తెలంగాణ

telangana

CC CAMERAS: సీసీ కెమెరాల రెట్టింపునకు పోలీసుశాఖ కసరత్తు

By

Published : Aug 30, 2021, 8:53 AM IST

సంవత్సరాంతానికల్లా రాష్ట్రంలో సీసీ కెమెరాలను రెట్టింపు చేయాలని తెలంగాణ పోలీసుశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది చివరినాటికి 6.65 లక్షలు ఏర్పాటు చేయగా... మరో నాలుగు నెలల్లోనే వాటిని 13 లక్షలకు పెంచేందుకు కసరత్తులు చేస్తోంది.

police-exercise-to-double-cctv-cameras-in-telangana
రాష్ట్రంలో సీసీ కెమెరాల రెట్టింపుకు పోలీసుశాఖ కసరత్తు

శాంతిభద్రతల పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ముందున్న తెలంగాణ పోలీసుశాఖ సంవత్సరాంతానికల్లా రాష్ట్రంలో సీసీ కెమెరాలను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో 6,65,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. డిసెంబరు నెలాఖరుకల్లా వీటి సంఖ్య 13 లక్షలకు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. మరో 4 నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో వీటి ఏర్పాటు వేగం పెంచింది. ముఖ్యమైన ప్రాంతాల్లోని కెమెరాలను కొత్తగా నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేయనున్నారు.

సీసీ కెమెరాలకు కృత్రిమమేధ అనుసంధానం..

గత ఏడాది రాష్ట్రంలో 4490 కేసులను సీసీ కెమెరాల ద్వారానే ఛేదించగలిగారు. వీటిని కృత్రిమ మేధకు అనుసంధానం చేయడం ద్వారా నేరాల దర్యాప్తునకే కాకుండా పలు రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో జనం గుమిగూడే ప్రాంతాలను సీసీ కెమెరాలు వాటంతట అవే గుర్తించి సమీపంలోని గస్తీ పోలీసులను అప్రమత్తం చేసే వెసులుబాటు కల్పించారు. మాస్కు ధరించకుండా తిరిగే వారిని కూడా కెమెరాలు గుర్తించగలిగేలా కృత్రిమ మేధతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. దెబ్బతిన్న రహదారులను గుర్తించేందుకూ వీటిని వాడుకుంటున్నారు.

మూడొంతుల కెమెరాలు హైదరాబాద్​లోనే...

రాష్ట్రంలోని 6,65,000 కెమెరాల్లో మూడొంతులు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలోనే ఉన్నాయి. దాదాపు లక్ష కెమెరాలు ఒక్క 2020లోనే అమర్చారు. ఇప్పటి వరకూ ఎన్ని అమర్చారో ఈ ఒక్క ఏడాదే అన్ని కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారికంగా సీసీ కెమెరాల సంఖ్యను పది లక్షలకు చేర్చాలని చెబుతున్నప్పటికీ అనధికారింగా వీటిని 13 లక్షలకు చేర్చాలని భావిస్తున్నారు. స్థానిక సంస్థల సహకారంతో, ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటునకు కృషి చేస్తున్నారు.

ఇదీ చూడండి: CC CAMERAS IN POLICE STATIONS: అన్ని పోలీస్​స్టేషన్లలో సీసీ కెమెరాలు

ABOUT THE AUTHOR

...view details