తెలంగాణ

telangana

'రెండో డోసు, బూస్టరు డోస్ మధ్య గడువు తగ్గించండి'

By

Published : Jan 18, 2022, 12:32 PM IST

Updated : Jan 19, 2022, 6:48 AM IST

Harish Rao Letter to Central Minister: రెండో, బూస్టర్ డోసు మధ్య గడువు తగ్గించాలని కేంద్రమంత్రి మన్​సుఖ్ మాండవీయను మంత్రి హరీశ్​రావు కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రికి హరీశ్​రావు లేఖ రాశారు.

harish
harish

Harish Rao Letter to Central Minister: రాష్ట్రంలో ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, వైద్యసిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మాత్రమే ముందస్తు నివారణ టీకా డోసు (బూస్టర్‌) ఇస్తున్నారు. రెండోడోసు పొందిన 9 నెలల తర్వాతే ఈ డోసు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిబంధనలు జారీ చేయడంతో ఇతరులకు అది అందడంలేదు. కొవిడ్‌ మూడోదశ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో బూస్టర్‌ డోసు కోసం 18 ఏళ్లు పైబడిన అర్హులందరూ ఆరా తీస్తున్నారు. దీనికి విధించిన వ్యవధిని తగ్గించాలని కోరుతూ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ఆరోగ్యశాఖకు తాజాగా లేఖ రాశారు.

2.10 కోట్ల మందికి పైగా అర్హులు

రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2,85,83,202 మంది తొలిడోసు వేసుకోగా.. వీరిలో 2,10,39,210 (74 శాతం) మంది రెండు డోసులు పొందారు. కేవలం 60 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే బూస్టర్‌ డోసును పరిమితం చేయడంతో.. ఈ కేటగిరీలో ఇప్పటి వరకూ 1.46 లక్షల మందే దాన్ని పొందారు. ఈ విభాగంలోనే ఇంకా 12.70 లక్షల మంది తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారిలో అత్యధికులు హైబీపీ, మధుమేహం, గుండెజబ్బులు తదితర ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నవారే. ఇప్పటికే రెండు డోసులు స్వీకరించిన వారిలో చాలా మంది బూస్టర్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

ఆరు నెలలకు తగ్గిస్తే..

రెండో డోసు స్వీకరించిన ఆరు నెలల తర్వాత శరీరంలో యాంటీబాడీలు తగ్గిపోతున్నాయని ఇప్పటికే పలువురు నిపుణులు స్పష్టం చేశారు. యాంటీబాడీలు తగ్గిపోయాక, కొవిడ్‌ బారినపడితే.. ప్రభావ తీవ్రత ఎక్కువగా ఉండవచ్చన్న హెచ్చరికలున్నాయి. టీకాల ఉత్పత్తికి కొదవ లేనందున, అర్హులైన ప్రతి ఒక్కరికీ బూస్టర్‌ డోసు వేసుకోవడానికి అవకాశాలు కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయమై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు లేఖ రాశారు. రెండో డోసు, ముందస్తు నివారణ డోసుకు మధ్య వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని, వైద్యసిబ్బందికి మాత్రం 3 నెలలకే బూస్టర్‌ డోసు ఇవ్వాలని ప్రతిపాదించారు. 60 ఏళ్లు దాటిన అందరికీ ముందస్తు నివారణ డోసు ఇవ్వాలని, 18 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తికీ బూస్టర్‌ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హరీశ్‌రావు కోరారు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో అమలు చేస్తున్న విధానాలు, ఫలితాల ఆధారంగా ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఇవీ చూడండి:

Last Updated : Jan 19, 2022, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details