తెలంగాణ

telangana

Deers Destroying Crops : చెంగు చెంగున ఎగురుతూ.. పంట పొలాలను ఆగం చేస్తూ

By

Published : Jul 6, 2023, 10:04 AM IST

Deer Attack On Crops : ఆరుగాలం శ్రమించి పండించిన పంట ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోవటం చూశాం. కానీ అక్కడ విత్తనాలు నాటారో లేదో కళ్లముందే మొలకెత్తిన పంట నాశనమైపోతుంది. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి, చేసిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. మరో జీవనాధారం లేని రైతులు గత్యంతరం లేక మళ్లీ కొత్త విత్తనాలు నాటుతూ ఇబ్బందులు పడుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గ కర్షకులు నాలుగేళ్లుగా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇంతకి అన్నదాతలను ఆవేదనకు గురిచేస్తున్న సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం.

Deer
Deer

రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న జింకలు

Deers Destroying Crops In Narayanpet District : సాధారణంగా విత్తనాలు మొలకెత్తితే రైతులు ఎంతో సంతోషిస్తారు. కానీ నారాయయణపేట జిల్లాల్లోని ఊట్కూరు, మక్తల్‌, మానగూరు సమీప మండలాల్లోని కర్షకులు మాత్రం బెంబేలెత్తిపోతారు. కారణం కాస్త వానలు పడితే చాలు అటవీ ప్రాంతం నుంచి బయటికొచ్చి జింకలు పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఒక్కసారి పొలం నుంచి జింకల గుంపు వెళ్లిందంటే చాలు పంటపైన ఆశలు వదులుకోవాల్సిందే. మొలకెత్తిన విత్తనాలు ఆకులు చిగురిస్తే అక్కడే మేసేస్తాయి. సాగు కోసం చేసిన దున్నకాలు, కూలీ, విత్తనాలు, ఎరువుల ఖర్చులు ఆవిరైపోతాయి. పత్తి, కంది, ఆముదం, కూరగాయలు సహా ఏ పంటైనా జింకలకు బలి కావాల్సిందే. ఒకసారి దాడి చేస్తే ఎకరానికి రూ.20,000 నష్టపోవాల్సిందేననిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొలాలపై దాడులు చేసే జింకలను అ‌క్కడి రైతులు నియంత్రించలేకపోతున్నారు. రేయింబవళ్లూ పంటలకు కాపలా కాస్తున్నా ఎటు నుంచి వస్తాయో తెలియక సతమతమవుతున్నారు. ఎప్పుడు వస్తాయో అంతు చిక్కదు. వందల కొద్దీ వచ్చిన జింకలను ఓ వైపు వెళ్లగొట్టినా మరోవైపు నష్టం చేస్తాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్నిసార్లు నష్టపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ పంటలు వేసుకోవాల్సి వస్తోందని కన్నీటిపర్యంతమవుతున్నారు.

Deer Attack On Crops :జింకల సమస్యలను పరిష్కరించాలని నాలుగైదు ఏళ్లుగా ప్రజాప్రతినిధులకు, అటవీశాఖ అధికారులకు ఎన్నో విజ్ఞప్తులు చేశామని రైతులు పేర్కొన్నారు. జరిగే నష్టాన్ని భరించలేక మంగళవారం ఉట్కూరు చౌరస్తా వద్ద ధర్నాకు సైతం దిగారు. అయినా అధికారులు సర్ది చెప్తున్నారే తప్పా చర్యలు తీసుకోవట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఇలాగైతే తమ సాగు సాగెదేలా అని గోడు వెలిబుచ్చుతున్నారు.

"సాయంత్రం వచ్చి కాపలా కాయలి. మళ్లీ ఉదయం వేగంగా వచ్చినా సరే జింకలు గుంపుగుంపులుగా వస్తూనే ఉంటాయి. మొక్కలను నాశనం చేసి పోతాయి. ఎకరాలకు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలా ఉంటే వీటికే డబ్బు మొత్తం అయిపోతుంది. ప్రభుత్వమే ఇందుకు తగిన పరిష్కారం చూపాలి." - బాధిత రైతులు

Deers Destroying Crops : జిల్లాలోనే అనువైన ప్రాంతాన్ని చూసి అక్కడికి జింకల్ని తరలించి సంరక్షిస్తామని రెండేళ్లుగా అటవీశాఖ అధికారులు చెబుతూ వస్తున్నా.. ఇప్పటికి ఆచరణకు నోచుకోలేదు. వన్యప్రాణి సంరక్షణ చట్టాలు అమల్లో ఉండటంతో రైతులు సైతం జింకల జోలికి వెళ్లడం లేదు. కృష్ణా పరివాహకంలోని మెట్ట ప్రాంతాల్లో జింకల సంతతి వేగంగా వృద్ధి చెందుతోంది. వరి సాగయ్యే ప్రాంతాలను వదిలి ఆరుతడి పంటలు పండే ప్రాంతాల్లో జింకల సంచారం అధికంగా ఉంటోంది. ఈ జింకల సమస్య తీరాలంటే వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సాగుదారులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే రైతుబంధు తరహాలో బాధిత రైతులకు ఎకరానికి రూ.10,000 వరకు పరిహారం అందించాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details