ETV Bharat / opinion

'మాతృభాషలో బోధనతోనే రాణింపు'

author img

By

Published : Aug 5, 2021, 5:24 AM IST

పరాయి భాషల్లో కన్నా మాతృభాషలో బోధన వల్ల బాలల్లో సొంత వ్యక్తిత్వం, ఆత్మగౌరవం ఇనుమడించి సర్వతోముఖ వికాసానికి తోడ్పడతాయని యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు ధ్రువీకరించాయి. అయినప్పటికీ చాలామంది తల్లిదండ్రులు, కొందరు విద్యావేత్తలు ఆంగ్లంలో బోధనను ఇప్పటికీ పట్టుకువేళ్లాడుతూ పాఠశాలల్లో మాతృభాషను రెండో, మూడో భాష స్థాయికి దిగజారుస్తున్నారు.

national education policy
national education policy

ఎంత గొప్ప మార్పు అయినా ఒక విప్లవాత్మక అడుగుతోనే మొదలవుతుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొన్ని ఎంపిక చేసిన శాఖల్లో కోర్సులను పూర్తిగా మాతృభాషలో బోధించాలని ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్‌ కళాశాలలు తీసుకున్న నిర్ణయం భారత విద్యారంగంలో కొత్త చరిత్ర సృష్టించబోతోంది. మలి తరాల భవిష్యత్తును తీర్చిదిద్దనుంది. దీనికి తోడు కొత్త విద్యా విధానం కింద 11 ప్రాంతీయ భాషల్లో బీటెక్‌ కోర్సుల బోధనకు అనుమతించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించడమూ ఒక మహత్తర ఘట్టంగా నిలిచిపోనుంది.

హిందీ, తెలుగు, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, ఒడియా, బెంగాలీ, అస్సామీ, పంజాబీ భాషల్లో బీటెక్‌ను అభ్యసించబోతున్న విద్యార్థులకు కొత్త అవకాశాల ద్వారాలు తెరుచుకోనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త విద్యావిధానం (ఎన్‌ఈపీ) ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ- మాతృభాషలో బోధన వల్ల పేద విద్యార్థులు, గ్రామీణ, గిరిజన విద్యార్థులకు చదువులో రాణించగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ప్రాథమిక విద్యలోనూ మాతృభాషను ప్రోత్సహిస్తున్నామని, దీనికి విద్యాప్రవేశ్‌ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుందని వెల్లడించారు. మాతృభాషల్లో వృత్తి విద్యా కోర్సులను అభ్యసించాలన్న విద్యార్థుల కలలు మరి కొన్నేళ్లలో పూర్తిస్థాయిలో నెరవేరనున్నాయి.

ఏఐసీటీఈ గత ఫిబ్రవరిలో జరిపిన సర్వేలో పాల్గొన్న 83 వేల మంది విద్యార్థుల్లో 44శాతం మాతృభాషలో ఇంజినీరింగ్‌ విద్య నేర్చుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. 2020 నుంచి ప్రారంభమైన ఎన్‌ఈపీ- ప్రాథమిక పాఠశాల నుంచే మాతృభాషలో బోధనకు పట్టం కడుతోంది. దీనివల్ల మన విద్యార్థుల్లో బాల్యం నుంచే అభ్యసన సామర్థ్యం, విజ్ఞాన సముపార్జన శక్తి వేగంగా పెంపొందుతాయి.

దేశమంతా విస్తరిల్లాలి

పరాయి భాషల్లో కన్నా మాతృభాషలో బోధన వల్ల బాలల్లో సొంత వ్యక్తిత్వం, ఆత్మగౌరవం ఇనుమడించి సర్వతోముఖ వికాసానికి తోడ్పడతాయని యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు ధ్రువీకరించాయి. అయినప్పటికీ చాలామంది తల్లిదండ్రులు, కొందరు విద్యావేత్తలు ఆంగ్లంలో బోధనను ఇప్పటికీ పట్టుకువేళ్లాడుతూ పాఠశాలల్లో మాతృభాషను రెండో, మూడో భాష స్థాయికి దిగజారుస్తున్నారు. 'మాతృభాషలోనే విజ్ఞాన శాస్త్రాలను బోధించాలి. లేదంటే సైన్స్‌ అనేది ఉన్నత వర్గాలకు మాత్రమే చెందినదనే అపోహ పెరిగి తీరని నష్టం కలిగిస్తుంది' అని విఖ్యాత భౌతిక శాస్త్రజ్ఞుడు, నోబెల్‌ గ్రహీత సర్‌ సీవీరామన్‌ చేసిన ఉద్బోధను ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయినా, మన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఆంగ్ల మాధ్యమానికి పట్టం కట్టడం వల్ల సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులను మాతృభాషలో అభ్యసించే అవకాశాన్ని అసంఖ్యాక విద్యార్థులు కోల్పోతున్నారు.

అభివృద్ధి చెందిన చోట అలా..

మాతృభాషలో బోధనను చేపట్టిన దేశాల అనుభవాలు, విజయాలను పరిశీలించడం ఉపయుక్తంగా ఉంటుంది. అత్యధిక జీ20 దేశాల్లో అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు స్థానిక భాషల్లో బోధనాభ్యాసాలను నిర్వహిస్తున్నాయి. ఆసియాలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్‌, దక్షిణ కొరియాలలో అత్యధిక విశ్వవిద్యాలయాలు మాతృభాషలో బోధనకు అగ్రప్రాధాన్యమిస్తున్నాయి. కొరియాలో 70శాతం విశ్వవిద్యాలయాలు మాతృభాషలో బోధిస్తూనే అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తున్నాయి. అయినా దక్షిణ కొరియా తల్లిదండ్రుల్లో ఆంగ్లం పట్ల మోజు తగ్గకపోవడంతో అక్కడి ప్రభుత్వం పాఠశాలల్లో మూడో గ్రేడు వరకు ఆంగ్ల భాషా బోధనను నిషేధించింది. జపాన్‌ సైతం మాతృభాషకే పట్టం కట్టి సైన్స్‌, టెక్నాలజీల్లో ప్రపంచంలో అగ్రగామిగా వెలుగుతోంది. చైనా కూడా ఇదే బాటలో ముందుకు సాగుతోంది. ఐరోపాలో మొదటి నుంచీ సైన్స్‌, గణితాల్లో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేస్తున్న ఫ్రాన్స్‌, జర్మనీలు మాతృభాషలో బోధనతోనే అనితర సాధ్య విజయాలు అందుకుంటున్నాయి. ఫ్రాన్స్‌ తన పాఠశాలల్లో ఫ్రెంచి భాషను తప్పనిసరి చేసింది. జర్మనీలో 80శాతం పీజీ కోర్సులను జర్మన్‌ భాషలోనే అందిస్తున్నారు. కెనడాలోని క్వెబెక్‌ రాష్ట్ర జనాభాలో అత్యధిక సంఖ్యాకులు ఫ్రెంచి భాష మాట్లాడతారు. భిన్నత్వంలో ఏకత్వ సూత్రాన్ని అనుసరించి ఇతర రాష్ట్రాల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అనుసరిస్తున్నా, క్వెబెక్‌లో మాత్రం ఫ్రెంచిలోనే విద్యాబోధన సాగిస్తున్నారు. భారతదేశంలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండటం దురదృష్టకరం. ఇక్కడ అత్యధిక వృత్తి విద్యా కోర్సులను ప్రధానంగా ఆంగ్లంలోనే బోధిస్తున్నారు. సైన్స్‌, ఇంజినీరింగ్‌, వైద్య, న్యాయ శాస్త్రాలలోనైతే మాతృభాషకు అవకాశమే లేదని చెప్పాలి. ఈ పరిస్థితి మారాలనే కృత నిశ్చయం ప్రభుత్వంలో, ప్రజల్లో పాదుకొంటోంది.

నూతన విద్యావిధానం మాతృభాషలో బోధనకు పట్టం కడుతోంది. మొదట అయిదో తరగతి వరకు మాతృభాషలోనే బోధించి, ఆపైన క్రమంగా ఉన్నత విద్యా కోర్సులనూ అదే విధంగా బోధించాలి. 14 ఇంజినీరింగ్‌ కళాశాలలు తీసుకున్న నిర్ణయం- ఈ దిశగా పడిన తొలి అడుగు. దేశమంతటా ఇతర కళాశాలలూ ఇదే పద్ధతిని అనుసరించాలి. ప్రైవేటు విశ్వవిద్యాలయాలూ ఆంగ్లంతోపాటు మాతృభాషలోనూ కోర్సులను అందించడం మొదలుపెట్టాలి.

విస్మరిస్తే నష్టమే..

మాతృ భాషల్లో నాణ్యమైన పాఠ్య గ్రంథాలు, రిఫరెన్స్‌ గ్రంథాలూ దొరక్కపోవడం సాంకేతిక కోర్సుల విద్యార్థులకు పెద్ద అవరోధం. దీన్ని అధిగమించి మాతృభాషలో సాంకేతిక విద్యా బోధనాభ్యాసాలు విస్తరించడానికి నడుంకట్టాలి. ఈ డిజిటల్‌ యుగంలో మారుమూల ప్రాంతాల విద్యార్థులకూ సాంకేతిక కోర్సులు అందించడం సుసాధ్యమే. ప్రస్తుతం అంతర్జాలంలో అందుబాటులో ఉన్న గ్రంథాలు ప్రధానంగా ఆంగ్లంలోనివే. అక్కడా మాతృభాషలో సాంకేతిక రచనలను విరివిగా అందుబాటులో ఉంచడానికి ఇతోధిక కృషి సాగాలి. అలా చేస్తే మన బాలలు, యువత సులభంగా మాతృభాషలో అభ్యసనం చేపట్టగలుగుతారు. ఈ దిశగా ఏఐసీటీఈ, ఐఐటీ-మద్రాసు చేపట్టిన కృషి ప్రశంసనీయం. అవి స్వయం కార్యక్రమం కింద సాంకేతిక కోర్సుల గ్రంథాలను తెలుగు, తమిళం, హిందీతో సహా మొత్తం ఎనిమిది ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తున్నాయి. ఇది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గొప్ప వరం అవుతుంది.

ఆంగ్లంతో పాటు.. మాతృభాష

ఉన్నత విద్యను నిజంగా ప్రజాస్వామ్యీకరించాలంటే ఇటువంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి. అలాగని ఆంగ్లాన్ని పూర్తిగా విస్మరించి మాతృభాషనే అంటిపెట్టుకోవాలన్నది నా అభిమతం కాదు. విద్యార్థులు మాతృభాషతోపాటు సాధ్యమైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవాలి. ఈ పరస్పరాశ్రిత ప్రపంచంలో ఆంగ్లంతోపాటు ఇతర భాషా జ్ఞానం కొత్త అవకాశాలను అందిస్తుంది. అయితే, మొదట మాతృభాషలో మాట్లాడటం నామోషీగా భావించే తత్వాన్ని మనం వదిలించుకోవాలి. స్వభాషను విస్మరిస్తే చిరకాల జ్ఞానవిజ్ఞాన నిధిని కోల్పోవడమే కాదు- భావితరాల సాంస్కృతిక మూలాలను, అమూల్యమైన సామాజిక, భాషా వారసత్వాన్ని వారికి అందకుండా ధ్వంసం చేసినవారమవుతాం. పోనుపోను మరిన్ని విద్యాసంస్థలు మాతృభాషలో సాంకేతిక కోర్సులను అందించడానికి ముందుకొస్తాయని ఆశిస్తున్నాను. తద్వారా మన యువతలో నిబిడీకృతమైన అపార శక్తిసామర్థ్యాలను వెలికితీయగలుగుతాం. పరభాషలో మాట్లాడలేకపోతున్నామనే ఆత్మన్యూనతను వదిలించుకుని సగర్వంగా, ఆత్మవిశ్వాసంతో మాతృభాషలో అభ్యసనం చేపట్టి విజయ శిఖరాలను అందుకునే అవకాశాన్ని వారికి కల్పించగలుగుతాం. అందుకే ఎనిమిది రాష్ట్రాల్లో 14 ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రాంతీయ భాషల్లో కోర్సులను బోధించడానికి ముందుకురావడాన్ని అభినందించి ప్రోత్సహించాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.