తెలంగాణ

telangana

వజ్రపు గుండు... అమరవీరుల బలిదానాల ప్రదేశం

By

Published : Sep 16, 2020, 5:22 PM IST

నిజాం రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం చేసి ఎంతోమంది వీరులు అమరులయ్యారు. అమరువీరుల బలిదానాలకు చెందిన చారిత్రక ప్రదేశాలు నిర్లక్ష్యానికి గురువుతున్నాయని పలువురు ప్రముఖులు అన్నారు. వరంగల్​ పట్టణ జిల్లా ముల్కనూరులోని వజ్రపు గుండును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్విహించాలని కోరుతున్నారు.

the place of martyr martyrdom warangal urban district
వజ్రపు గుండు... అమరవీరుల బలిదానాల ప్రదేశం

నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పోరాటాలు చేసి అమరులైన అమరవీరుల బలిదానాలకు చెందిన చారిత్రక ప్రదేశాలు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతూ కనుమరుగవుతున్నాయి. వరంగల్ పట్టణ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామ సమీపంలో ఆర్లగుట్టలోని వజ్రపు గుండు వద్ద నిజాం రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఏడుగురు సాయుధ పోరాట వీరులు రజాకార్ల తూటాలకు బలయ్యారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా భీమదేవరపల్లి మండలంలోని చాలామంది యువకులు ఉద్యమాన్ని కొనసాగిస్తూ, వివిధ గ్రామాల్లో తిరుగుతూ రజాకార్ల ఆగడాలను దురాగతాలను ఎండగడుతూ ప్రజలను చైతన్య పరుస్తూ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ముల్కనూర్ గ్రామ సమీపంలోని ఆర్లగుట్టలో ముల్కనూర్ గ్రామానికి చెందిన గుళ్ళ రోశయ్య, ముత్తారానికి చెందిన మేకల కొమురయ్య, రేణిగుంట్ల వెంకటయ్య, ఎర్రబెల్లికి చెందిన నాగ్య, వంజరి వెంకటయ్య, రంగయ్యపల్లికి చెందిన ఎల్లబోయిన ఐలయ్య, సీతరాజయ్య అనే వ్యక్తులను రజాకార్లు పట్టుకొని వజ్రపు గుండుకు కట్టేసి ఒకేసారి కాల్చి చంపడం జరిగింది. ఈ బలిదానం స్ఫూర్తితో నాడు ముల్కనూరుకు చెందిన పడాల చంద్రయ్య, భోజపురి వెంకటయ్య లాంటివారు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు.

వజ్రపు గుండు... అమరవీరుల బలిదానాల ప్రదేశం

ఈ వజ్రపు గుండు వద్ద జరిగిన అమరుల బలిదానాలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా ఈ ప్రాంతానికి చెందిన చాలామంది పోరాటాలు చేశారు. కానీ నేడు ఆ బలిదానాలు జరిగిన వజ్రపు గుండు ప్రాంతం చెట్లు తుప్పలు పెరిగి నిర్లక్ష్యానికి గురవుతోంది. కనీసం ప్రజాప్రతినిధులు, అధికారులు బలిదానాలు జరిగిన ఈ ప్రాంతాన్ని ముందు తరాలకు సజీవ సాక్ష్యాలుగా అందించాల్సిన బాధ్యతను గుర్తించడం లేదని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి ఆర్లగుట్టలోని వజ్రపు గుండును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని గ్రామంలోని ప్రముఖులు అంటున్నారు. నిజాం రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం చేసి ఎంతోమంది వీరులు అమరులయ్యారన్నారు. వారి పోరాటం ఫలితంగానే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ హైదరాబాద్ సంస్థానం నిజాం రజాకార్ల నుండి విముక్తి పొంది భారతదేశంలో విలీనం అయిందన్నారు. వారు బలిదానాలు అయిన ప్రదేశాలను గుర్తించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడంతోపాటు, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకారులు, పలువురు ప్రముఖులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:'అసెంబ్లీపై జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేద్దాం'

ABOUT THE AUTHOR

...view details