తెలంగాణ

telangana

TS High Court: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

By

Published : Aug 31, 2021, 11:33 AM IST

Updated : Aug 31, 2021, 1:03 PM IST

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/31-August-2021/12925784_hight-court.jpg
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/31-August-2021/12925784_hight-court.jpg

11:31 August 31

విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. మరోవైపు గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభించవద్దని హైకోర్టు ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లను ఇప్పుడే తెరవద్దని స్పష్టం చేసింది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ ఇటీవల హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

''ఆన్‌లైన్, ప్రత్యక్ష బోధనపై విద్యాసంస్థలే నిర్ణయించుకోవచ్చు. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు మార్గదర్శకాలు జారీచేయాలి. వారంలోగా విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేయాలి. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలి. గురుకులాలు, విద్యాసంస్థల్లో వసతిగృహాలు తెరవద్దు. గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలి. ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయి.''

-హైకోర్టు

ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకుండా ఈ ఉత్తర్వులు జారీ చేశారని.. కొవిడ్‌ సమయంలో పాఠశాలలను ప్రారంభించి పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాలకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ప్రత్యక్ష బోధనపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్‌, ప్రత్యక్ష బోధనపై విద్యాసంస్థలే నిర్ణయించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు వారంలోపు మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని సూచించింది. గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.  

ప్రభుత్వమే సమన్వయం చేసి చూడాలి..

ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ఇంకా కొవిడ్‌ తీవ్రత కొనసాగుతోందని చెప్పింది. సెప్టెంబరు-అక్టోబరులో కొవిడ్‌ మూడో దశ ముప్పు హెచ్చరికలు.. మరోవైపు విద్యాసంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయాలూ ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటినీ సమన్వయం చేసి చూడాలని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్‌ 4కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:DRUGS CASE : డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. విచారణకు హాజరైన పూరి

Last Updated :Aug 31, 2021, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details