తెలంగాణ

telangana

Khammam Rains 2023 : ముంచిన మున్నేరు.. వరద గుప్పెట్లో ఊళ్లు.. జలదిగ్బంధంలో వందలాది ఇళ్లు

By

Published : Jul 28, 2023, 9:16 AM IST

Heavy Rain in Khammam 2023 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. ఎగువ నుంచి ఊహించని రీతిలో పోటెత్తిన వరదలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలం అవుతోంది. వరద ఉద్ధృతితో.. జలాశయాలు నిండుకుండను తలపిస్తుండగా చెరువులు మత్తడి పోస్తున్నాయి. వరద ధాటికి ఏజెన్సీ ప్రాంతాలు.. గోదావరి పరీవాహక ప్రాంతాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఊళ్లకు ఊళ్లు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంటపొలాలు నీట మునిగాయి. వరదలో చిక్కుకున్న ఓ చిన్నారిని సహా.. ఏడుగురుని ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు రక్షించాయి.

Khammam Rains Today
Khammam Rains Today

ఉమ్మడి ఖమ్మం జిల్లా వర్షాలతో అతలాకుతలం.. ముంచెత్తిన మున్నేరు

Khammam Floods 2023 : భారీ వర్షాలు, వరదలధాటికిఉమ్మడి ఖమ్మం జిల్లా వణికిపోతోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద ఉద్ధృతితో ఖమ్మంలోని మున్నేరు ప్రమాదకరంగా మారింది. ఖమ్మంలో నగరంలోని మోతీనగర్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, జలగంనగర్, ఎఫ్​సీఐ, దానవాయిగూడెం ప్రాంతాల్ని మున్నేరు ముంచెత్తింది. ధంసలాపురం పల్లె దవాఖానా, ప్రకాశనగర్ వైకుంఠథామం వరదల్లో చిక్కుకుంది. వరద బాధిత కాలనీల్లో మోకాలులోతు వరదల్లో పర్యటించిన మంత్రి పువ్వాడ అజయ్‌.. ప్రభావిత కాలనీల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.

Khammam Rains Today :వరదలో చిక్కుకుపోయిన కుటుంబాన్ని ఎన్డీఆర్​ఎఫ్ బృందాలు సురక్షితంగా ఒడ్డుకి చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పద్మావతినగర్‌కి చెందిన లక్ష్మీనారాయణ ఇంటిని వరద నీరు చుట్టముట్టగా సుమారు 14 గంటల పాటు మేడపై ఉండిపోయారు. మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించారు. రెండుబోట్ల ద్వారా అక్కడికి చేరుకొని.. అందరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వారిలో ఆరు నెలల పాప ఉంది. వరద బాధితులు ఎవ్వరూ ఆందోళనకి గురికావద్దని.. అందరినీ ఆదుకుంటామని మంత్రి పువ్వాడ భరోసా కల్పించారు.

Heavy Rain Across Khammam District : పాలేరు వరద ఉద్ధృతితో నాయకన్‌గూడెం వద్ద రహదారిపై రెండున్నర అడుగుల మేర వరద నీరు చేరడంతో ఖమ్మం-సూర్యాపేట రహదారిలో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. కారేపల్లి మండలం బుగ్గవాగు పొంగిపొర్లింది. కారేపల్లిలోని కస్తూర్బా విద్యాలయంలోకి వరదనీరు చేరడంతో విద్యార్థులను ఇళ్లకు పంపించారు. వైరా జలాశయానికి భారీగా వరదచేరడంతో కాల్వలకు నీరు విడుదల చేశారు. ఎమ్మెల్యే రాములు నాయక్‌ జలాశయం తలుపుల వద్ద గంగమ్మతల్లి పూజలు చేసి నీటిని వదిలారు. లోతట్టులో వైరా నదీ పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వైరా జలాశయం అలుగుల నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహాన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.

Heavy Rain In Khammam District :వర్షాలకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు ఉక్కరిబిక్కిరి అవుతున్నాయి. కరకగూడెం, ఆళ్లపల్లి, గుండాల మండలాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. కరకగూడెం మండలం మోతెలో భాస్కర్ అనే వ్యక్తికి చెందిన పౌల్ట్రీ ఫాంలో పెద్దవాగు వరద ఉద్ధృతికి 3 వేల కోళ్లు పౌల్ట్రీ ఫాం కొట్టుకుపోయాయి. ఆళ్లపల్లిలోకిన్నెరసాని వరదల్లో చిక్కుకుని 8 పశువులు మృతి చెందాయి. పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పెద్దవాగు ఉద్ధృతికి 80 కుటుంబాలు వరద ముంపునకు గురయ్యాయి. కరకగూడెం మండలంలో వరద పోటెత్తి చిరుమళ్ల-కరకగూడెం రహదారి ధ్వంసమయైంది. ముల్కలపల్లి మండలం సీతారాంపురం-పాతూరు మధ్య రోడ్డు భారీగా కోతకు గురైంది. దుప్పితోగు వాగులో వరద ప్రవాహంలో గల్లంతైన పాపారావు మృతదేహం లభ్యమైంది. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కిన్నెరసాని, ఏడుమెలికల వాగు, జల్లేరు, తొట్టి వాగుల్లో వరద ఉద్ధృతితో పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏడూళ్ల బయ్యారం పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. భద్రాచలం కొత్తగూడెం మార్గంలో పాల్వంచ మండలం నాగారం వద్ద కిన్నెరసాని ఉప్పొంగగా రాకపోకలు నిలిపివేశారు. ఆ తర్వాత మళ్లీ రాకపోకలు పునరుద్ధరించారు.

Rain In Khammam District :భద్రాచలం విస్తా కాంప్లెక్స్ వద్ద ఉన్న మోటార్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడంతో వర్షపు నీరు రామాలయ పరిసరాలకు చేరింది. అన్నదాన సత్రంలోకి వరదనీరు చేరి అన్నదానం నిలిపివేశారు. పడమర మెట్లమార్గంలో భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తకాలనీలో రెండు మోటార్లు ఏర్పాటు చేసినా విద్యుత్​ అంతరాయంతో పనిచేయలేదు. వరద పెరగడంతో.. దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం ముంపు మండలాలైన కూనవరం, వీఆర్​పురం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details