ETV Bharat / state

నిజాం షుగర్స్​పై ప్రభుత్వం ఫోకస్- ఫ్యాక్టరీకి పూర్వవైభవం వచ్చేనా?

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2024, 9:58 PM IST

Nizam Sugar Factory at Bodhan : నిజామాబాద్‌ జిల్లా పేరెత్తగానే పసుపుతో పాటు ప్రసిద్ధి చెందిన పంట చెరకు. అంత ప్రసిద్ధి కాబట్టే జిల్లాలోని బోధన్‌లో అతిపెద్ద చక్కెర కర్మాగారం వెలిసింది. ఐతే కర్మాగారం మూతపడి ఏళ్లు గడవడంతో చెరకు సాగు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కర్మాగారాన్ని తెరిపిస్తామన్న అంశం ఇన్నాళ్లూ రాజకీయ హామీగా మిగిలిపోగా పునరుద్ధరిస్తామన్న కొత్త ప్రభుత్వ ప్రకటనతో రైతులు, కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పరిశ్రమను తిరిగి తెరిపించేందుకు అవసరమైన సిఫార్సుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రభుత్వం కమిటీ వేసింది. సాధ్యాసాధ్యాలు, పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులు, అయ్యే వ్యయం, తీర్చాల్సిన అప్పులు.. ఇలా అన్నింటిపై కమిటీ అధ్యయనం చెయ్యనుంది. 2 నెలల్లోగా కమిటీ తన నివేదిక ఇవ్వనుంది. తిరిగి పరిశ్రమ తెరుచుకుంటే బోధన్ ప్రాంతం పూర్వ వైభవం సంతరించుకోనుంది.

CM Plan to Reopen Nizam Sugars
Nizam Sugar Factory Bodhan

నిజాం షుగర్స్​పై ప్రభుత్వం ఫోకస్- ఫ్యాక్టరీకి పూర్వవైభవం వచ్చేనా?

Nizam Sugar Factory at Bodhan : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ కేంద్రంగా 1938లో నిజాం సర్కారు, నిజాం చక్కెర కర్మాగారం ప్రారంభించింది. పరిశ్రమకు కావాల్సిన చెరుకు ఉత్పత్తి కోసం 16వేల ఎకరాల భూమిని సేకరించి చక్కెర ఉత్పత్తి ప్రారంభించింది. అప్పట్లో ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా బోధన్‌ నిజాం షుగర్స్‌(Nizam Sugars) వెలుగు వెలిగింది. పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు ఉపాధి పొందాయి. బోధన్‌లో ప్రధాన యూనిట్‌తో మొదలైన ఈ పరిశ్రమ ఉమ్మడి రాష్ట్రంలో మెదక్, నల్గొండ, అనంతపురం జిల్లాలను కలుపుకొని 7 యూనిట్లుగా విస్తరించింది. బోధన్‌తో పాటు జగిత్యాల జిల్లా ముత్యంపేట, మెదక్ జిల్లా మొంబోజీపేటలో మినహా మిగతావి ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లాయి.

ప్రస్తుతానికి బోధన్, ముత్యంపేట, మొంబోజీపేట్ యూనిట్లు 51% ప్రైవేటు, 49 % ప్రభుత్వ వాటా భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఆ ప్రాంతంలో చక్కెర పరిశ్రమ రాకతో ఉపాధితో పాటు విద్య, వైద్య సౌకర్యాలు సైతం స్థానికులకు అందుబాటులోకి వచ్చాయి. బోధన్‌ షుగర్స్‌ పరిశ్రమ పరిధిలో వేలాది ఎకరాల్లో చెరుకు పంట సాగైంది. బోధన్‌, కోటగిరి, వర్ని, ఎడపల్లి, రెంజల్‌, నిజామాబాద్‌ రూరల్‌తో పాటు ఇతర మండలాల్లోనూ చెరుకు పండించారు. పరిశ్రమ నడిచిన రోజుల్లో 40వేల ఎకరాల్లో చెరుకు పంటను ఇక్కడి రైతులు సాగు చేసేవారు. చెరుకు సాగు విస్తీర్ణం తగ్గటం, మార్కెట్లో చక్కెర ధర కంటే ఉత్పాదన వ్యయం పెరిగిన క్రమంలో కర్మాగారాలు నష్టాల్లోకి వెళ్లాయి.

Cong Committee on Nizam Sugars : అంతర్జాతీయ ఒడుదొడుకులు ఓ కారణమైతే, ప్రభుత్వ విధానాలు కూడా పరిశ్రమ నష్టాల బాట పట్టడానికి కారణమైందన్న విమర్శ ఉంది. దీంతో ఘనకీర్తి కలిగి ఓ వెలుగు వెలిగిన బోధన్‌ నిజాం షుగర్స్‌ పరిశ్రమ ప్రస్థానం మూసివేత దిశగా సాగింది. 2002లో దీన్ని ప్రైవేటీకరించారు. అప్పటి నుంచి నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి. తర్వాత ప్రభుత్వంలో దీనిపై ఒక కమిటీని నియమించారు. అది ఫ్యాక్టరీని ప్రభుత్వం టేకోవర్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. కానీ అనంతర కాలంలో వైఎస్ మరణంతో అది అక్కడే ఆగిపోయింది.

ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, దానికి పూర్వ వైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడకపోవడంతో 2015 వరకు పరిశ్రమ నష్టాల బాట పట్టగా నాటి యాజమాన్యం మూసివేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశ్రమ మళ్లీ తెరుచుకోలేదు. తిరిగి తెరిపించే విషయంలో కార్మికులు, రైతులు అనేక ఉద్యమాలు చేస్తూ వచ్చారు.

కంపెనీపై లేఆఫ్‌ ఎత్తివేయాలని పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్న రైతులు, కార్మికులు ఎన్నో రిలేదీక్షలు, ఆమరణ దీక్షలు చేశారు. రాజకీయ పార్టీలు సైతం వారికి మద్దతు ప్రకటించాయి. అలా బోధన్‌ నిజాం షుగర్స్‌ పరిశ్రమ అంశం కాలక్రమేణ రాజకీయపార్టీలకు ఎన్నికల ప్రచార హామీగా మారిపోయింది. ఈ క్రమంలోనే 2018 ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో పరిశ్రమ తెరుస్తామని మాట ఇచ్చినా ఆ కల నెరవేరలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ మూతపడ్డ చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపించే ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై తొలి అసెంబ్లీ సమావేశాల్లోనూ మండలిలో అడిగిన ఓ ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తూ, నిజాం చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపించే విషయంలో నాటి హామీని ప్రస్తావించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సిఫార్సుల కమిటీ ఏర్పాటు చేసింది.

CM Plan to Reopen Nizam Sugars : పునరుద్ధరణపై సిఫార్సుల కమిటీని గత నెల 12న ప్రభుత్వం నియమించింది. అవసరమైన సిఫార్సుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కమిటీ వేసింది. 2 నెలల్లోగా ఈ అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించింది. 10 మంది సభ్యులు గల కమిటీకి ఐటీ,వాణిజ్య, పరిశ్రమలశాఖల మంత్రి శ్రీధర్ బాబు ఛైర్మన్‌గా, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సహా ఛైర్మన్​గా వ్యవహరించనున్నారు.

సిఫార్సుల కమిటీ సభ్యులుగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌లకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులైన ఆర్థిక, పరిశ్రమలు, వ్యవసాయ, సహకార శాఖల ముఖ్య కార్యదర్శుతో పాటు నిజాం షుగర్స్ లిమిటెడ్ ఎండీలు కూడా కమిటీ సభ్యులుగా ఉన్నారు. తాజాగా సిఫార్సుల కమిటీ ఇప్పటికే తన కార్యాచరణ ప్రారంభించింది. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ భేటీ అయిన కమిటీ పరిశ్రమ పునరుద్ధరణపై సుదీర్ఘంగా చర్చించింది.

చక్కెర కర్మాగారాల పునరుద్ధరించాలనే ఆలోచన చేసిన క్రమంలో ప్రధానంగా 3 సవాళ్లు ఎదురవుతున్నాయి. బోధన్ యూనిట్లో సీజన్లో 5 లక్షల టన్నుల మేర చెరకు ఆడించేవారు. ఇందుకు అప్పట్లో 20 వేల ఎకరాలకు పైగా ఈ పంట సాగయ్యేది. దీంతో కర్మాగారంలో 3 షిప్టుల్లో ఉత్పాదన సాగేది. క్రమంగా పంట విస్తీర్ణం తగ్గటం, కర్మాగారం నష్టాలు చవిచూసి మూతపడింది. ప్రస్తుతం జిల్లాలో వందల ఎకరాల్లో కూడా చెరకు పండటం లేదు. ఉచిత విద్యుత్తు, నీటి వసతి, మద్దతు ధర, ఏడాదికి 2 పంటల సౌలభ్యం కారణంగా రైతులు వరి వైపు మళ్లారు. వీరు ఇప్పుడు ఎందరు తిరిగి చెరకు సాగు చేస్తారనేది కీలకం.

ఏడాది పంట చెరకు సాగుకు కర్మాగారం యాజమాన్యంతో ఒప్పందాలు ఉంటేనే రైతులు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. మూతపడిన కర్మాగారాలపై బ్యాంకుల్లో అప్పులున్నాయి. వీటికి సంబంధించి, వన్‌టైం సెటిల్​మెంట్​ కింద 190 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉన్నట్లు కమిటీ అంచనా వేసింది. వీటిని ప్రభుత్వం విడుదల చేస్తేనే ముందడుగు పడే అవకాశం ఉంది. కర్మాగారాల్లోని యంత్ర పరికరాలు మరమ్మతులతో వినియోగించే స్థితిలో ఉండాలి. లేకుంటే కొత్తవి కొనుగోలుకు భారీ వ్యయం చేయాల్సి ఉంటుంది. వీటిని అధిగమిస్తే, కర్మాగారాలను తెరిచి నిర్వహించే అవకాశం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రైతులు, రైతు సంఘాలు, కర్మాగారాల నిర్వాహకులు, మార్కెట్ నిపుణులతో సంప్రదింపులు జరపనున్నారు. చక్కెరతో పాటు ఉపఉత్పత్తుల వినియోగంపైనా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని నెరవేర్చి, బోధన్ షుగర్ పరిశ్రమ తెరిచి ఇథనాల్ ఉత్పత్తి ప్రారంభించి పరిశ్రమకు పూర్వవైభవం తేవాలని తమను ఆదుకోవాలని ఇక్కడి కార్మికులు, రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వం ఈ చక్కర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి. ఈ కార్మాగారంపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. గత పాలకులు నిజాం షుగర్స్​పై ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయారు. రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి, మాకు ఉపాధి పునరుద్ధరించాలి. - కార్మికుడు

నిజాం షుగర్స్ పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - హాజరైన మంత్రులు శ్రీధర్​ బాబు, దామోదర

నిజాం చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభంపై ప్రభుత్వం కసరత్తు - కార్మికుల్లో చిగురిస్తున్న ఆశలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.