ETV Bharat / opinion

ప్రాంతీయ భాషల్లో బోధనతోనే నాణ్యమైన విద్య

author img

By

Published : Jul 10, 2021, 7:34 AM IST

technical education in regional languages
ప్రాంతీయ భాషల్లో బోధనతోనే నాణ్యమైన విద్య

పరాయి భాషలో ప్రావీణ్యమే పెద్ద పరీక్షగా మారింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యకు దూరమవుతున్న కోట్లాది ప్రజ్ఞావంతుల ఆశలు ఆకాంక్షలు నెరవేరాలంటే స్థానిక భాషా మాధ్యమాల్లో వృత్తివిద్యా కోర్సుల అందుబాటు ఊపందుకోవాలి. ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్యాబోధనను సత్వరం పట్టాలెక్కించాలని ప్రధాని మోదీ తాజాగా పిలుపుచ్చారు. అంతరాలకు అతీతంగా అందరికీ నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే విద్యావిధానానికి సార్థకత చేకూరుతుందన్నారు. 'విద్యావ్యాప్తి విస్తృతం కావాలంటే స్థానిక భాషల్లో బోధించాల్సిందే'నన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ మేలిమి సూచనకు ప్రభుత్వాలు ఇకనైనా గొడుగుపట్టాలి!

'విదేశీ భాషా పునాదులపై ఏ దేశమూ సమున్నతంగా ఎదగలేదు' అని హెచ్చరించిన ప్రథమ ప్రధాని నెహ్రూ- భారతీయ భాషలతోనే సామాజిక సమతులాభివృద్ధిని సాధించగలమని స్పష్టీకరించారు. విజ్ఞాన పరిధులను విస్తరించుకుంటూ పరిశోధనల్లో యువతరం తేజరిల్లాలంటే అన్ని స్థాయుల్లోనూ ప్రాంతీయ భాషల్లో బోధన కీలకమని డాక్టర్‌ సర్వేపల్లి సారథ్యంలోని 'విశ్వవిద్యాలయ విద్యాసంఘం' సభ్యులు 1949లోనే సిఫార్సు చేశారు. స్వతంత్ర భారతి తొలివేకువలోనే పల్లవించిన ఈ ఆలోచనలకు ఆచరణ రూపమివ్వడంలో దశాబ్దాలుగా జాప్యం జరుగుతోంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్యాబోధనను సత్వరం పట్టాలెక్కించాలని ప్రధాని మోదీ తాజాగా పిలుపిచ్చారు. వంద మంది సాంకేతిక విద్యాసంస్థల సంచాలకులతో వర్చువల్‌ భేటీలో ఆయన ఈ మేరకు పథనిర్దేశం చేశారు. అంతరాలకు అతీతంగా అందరికీ నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే విద్యావిధానానికి సార్థక్యమన్న ప్రధాని- ఉన్నత, సాంకేతిక విద్యారంగంలో భారతీయ భాషల వినియోగం ఇనుమడించాలని కొన్నాళ్లుగా ఉద్ఘాటిస్తూనే ఉన్నారు.

ఆర్నెల్లం క్రితమే..

వైద్య, న్యాయ, ఇంజినీరింగ్‌ వంటి కోర్సులను ప్రాంతీయ భాషల్లో బోధించడంపై మార్గసూచి రూపకల్పనకు ఆర్నెల్ల క్రితమే అమిత్‌ ఖరే నేతృత్వంలో కేంద్రం ప్రత్యేక కార్యదళాన్ని కొలువుతీర్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఎంపిక చేసిన ఐఐటీల్లో, ఎన్‌ఐటీల్లో స్థానిక భాషల్లో బోధన ప్రారంభిస్తామని ప్రకటించింది. తియ్యందనాల తెలుగుతో సహా ఎనిమిది భారతీయ భాషల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల నిర్వహణకు ఇటీవలే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతించింది. నిరుడు ఆ సంస్థ నిర్వహించిన దేశవ్యాప్త అధ్యయనంలో దాదాపు 44 శాతం ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రాంతీయ భాషలనే బోధనా మాధ్యమాలుగా ఎంచుకోవడం- ఎన్నదగిన మార్పును కళ్లకు కడుతోంది. పరాయి భాషలో ప్రావీణ్యమే పెద్ద పరీక్షగా మారిన దుస్థితిలో ఉన్నత విద్యకు దూరమవుతున్న కోట్లాది ప్రజ్ఞావంతుల ఆశలు ఆకాంక్షలు ఈడేరాలంటే- స్థానిక భాషా మాధ్యమాల్లో వృత్తివిద్యా కోర్సుల అందుబాటు ఊపందుకోవాలి.

అమ్మభాషే అత్యుత్తమం..

జ్ఞానార్జన, స్పష్టమైన స్వతంత్రాలోచనలకు దోహదపడటంలో అమ్మభాషే అత్యుత్తమమైనదని అయిదు దశాబ్దాల క్రితమే కొఠారీ కమిషన్‌ స్పష్టీకరించింది. విశ్వవిద్యాలయాల్లోనూ మాతృభాషల్లో బోధించాలని 1968లోనే ఇండియా విధాన నిర్ణయం తీసుకుంది. తాజా నూతన విద్యావిధానమూ ఆ ఒరవడికి కట్టుబాటు చాటుతోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లోని మౌలిక అంశాలపై విద్యార్థులకు పట్టు పెరగాలంటే మాతృభాషా మాధ్యమాలతోనే సాధ్యమని చైనా, జపాన్‌, ఐరోపా దేశాల అనుభవాలు నిరూపిస్తున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు అమ్మభాషల్లో బోధిస్తూ జ్ఞానాధారిత ఆర్థికరంగ వృద్ధితో ఆయా దేశాలు దూసుకుపోతున్నాయి. నవీన పరిశోధనల్లో, అత్యాధునిక ఆవిష్కరణల్లో కొత్త పుంతలు తొక్కుతున్న వాటికి భిన్నంగా ఆంగ్లాన్ని నెత్తికెత్తుకున్న ఇండియాలోని ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో అత్యధిక శాతానికి విషయ పరిజ్ఞానం అరకొరేనని అధ్యయనాలెన్నో నిగ్గుతేల్చాయి. పిల్లలకు చిరపరిచితమైన భాషలను తరగతి గదిలోకి అనుమతించని దురవస్థ తొలగిపోతేనే విద్యార్థిలోకంలో సృజన నైపుణ్యాలు వికసిస్తాయి. స్థానిక భాషల్లో వృత్తివిద్యా పదకోశాల నిర్మాణం, సంప్రదింపు గ్రంథాలతో సహా పాఠ్యపుస్తకాల సరళానువాదం, బోధన సిబ్బందికి తగిన శిక్షణలపై ప్రభుత్వాలు సత్వరం దృష్టి సారించాలి. ప్రాంతీయ భాషల్లో సాంకేతిక పట్టాలు పొందినవారికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం కల్పించడం మరింత ముఖ్యం. ఆంగ్లం, హిందీలకే పరిమితమైన జాతీయ స్థాయి పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తేనే భిన్నత్వంలో ఏకత్వ భావన బలపడుతుంది. పాఠశాల స్థాయి నుంచే పిల్లలపై ఆంగ్ల మాధ్యమాన్ని రుద్దడానికి కొన్ని రాష్ట్రాల్లో నిరంతర యత్నాలు సాగుతున్న తరుణమిది. 'విద్యావ్యాప్తి విస్తృతం కావాలంటే స్థానిక భాషల్లో బోధించాల్సిందే'నన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ మేలిమి సూచనకు ప్రభుత్వాలు ఇకనైనా గొడుగుపట్టాలి!

ఇదీ చూడండి:అమ్మభాషలో చదువుకో... ఆంగ్లమూ నేర్చుకో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.