తెలంగాణ

telangana

వీధి వ్యాపారి భలే స్మార్ట్‌.. డిజిటల్‌ లావాదేవీల్లో తెలంగాణ టాప్​

By

Published : Oct 18, 2022, 6:34 AM IST

Telangana Top In Digital Transactions Country: డిజిటల్‌ లావాదేవీల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. అయిదు రూపాయిలైనా మొబైల్‌ ఫోన్‌ నుంచే కొనుగోలుదారులు చెల్లించడానికి మొగ్గు చూపుతున్నారు. తద్వారా డిజిటల్‌ లావాదేవీలు చేసినందుకు నగదు ప్రోత్సాహకం అందుకోవడంలోనూ తెలంగాణ వ్యాపారులే ముందున్నారు.

Telangana Top In Digital Transactions Country
Telangana Top In Digital Transactions Country

Telangana Top In Digital Transactions Country: నిరక్షరాస్యులైనా... అంతంతమాత్రంగానే చదువుకున్నా సాంకేతికత వినియోగంలో తెలంగాణలోని వీధి వ్యాపారులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో లక్షల మంది చిరువ్యాపారులు డిజిటల్‌ లావాదేవీలకు అలవాటుపడ్డారు. హైదరాబాద్‌తో పాటు అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ వీరు ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా నగదురహిత లావాదేవీలను అనుమతిస్తున్నారు.

వీటిని అనుసరించే చిరువ్యాపారుల సంఖ్య నానాటికీ పెరుగుతుండడం విశేషం. నగదురహిత లావాదేవీలతో అనేక సమస్యలు తొలగాయని వీధి వ్యాపారులు చెబుతున్నారు. కొనుగోలుదారులు కూడా రూ. 5, రూ. 10 వంటి చిన్నమొత్తాలూ డిజిటల్‌ రూపంలోనే చెల్లించడానికి మొగ్గు చూపుతున్నారు. డిజిటల్‌ లావాదేవీలు చేసినందుకు నగదు ప్రోత్సాహకం అందుకోవడంలోనూ తెలంగాణ వ్యాపారులే ముందున్నారు. దేశవ్యాప్తంగా నగదు ప్రోత్సాహకంగా రూ.17.65 కోట్లు అందజేయగా ఇందులో రాష్ట్ర వీధి వ్యాపారులు రూ.3.63 కోట్లు పొందారు.

దేశంలో అయిదో వంతు ఇక్కడే:దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులు నిర్వహించే డిజిటల్‌ లావాదేవీల్లో 21 శాతం తెలంగాణలోనే జరుగుతుండటం విశేషం. రాష్ట్ర పురపాలకశాఖ వీధి వ్యాపారుల డిజిటల్‌ క్రయవిక్రయాలు, రుణాలు, మౌలిక వసతులపై సమగ్ర నివేదిక రూపొందించింది. దీని ప్రకారం.. ఈ శాఖ వద్ద నమోదైన వీధి వ్యాపారులు 6,16,563 మంది. పట్టణాల జనాభాలో 4.17 శాతం వీరే.

పురపాలకశాఖ పట్టణప్రగతిలో భాగంగా సర్వే చేయడంతో పాటు.. మెప్మా ద్వారా వీధి వ్యాపారులకు బ్యాంకు రుణాలిప్పిస్తోంది. కరోనా అనంతరం కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకంలో చిరువ్యాపారులకు రెండు విడతలుగా రుణాలిచ్చారు. ఇలా రాష్ట్రంలో 3.45 లక్షల మందికి రూ.504 కోట్లు రుణాలుగా అందాయి. రుణవితరణలో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు దేశంలోనే ముందున్నాయి.

తొలివిడత రూ. 10 వేల చొప్పున ఇచ్చిన రుణాల్లో మెగా సిటీల్లో జీహెచ్‌ఎంసీ రెండో స్థానంలో నిలిచింది. లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉండే నగరాల జాబితాలో దేశంలోనే గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మొదటి స్థానంలో ఉండగా నిజామాబాద్‌ ఏడో స్థానంలో నిలిచింది. లక్ష లోపు జనాభా ఉన్న పట్టణాల్లో మొదటి పది స్థానాల్లోనూ రాష్ట్రంలోని పట్టణాలే ఉన్నాయి.

*రెండో విడత రూ.20 వేల చొప్పున రుణాలివ్వడంలోనూ లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల్లో మొదటి పది స్థానాల్లో తెలంగాణ పట్టణాలున్నాయి. రెండో విడత కూడా జీహెచ్‌ఎంసీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. లక్ష నుంచి పది లక్షల జనాభా కేటగిరీలో వరంగల్‌ కార్పొరేషన్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.

క్యూ ఆర్‌ కోడ్‌ చెల్లింపులే ఎక్కువ..

నా దగ్గర రోజూ సగటున 50 మంది పండ్లు కొంటే అయిదారుగురికి మించి ఎవరూ నగదు ఇవ్వడంలేదు. మిగిలిన వారంతా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి చెల్లిస్తున్నారు. మేం కూడా టోకు వ్యాపారులకు డిజిటల్‌ చెల్లింపులే చేస్తున్నాం. - అహ్మద్‌, పండ్ల వ్యాపారి

రాష్ట్రంలో నమోదైన వీధివ్యాపారులు : 6,16,563
రుణాలకు దరఖాస్తులు : 4,04,776
పొందిన వారు : 3,45,528

ఇవీ చదవండి:గ్రూప్‌1 కటాఫ్‌ మార్కుల ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన టీఎస్​పీఎస్సీ

చెరుకు కోసం చెక్​పోస్ట్​కు అడ్డంగా ఏనుగుల గుంపు. వాహనదారులకు ఇక్కట్లు

ABOUT THE AUTHOR

...view details