ETV Bharat / bharat

'సత్యేందర్ జైన్ దేశానికి గర్వకారణం.. పద్మ విభూషణ్ ఇవ్వాలి'

author img

By

Published : Jun 1, 2022, 5:40 PM IST

Arvind Kejriwal: మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన దిల్లీ మంత్రి సత్యేందర్​ జైన్​కు మద్దతుగా నిలిచారు సీఎం కేజ్రీవాల్​. ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు మొహల్లా క్లినిక్స్ మోడల్​ను తీసుకొచ్చిన జైన్​కు పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలన్నారు. ఆయన ఎంతో నిజాయితీపరుడని, గొప్ప దేశ భక్తుడని కితాబిచ్చారు. వరోవైపు అవినీతిపరుడైన సత్యేందర్ జైన్​ను కేజ్రీవాల్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మండిపడ్డారు.

Kejriwal on Satyender Jain
'సత్యేందర్ జైన్ దేశానికి గర్వకారణం.. పద్మ విభూషణ్ ఇవ్వాలి'

Kejriwal on Satyender Jain: హవాలా కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​​ అరెస్ట్ చేసిన దిల్లీ మంత్రి సత్యేందర్​ జైన్​కు పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు 'మొహల్లా క్లినిక్స్' మోడల్​ తీసుకొచ్చిన ఆయన ఈ అవార్డుకు అర్హుడేనని పేర్కొన్నారు. జైన్​ ఎంతో నిజాయితీపరుడని, గొప్ప దేశభక్తుడని కొనియాడారు. కేంద్రం ఆయనపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తోందని ఆరోపించారు. ఈడీ విచారణ అనంతరం తనపై ఒక్క మచ్చ కూడా లేకుండా సత్యేందర్ జైన్ బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మొహల్లా క్లినిక్స్ ద్వారా ప్రజలకు ఉచిత వైద్యం అందించిన సత్యేందర్​ జైన్​ను చూసి దేశం గర్వించాలి. ఈ క్లినిక్స్​కు ప్రపంచ దేశాల నుంచి ప్రజలు వస్తున్నారు. ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రెటరీ జనరల్ కూడా సందర్శించారు. జైన్​ను పద్మ భూషణ్ లేదా పద్మ విభూషణ్ వంటి ఉన్నత​ పురస్కారంతో గౌరవించాలి. సీబీఐ ఇప్పటికే జైన్​కు క్లీన్​చిట్ ఇచ్చింది. విచారణ అనంతరం ఈడీ కూడా క్లీన్​చిట్ ఇస్తుందని ఆశిస్తున్నా.

-దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

Satyender Jain Arrest: మనీలాండరింగ్ కేసులో సత్యేంజర్​ జైన్​ను ఈడీ సోమవారం అరెస్టు చేసింది. కోర్టు ఆయనకు జూన్ 9 వరకు కస్టడీ విధించింది. జైన్​పై చేస్తున్న ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉన్నా తానే ముందుగా చర్యలు తీసుకునే వాడినని సీఎం కేజ్రీవాల్ అన్నారు. దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా జైన్​కు మద్దతుగా నిలిచారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్​కు జైన్ ఆప్ ఇంఛార్జ్​గా ఉన్నందుకే ఆయన్ను అరెస్టు చేశారని ఆరోపించారు. భాజపాకు అప్పుడే ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు.

Smriti Irani​: హవాలా కేసులో అరెస్టయిన సత్యేందర్‌ జైన్‌ను సమర్థించుకుంటున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై భాజపా విమర్శల దాడిని పెంచింది. మనీలాండరింగ్‌ కేసులో నేరుగా ప్రమేయం ఉన్న మంత్రిని ఎందుకు రక్షిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ప్రశ్నించారు. అవినీతికి పాల్పడడమంటే దేశానికి వెన్నుపోటుతో సమానమని చెప్పే కేజ్రీవాల్‌.. మోసగాడిగా నిరూపితమైన మంత్రిని ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. ఈ మేరకు కేజ్రీవాల్‌కు 10 ప్రశ్నలు సంధించిన స్మృతీ ఇరానీ.. సత్యేందర్‌ జైన్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పలు వివరాలను వెల్లడించారు.

సత్యేందర్‌ జైన్‌, ఆయన కుటుంబసభ్యుల పేరిట నాలుగు షెల్‌ కంపెనీలు ఉన్నట్లు వివరించారు స్మృతీ ఇరానీ. హవాలా ఆపరేటర్ల ద్వారా రూ.16కోట్ల 39 లక్షల మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని తెలిపారు. ఇవన్నీ నిజమో కాదో కేజ్రీవాల్‌ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. అవినీతిపరుడైన మంత్రికి ఓ న్యాయమూర్తి మాదిరిగా కేజ్రీవాల్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడమేంటని మండిపడ్డారు.

ఇదీ చదవండి: సోనియా, రాహుల్​కు ఈడీ సమన్లు.. కాంగ్రెస్, భాజపా మాటల యుద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.