ETV Bharat / state

నిజాం చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభంపై ప్రభుత్వం కసరత్తు - కార్మికుల్లో చిగురిస్తున్న ఆశలు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2024, 8:11 PM IST

Government Focus on Nizam Sugar Factory Opening : ఎన్నో ఏళ్లుగా మూసివేసి ఉన్న నిజాం షుగర్స్ చక్కెర కర్మాగారం పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. చక్కెర పరిశ్రమ తెరుచుకుంటుందనడంతో రైతులు, కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పరిశ్రమ తిరిగి తెరుచుకుంటే బోధన్ ప్రాంతం పూర్వ వైభవం సంతరించుకోవడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది.

CM Revanth Assurance on Nizam Deccan Sugar Factory
Government Focus on Nizam Sugar Factory Opening

Government Focus on Nizam Sugar Factory Re-Opening : మూతపడిన నిజాం చక్కెర పరిశ్రమను తెరిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నం సాగిస్తుంది. కర్మాగారం తిరిగి తెరిపించేందుకు అవసరమైన సిఫార్సుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులతో కమిటీ వేసింది. ఈ అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించింది. రెండు నెలల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ప్రధాన కర్మాగారంతో పాటు జగిత్యాల జిల్లా ముత్యంపేట, మెదక్ జిల్లా మొంబోజీపేట్‌లోని అనుబంధ కర్మాగారాలు ఏళ్లుగా మూసి ఉన్నాయి. ఇప్పుడు దీన్ని తిరిగి ప్రారంభమవుతుందనడంతో కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

పది మంది సభ్యులు గల కమిటీకి ఛైర్మన్‌గా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సహ ఛైర్మన్‌గా వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యవహరించనున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ సిఫార్సుల కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులైన ఆర్థిక, పరిశ్రమలు, వ్యవసాయ, సహకారశాఖల ముఖ్య కార్యదర్శుతో పాటు నిజాం షుగర్స్ లిమిటెడ్ ఎండీలు కమిటీ సభ్యులుగా ఉన్నారు.

పరిశ్రమ పునః ప్రారంభించి ఇక్కడే ఉత్పత్తి చేయండి.. షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల విన్నపం

సిఫార్సుల కమిటీ తన కార్యాచరణను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించనుంది. తొలుత హైదరాబాద్‌లో భేటీ కానుంది. సమావేశంలో పరిశ్రమలు గతంలో కొనసాగిన తీరుతెన్నులు మూతపడేందుకు దారితీసిన పరిస్థితులపై చర్చించనున్నారు. బ్యాంకుల మార్టిగేజ్, యంత్ర పరికరాలు వినియోగ సామర్ధ్యాల అంశాలు కీలకంగా చర్చించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

CM Revanth Assurance on Nizam Deccan Sugar Factory : చక్కెర పరిశ్రమ పూర్వం ప్రభుత్వం అధీనంలో కొనసాగింది. ఆ తర్వాత 51 శాతం ప్రైవేటు భాగస్వామ్యం చేతుల్లోకి వెల్లడంతో నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్‌గా మారింది. చాలాకాలం పాటు నిర్వహణ సమస్యలు ఎదుర్కొంటూ క్రమంగా ఉత్పత్తి తగ్గిపోయి 2015లో మూతపడింది. తిరిగి తెరిపించే విషయంలో కార్మికులు , రైతులు అనేక ఉద్యమాలు చేస్తూ వచ్చారు. అయినా ఫలితాలివ్వలేదు.

చెరకు రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కృషి : మంత్రి దామోదర

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నప్పుడు మూత పడ్డ చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపించే ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాం చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపించే విషయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. తన పాదయాత్ర సమయంలోనూ రైతులతో మాట్లాడినట్లు తెలిపారు.

త్వరలోనే ఈ అంశంపై సిఫార్సుల కమిటీని ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకొని ముందడుగు వేస్తామన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సిఫార్సుల కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. తిరిగి తెరిపించే క్రమంలో 51 శాతంగా ఉన్న భాగస్వామి సుముఖంగా ఉంటే సంయుక్తంగా లేకుంటే ప్రభుత్వపరంగా నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయడం పట్ల రైతులు, కార్మికుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. అదే జరిగితే పరిశ్రమలకు పూర్వ వైభవం వస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిజాం చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభంపై ప్రభుత్వం కసరత్తు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

Farmers Protest: చక్కెర ఫ్యాక్టరీ ముందు రైతుల ఆందోళన

ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రారంభించాలని రైతుల డిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.