ETV Bharat / international

భారతీయులకు అమెరికా గుడ్‌న్యూస్‌- ఆ వీసాదారులపై ఆంక్షల ఎత్తివేత!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 3:35 PM IST

H4 Visa Bill US Senate : భారతీయులకు అమెరికా ప్రభుత్వం గుడ్​ న్యూస్​. హెచ్‌-1బీ వీసా కలిగిన వారి జీవిత భాగస్వాములు, వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా జారీ చేసే హెచ్‌-4 వీసాలకు సంబంధించి కీలక బిల్లుకు బైడెన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మీకోసం.

H4 Visa Bill US Senate
H4 Visa Bill US Senate

H4 Visa Bill US Senate : హెచ్‌-4 వీసాదారులకు ఊరటనిచ్చే కీలక బిల్లును త్వరలో అమెరికా సెనెట్‌ ఆమోదించనుంది. దీంతో దాదాపు లక్ష మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ మేరకు ఆదివారం అమెరికన్‌ సెనెట్‌లో రిపబ్లికన్‌లు, డెమోక్రాట్‌ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల్లో 'జాతీయ భద్రతా ఒప్పందానికి' ఆమోద ముద్ర వేసేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. హెచ్‌-1బీ వీసా కలిగిన వారి జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్‌-4 వీసాలను జారీ చేస్తారు.

హెచ్‌-4 వీసా కలిగిన వారు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ), ఐ-765 కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తయి ఆథరైజేషన్‌ వస్తేనే వారు ఉద్యోగం చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇది పూర్తి కావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. దీనివల్ల హెచ్‌-4 వీసా ఉన్న వారు ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న నిబంధనలు మార్చి హెచ్‌-4 వీసా కిలిగిన వారికి 'ఆటోమేటిక్‌ వర్క్‌ ఆథరైజేషన్‌' కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు శ్వేతసౌధం ఓ ప్రకటనలో వెల్లడించింది.

సరిహద్దులు సేఫ్​!
''కొత్తగా తీసుకొస్తున్న ఈ బిల్లు మన దేశాన్ని బలోపేతం చేయడం సహా సరిహద్దులను సురక్షితంగా ఉంచుతుంది. చట్టబద్ధ వలసలకు అవకాశం కల్పిస్తుంది'' అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ''ఈ విధానం కింద ప్రతి సంవత్సరం 18 వేల మందికి ఉపాధి ఆధారిత గ్రీన్‌ కార్డ్‌లను జారీ చేస్తారు. ఐదేళ్లలో దాదాపు 1,58,000 మందికి లబ్ధి చేకూరుతుంది. అంతేకాకుండా, సంవత్సరానికి 25 వేల మంది K-1, K-2, K-3 వలసేతర వీసా (పర్యటకం, వైద్యం, వ్యాపారం వంటి తాత్కాలిక పనుల నిమిత్తం జారీ చేసే వీసా) ఉన్నవారితోపాటు, లక్ష మంది హెచ్‌-4 వీసాదారులకు తమ జీవిత భాగస్వామి పనిచేసే ప్రాంతంలో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది'' అని వైట్‌హౌస్‌ పేర్కొంది.

ట్రంప్ రద్దు- బైడెన్ ఊరట
ఈ హెచ్‌-4 వీసాదారులకు ఉద్యోగాలు చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తూ 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో శాస్త్ర సాంకేతిక (STEM) రంగాల్లో నైపుణ్యం కలిగి ఉద్యోగం కోసం యూఎస్​ వెళ్లిన వారికి ఆర్థికంగా కొంత ఊరట లభించింది. ఈ హెచ్​-4 వీసాలు పొందిన వారిలో ఎక్కువ మంది భారతీయ మహిళలే ఉన్నారు. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై ఆంక్షలు విధించారు. దీంతో వివిధ రంగాల్లో నిపుణులైన భారతీయులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు ఈ ఆంక్షలు ఎత్తివేసేందుకు బైడెన్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఇక అమెరికా వీసా మరింత భారం- హెచ్​1బీ సహా ఐదు కేటగిరీల ఫీజులు పెంపు

హెచ్​-1బీ వీసాల జారీకి కొత్త రూల్స్​!- మారిన నిబంధనలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.