తెలంగాణ

telangana

VenkaiahNaidu Tweet Today : 'వివిధ భాషల్లో విద్యాబోధనకు కేంద్రం చొరవ సంతోషకరం'

By

Published : Jul 23, 2023, 4:15 PM IST

VenkaiahNaidu on Education in Mother Tongues : వివిధ భాషల్లో విద్యా బోధనకు కేంద్రం చొరవ సంతోషకరమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మాతృభాషలో విద్య బోధించాలని తాను చాలాసార్లు సూచించానని చెప్పారు. 22 భాషల్లో పుస్తకాల తయారీకి ఎన్‌సీఈఆర్‌టీ చర్యలు చేపట్టిందని వివరించారు. వలస పాలన అవశేషాలకు చరమగీతం పాడాలని.. స్థానిక భాషలకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన తరుణం ఇదేనని వెంకయ్యనాయుడు ట్విటర్‌లో తెలిపారు.

Venkaiah Naidu
Venkaiah Naidu

VenkaiahNaidu Respond on Education in Mother Tongues :దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విద్యాబోధనకు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ చొరవ తీసుకోవడం ఆనందదాయకమని.. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మాతృ భాషలో విద్యాబోధన జరగాలని తాను చాలాసార్లు సూచిస్తూనే ఉన్నానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక జాతీయ విద్యా విధానం-2020 దూరదృష్టికి అనుగుణంగా.. భారతీయ భాషలు - మాతృభాష బోధనా మాధ్యమంగా స్వీకరించడానికి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల కాపీని జత చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.

Venkaiah Naidu Tweet Today :భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పొందుపరిచిన 22 భాషల్లో పాఠ్య పుస్తకాలు సిద్ధం చేయడానికి.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌ - ఎన్‌సీఈఆర్‌టీ ఉపక్రమించడం ముదావహం అని వెంకయ్యనాయుడుసంతోషం వ్యక్తం చేశారు. ప్రాధమిక విద్యా స్థాయి 12వ తరగతి వరకు ఈ 22 మాతృ భాషల్లో.. ఏ భాషలోనైనా సరే విద్యాబోధన ఎంచుకోవాలనే ఐచ్చికం సీబీఎస్‌ఈ ఇవ్వటం ఆనందదాయకమని తెలిపారు. సాధారణంగా సామాజికంగా, ఆర్థికంగా మన సర్వతోముఖాభివృద్ధిని అడ్డుకుంటున్న వలస పాలన అవశేషాలకు చరమగీతం పాడాల్సిన సమయమని స్పష్టం చేశారు. స్థానిక భాషలకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన తరుణం ఇదేనని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

CBSE Schools Allowed Teach Mother Tongue :కేంద్రీయ విద్యాలయాలు, ఇతర సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో.. పూర్వప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు మాతృభాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే సీబీఎస్‌ఈ తన అనుబంధ పాఠశాలలకు సర్క్యులర్‌ జారీ చేసింది. బోర్డు పరిధిలోకి వచ్చే అన్ని విద్యాలయాల్లో మాతృభాషను బోధనా మాధ్యమంగా చేసుకొని బహుభాషా విద్యను ప్రోత్సహించాలని అందులో తెలిపింది.

పిల్లలు పూర్వప్రాథమిక స్థాయి నుంచే తమ మాతృభాషపై ప్రత్యేకదృష్టి సారించడంతోపాటు.. ఇతర భాషలను తెలుసుకుంటే.. బహు భాషావాదం చిన్నారుల ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తుందని జాతీయ విద్యావిధానం-2020 కూడా బలంగా చెబుతోంది. కనీసం 5వ తరగతి వరకైనా ఈ విధానం అనుసరించాలని, 8వ తరగతి.. ఆ తర్వాత కూడా ఇదే విధానం మేలని నిర్దేశిస్తోంది. బహుభాషా విద్యావిధానం అమలుకు, బోధనా భాషగా మాతృభాష వాడకానికి ప్రస్తుతం కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి.

CBSE Schools Can Now Teach in Local Languages :భిన్న భాషల్లో బోధించే సామర్థ్యమున్న నిపుణులైన టీచర్లు దొరకడం, నాణ్యమైన బహుభాషా పాఠ్యపుస్తకాల లభ్యత కష్టమవుతోంది. ఈ సవాళ్ల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో భారతీయ భాషల ద్వారానే విద్యాబోధన కొనసాగించేందుకు.. కేంద్ర విద్యాశాఖ పలు చర్యలు చేపట్టింది. 22 భారతీయ భాషల్లో కొత్త పాఠ్యపుస్తకాలు రూపొందించాలని.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌ ఆదేశించింది. ఆ సంస్థ వెంటనే ఈ పనిని ప్రారంభించినందున వచ్చే సీజను నుంచి పిల్లలకు 22 భారతీయ భాషల్లో కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయి.

మరోవైపు.. ఉన్నత విద్యారంగంలోనూ భారతీయ భాషల్లో పాఠ్యపుస్తకాల ముద్రణ పని మొదలైంది. ఆంగ్ల మాధ్యమానికి అదనంగా భారతీయ భాషల్లో బోధన, అభ్యాస ప్రక్రియ కొనసాగించడానికి.. పరీక్షలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. వృత్తినైపుణ్య, వైద్య, న్యాయవిద్యల్లోనూ సాంకేతిక, భారతీయ భాషల్లో పాఠ్యపుస్తకాలు వస్తున్నాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సర్క్యులర్‌లో వెల్లడించింది.

ఇవీ చదవండి:కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయం అభినందనీయం: వెంకయ్యనాయుడు

'మాతృభాషలో బోధనతోనే రాణింపు'

ABOUT THE AUTHOR

...view details