ETV Bharat / international

'ప్రపంచ సమస్యలపై భారత్ తెలివిగా వ్యవహరిస్తోంది'- నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 9:37 AM IST

Nikki Haley Comments On India : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో భారత్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ అన్నారు. కానీ, ఇప్పటికైతే అగ్రరాజ్యం పెద్దన్న పాత్ర పోషించటంపై మాత్రం భారత్​కు విశ్వాసం లేదని ఆమె వ్యాఖ్యానించారు.

Nikki Haley Comments On India
Nikki Haley Comments On India

Nikki Haley Comments On India : అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్‌ భాగస్వామిగా ఉండాలనుకుంటుందన్నారు. కానీ, ఇప్పటికైతే అగ్రరాజ్యం పెద్దన్న పాత్ర పోషించటంపై మాత్రం వారికి విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల మధ్య భారత్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తోందన్నారు. ఇందులో భాగంగానే రష్యాకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తోందని అని ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్కీ హేలీ చెప్పారు.

'నేను అమెరికా తరఫున భారత వ్యవహారాలనూ చూశాను. భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. వారు రష్యాతో కాకుండా అమెరికాతో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. కానీ, ప్రస్తుతం మన నేతృత్వంపై వారికి విశ్వాసం లేదు. మనం చాలా బలహీనంగా ఉన్నామనుకుంటున్నారు. భారత్‌ చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తోంది. అందుకే వారికి భారీ ఎత్తున సైనిక ఆయుధాలను సరఫరా చేసే రష్యాకు సన్నిహితంగా ఉంటూ వస్తోంది' అని హేలీ అన్నారు.

అమెరికా ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలపైనే అధికంగా దృష్టి పెట్టిందని హేలీ చెప్పారు. అలా కాకుండా ఇతర భాగస్వాములతోనూ సత్సంబంధాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అప్పుడే అమెరికాతో మిత్రదేశాలైన భారత్‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, జపాన్‌, దక్షిణకొరియా, న్యూజిలాండ్‌ కలిసి వస్తాయని వివరించారు.

అమెరికాతో చైనా యుద్ధమా?
Nikki Haley Comments On China : ప్రస్తుతం చైనా ఆర్థిక పరిస్థితి బాగోలేదని హేలీ అన్నారు. రోజురోజుకు అక్కడి ప్రభుత్వం మరింత నియంతృత్వాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. గతకొన్నేళ్లుగా వారు అమెరికాతో యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. అది వారి తప్పిదం అని వ్యాఖ్యానించారు.

నోటా వచ్చిన తొలి అభ్యర్థి హేలీ
American Elections 2024 : ఇక అమెరికా ఎన్నికల విషయానికొస్తే నెవడా రాష్ట్రంలో రిపబ్లికన్‌ ప్రైమరీలో నిక్కీ హేలీ మంగళవారం ఓటమి పాలయ్యారు. ఇందులో ఆమెకు 31 శాతం ఓట్లు రాగా, నోటాకు 63 శాతం వచ్చాయి. రేసులో ఆమె కంటే ముందున్న మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ ప్రైమరీలో పోటీపడలేదు.

బ్యాలెట్‌ పత్రంలో అభ్యర్థుల పేర్లతో పాటు నోటా తరహాలో 'ఈ అభ్యర్థులెవరూ కారు(None Of The Above)' అనే కాలమ్‌ను ఉంచారు. నెవడాలో దీనిని 1975లో ప్రవేశపెట్టారు. అయితే నోటాను ప్రవేశపెట్టిన తర్వాత ఓటమి చవిచూసిన తొలి అభ్యర్థి నిక్కీ హేలీయే. ఇక హేలీ సొంతరాష్ట్రం దక్షిణ కరోలినాలో ఈనెల 24న ప్రైమరీ ఎన్నికలు జరుగనున్నాయి. అందులో ట్రంప్‌, హేలీ పోటీపడతారు.

'ట్రంప్‌నకు ఓటమి తప్పదు'- అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో బైడెన్‌కు తొలి విజయం

భారతీయులకు అమెరికా గుడ్‌న్యూస్‌- ఆ వీసాదారులపై ఆంక్షల ఎత్తివేత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.