తెలంగాణ

telangana

Writer yadagiri: 'తెలంగాణ సోయి.. మరుగునపడ్డ ప్రతిభకు గుర్తింపు'

By

Published : Jul 19, 2021, 2:00 PM IST

తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అధ్యాపకుడు ఆయన. పల్లెల్లోని సామాజిక స్థితిగతులు, మనుషుల ఆవేదన, ఆక్రందనలు తెలిసిన ఆచార్యుడు. అందుకే మలి ఉద్యమ సమయంలోనూ కీలకపాత్ర పోషించిన ఆ పెద్దాయన... సమాజ హితం కోసం తన కలాన్ని కదిలిస్తూనే ఉంటారు. రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, కళా రంగాల్లో లబ్ద ప్రతిష్ఠులు ఎంతో మంది ఉన్నారు. వారిలో మరుగునపడ్డ వారందరినీ గుర్తించి... చిత్రీకరించి... ఏడాదిపాటు శ్రమించి "తెలంగాణ సోయి" పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని ప్రచురించారు. ఆయనే విశ్రాంత అధ్యాపకుడు గుండోజు యాదగిరి. 35 ఏళ్లుగా తెలుగు అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన.... తెలంగాణ సాహిత్యాన్ని, చరిత్రకారుల విజయగాథలను సామాజిక మాధ్యమాన్నే వేదికగా ప్రపంచానికి పరిచయం చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు.

telangana soyi
తెలంగాణ సోయి

మార్చాల రామాచార్యులు తెలంగాణ తొలితరం చిత్రకారుడు.. బుక్క సిద్ధాంతి.. తెలంగాణలో తొలి రామాయణంలో బతుకమ్మ పాట రచించిన కవయిత్రి.. మరింగంటి రంగకృష్ణమాచార్యులు.. మరుగునపడిన తెలంగాణ యక్షగాన కవి... ఇలా తెలంగాణ గడ్డపై ఎంతో మంది సామాన్యుల నుంచి అసామాన్యులుగా ఎదిగిన మాన్యులను తన రచనల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు గుండోజు యాదగిరి. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన యాదగిరి.. 35 ఏళ్లుగా వివిధ ప్రాంతాల్లో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. ప్రస్తుతం విశ్రాంత అధ్యాపకుడిగా ఉన్న యాదగిరి.... పాఠశాల స్థాయి నుంచే సాహిత్యంపై అభిరుచిని పెంచుకున్నారు. తన ఆలోచనలన్నీ తెలంగాణ చుట్టే తిరిగేవి. తొలి తరం ఉద్యమంలోనూ భాగస్వామ్యమైన యాదగిరి.... తెలంగాణ నేలపై ఉన్న వ్యక్తులు, గ్రామాల చరిత్రను రచనలు, పద్యకవితలు, వ్యాసాల రూపంలో తీసుకొస్తూ ప్రజలను చైతన్యపరిచేవారు.

మొదటి పుస్తకం

ఈ క్రమంలో 1969 ఉద్యమ సమయంలో విద్యార్థి దశలోనే అప్పు చేసి అప్పటి తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని చాటేలా "జై తెలంగాణ విప్లవ ఢంకా" పేరుతో కవితాసంకలాన్ని రచించారు. 2009లో పాలమూరు అధ్యయన వేదిక ఆ పుస్తకాన్ని పునర్​ముద్రించింది. ఉద్యమంలో ఉన్న వారికి ప్రోత్సాహకంగా, అమరవీరుల త్యాగాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఆ కవితా సంకలనం దోహదపడింది. అప్పటి నుంచి తెలంగాణ సాహిత్యం, ఉద్యమంపై నేటి వరకు యాదగిరి 12 పుస్తకాలు రచించారు. కాలగర్భంలో కలిసిపోతున్న శిల్పుల పేర్లను, వారి విశిష్టతను తెలిపేలా శిల్పి ఖండ కావ్యం, రంగాపురం గ్రామచరిత్ర, సమ్మక్క సారలమ్మ బతుకమ్మ పాట, తెలంగాణ తొలితరం చిత్రకారుడు మార్చాల రామాచార్యుల వ్యాస సంపుటి, అమరుడు కొండన్న, డాక్టర్ ముకురాల రామారెడ్డి సాహితీ సమీక్ష... ఇలా ఎంతో మంది లబ్ద ప్రతిష్ఠులైన వారిపై రచనలు, వ్యాసాలు రాసి ప్రజలను ఆలోచింపజేశారు.

స్వయంగా గీసి.. రాసి

60 ఏళ్ల స్వరాష్ట్ర సాధన పోరులో అనేక రంగాల్లో ప్రతిభావంతులైన వారెందరో మరుగునపడ్డారు. వారిని మళ్లీ గుర్తు చేసేందుకు యాదగిరి తన కలాన్ని కదిలించారు. యాదగరి స్వతహాగా చిత్రకారుడు కావడంతో సుమారు ఏడాదిపాటు శ్రమించి 'తెలంగాణ సోయి' పేరుతో 51 మంది చారిత్రక వ్యక్తుల వ్యక్తిత్వాలను చిత్రీకరించారు. 10 రంగాలను ఎన్నుకొని ఆయా రంగాల్లోని విశిష్ట వ్యక్తుల ప్రత్యేకతలను జోడిస్తూ వారి ఫొటోలను స్వయంగా యాదగిరి చిత్రీకరించారు. తెలంగాణ యువతకు స్ఫూర్తినిచ్చేలా 'తెలంగాణ సోయి' పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సాహిత్య ప్రస్థానంలో రచనలు చేయడమే కాదు వాటిని ప్రజలకు చేరువ చేసేందుకు సాంకేతిక ప్రపంచాన్ని వినియోగించుకుంటున్నారు యాదగిరి. ఫేస్​బుక్ వేదికగా 'తెలంగాణ సోయి' పేరుతో చారిత్రక వ్యక్తుల విజయ గాథలను ప్రపంచానికి పరిచయం చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.

అమరులు పాఠ్యాంశం ఆయన రాసిందే

తెలంగాణ తొలి ఉద్యమంలోనే కాదు... మలి ఉద్యమంలోనూ యాదగిరి రచనల ప్రభావం కీలకంగా మారింది. యాదగిరి రచించిన మార్చాల రామాచార్యులు, డాక్టర్ ముకురాల రామారెడ్డి కవిత్వాలను తెలుగు అకాడమీ పుస్తక రూపంలోకి తీసుకొచ్చింది. ఉద్యమంపై యాదగిరి రచించిన పద్యాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన గ్రంథాలయంలో భద్రపర్చుకోవడం విశేషం. అలాగే 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 'అమరులు' పాఠ్యాంశం యాదగిరి రాసిందే కావడం మరో విశేషం.

ఇదీ చదవండి:కేంద్ర జల్‌శక్తి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై కీలక సమావేశం

ABOUT THE AUTHOR

...view details