ETV Bharat / bharat

'మోదీజీ.. మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి జైల్లో పెట్టండి'

author img

By

Published : Jun 2, 2022, 12:30 PM IST

Delhi Kejriwal news: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కేంద్రంపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తప్పుడు కేసులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సైతం అరెస్టు చేయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. ఒక్కొక్కరిని అరెస్టు చేసే బదులు.. ఆప్ ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి జైల్లో పెట్టాలని ప్రధానిని కోరారు.

KEJRIWAL SISODIA
KEJRIWAL SISODIA

KEJRIWAL ON SISODIA ARREST: దిల్లీ వైద్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్​ను ఈడీ అరెస్టు చేయడంపై అక్కడి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సైతం ఈడీ ఇలాగే తప్పుడు కేసులో అరెస్టు చేస్తుందని అన్నారు. సత్యేందర్, సిసోడియా.. దిల్లీలో విద్య, వైద్య రంగంలో సమూల మార్పులకు నాంది పలికారని చెప్పారు. వీరి అరెస్టు దేశానికే నష్టమని అన్నారు. ఈ సందర్భంగా భాజపా సర్కారుపై విరుచుకుపడ్డారు. ఒక్కొక్క ఎమ్మెల్యేను టార్గెట్ చేసే బదులు.. ఆప్ శాసనసభ్యులందరినీ ఒకేసారి అరెస్టు చేయాలని మండిపడ్డారు.

"తప్పుడు కేసులో సత్యేందర్ జైన్​ను అరెస్టు చేస్తారని నాకు కొన్ని నెలల క్రితమే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. మరో తప్పుడు కేసులో మనీశ్ సిసోడియాను సైతం కొద్దిరోజుల్లో అరెస్టు చేస్తారని ఇప్పుడు అదే వర్గాలు నాతో చెప్పాయి. కొంతమంది ఇది హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కారణంగా అని అంటున్నారు. మరికొందరేమో పంజాబ్ ఎన్నికల ఫలితాలకు ప్రతీకారంగా అని చెబుతున్నారు. కారణమేదైనా, మేం భయపడేదే లేదు. ఐదేళ్ల క్రితం కూడా ఆప్ నేతలపై రైడ్లు జరిగాయి. కానీ, వారికి ఏమీ లభించలేదు. విద్యా, వైద్య రంగంలో జరుగుతున్న మంచి పనులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. వీరి అరెస్టులు దేశానికే నష్టం కలిగిస్తాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నాదో విన్నపం. మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి అరెస్టు చేయండి. ఒక్కొక్కరిని అరెస్టు చేయడం వల్ల మంచి పనులకు ఆటంకం కలుగుతుంది. అందరినీ అరెస్టు చేస్తే... మేం విడుదలైన తర్వాత మా మంచి పనులను కొనసాగించుకుంటాం."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

ఈ సందర్భంగా మనీశ్ సిసోడియాపై ప్రశంసలు కురిపించారు కేజ్రీవాల్. దిల్లీలో విద్యా ఉద్యమానికి సిసోడియా పితామహుడని అభివర్ణించారు. స్వతంత్ర భారతదేశంలో అత్యుత్తమ విద్యా శాఖ మంత్రి ఆయనేనని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్​ను మెరుగుపర్చేందుకు ఆయన కృషి చేశారని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలోనూ మంచి విద్య లభిస్తుందనే ఆశను దేశ ప్రజల్లో కలిగించారని చెప్పారు. 'సిసోడియా అవినీతిపరుడిలా కనిపిస్తున్నారా?' అని ప్రభుత్వ పాఠశాలల స్కూళ్లలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులను కేజ్రీవాల్ ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.