తెలంగాణ

telangana

అమరుడైన తోటి కానిస్టేబుల్​ కుటుంబానికి అండగా...

By

Published : Dec 13, 2020, 5:40 PM IST

వృత్తిలోకి చేరిన తర్వాత ఏర్పడిన స్నేహం జీవితకాలం కొనసాగడం... కష్టసుఖాలలో పాలుపంచుకోవడం వంటివి.. బంధాల పవిత్రతకు నిదర్శనమని మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. విధి నిర్వహణలో అమరుడైన తోటి కానిస్టేబుల్​ను స్మరిస్తూ.. వారి తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించడం గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

అమరుడైన తోటి కానిస్టేబుల్​ కుటుంబానికి అండగా...
అమరుడైన తోటి కానిస్టేబుల్​ కుటుంబానికి అండగా...

విధి నిర్వహణలో అమరుడైన కానిస్టేబుల్​ కుటుంబానికి అతని బ్యాచ్​మేట్​లు అండగా నిలవడాన్ని మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి కొనియాడారు. కోయిలకొండ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ పండరీ.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని అమ్రాబాద్ ఠాణాలో విధులు నిర్వహించేవాడు. 2002లో జరిగిన మావోయిస్టుల దాడిలో మృతి చెందాడు. తాము ఉద్యోగంలో చేరి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విధి నిర్వహణలో అమరుడైన పండరీని స్మరిస్తూ అతని కుటుంబానికి అండగా ఉండాలని అతని స్నేహితులు భావించారు. తమ బ్యాచ్​మేట్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మృతుని తల్లిదండ్రులకు నూతన వస్త్రాలు, రూ.50వేలు నగదును జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి చేతుల మీదుగా అందించారు.

ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ పండరీ తల్లిదండ్రులు బసప్ప, బాలమ్మ కుటుంబ పరిస్థితులు, బాగోగులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలున్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సహోద్యోగులు అందించే తోడ్పాటు స్నేహితుల మధ్య బంధాలను మరింత పటిష్ఠం చేస్తుందని ఎస్పీ సంతోషం వ్యక్తపరిచారు. స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచిన కానిస్టేబుళ్లను అభినందించారు.

ఇదీ చూడండి:పోలీసు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని సీఎం ఆదేశం

ABOUT THE AUTHOR

...view details