట్‌ఫోన్‌లలో మస్క్‌ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తారని ఓ వినియోగదారు స్పందించారు. నాకు తెలిసి ఈ ప్లాన్ ఇప్పటికే అమల్లో ఉన్నట్లు భావిస్తున్నానని మరొకరు కామెంట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఎలాన్‌ మస్క్‌ పగ్గాలు చేపట్టాక ట్విట్టర్‌లో ఎప్పటికప్పుడు పరిణామాలు మారిపోతోన్న విషయం తెలిసిందే. భారీఎత్తున ఉద్యోగుల తొలగింపు, వెరిఫైడ్‌ ఖాతాలకు బ్లూటిక్‌ల కేటాయింపులో గందరగోళం తదితర అంశాలతో ఈ సంస్థ రోజూ వార్తల్లో నిలుస్తోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.