Special Care on Pregnant: గర్భిణీల సంరక్షణే ధ్యేయం.. వైరస్​ సోకినవారికి ప్రత్యేక ఏర్పాట్లు

author img

By

Published : Jan 12, 2022, 5:08 AM IST

Pregnant

Special Care on Pregnant: కొవిడ్‌ విజృంభణ దృష్ట్యా గర్భిణీల సంరక్షణ కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. వైరస్ సోకిన గర్భిణీల కోసం అన్ని ఆస్పత్రుల్లో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు, వార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీరితో పాటు కరోనా సోకిన ఇతర బాధితులకు అత్యవసర సేవలు, శస్త్రచికిత్సలు అందించేందుకు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్, వార్డులు కేటాయించాలని ఆదేశించింది. వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి హరీశ్‌... కరోనా తగ్గుముఖం పట్టే వరకు బస్తీ దవాఖానాలు, పీహెచ్​సీలు, సబ్‌సెంటర్లు ఆదివారాల్లోనూ పనిచేయాలని ఆదేశించారు.

Special Care on Pregnant: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క‌రోనా ప‌రిస్థితులు, వ్యాక్సినేష‌న్‌, ఆసుప‌త్రుల స‌న్నద్ధత త‌దిత‌ర అంశాలపై మంత్రి హరీశ్‌రావు... వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. కొవిడ్‌ సోకిన గర్భిణీలకు అన్ని ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని, అందుకనుగుణంగా ప్రతి ప్రభుత్వాసుపత్రిలోఒక ఆపరేషన్‌ థియేటర్‌, వార్డును ప్రత్యేకంగా కేటాయించాలని ఆదేశించారు. అన్ని సౌకర్యాలు ఉండి కూడా... వారిని అన‌వ‌స‌రంగా ఇతర పెద్దాస్పత్రులకు పంపించవద్దని పేర్కొన్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు...

అత్యవసర సేవ‌లు, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని... కొవిడ్‌ సోకిందనే కారణంతో చికిత్స అందించేందుకు నిరాకరించవద్దని... వారికోసం ప్రత్యేక ఆపరేషన్‌ థియేటర్‌, వార్డు ఏర్పాటుచేయాలని మంత్రి సూచించారు. జిల్లా వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎం ఆదేశాలతో అన్ని ఆస్పత్రుల‌కు అవస‌ర‌మైన వైద్య ప‌రిక‌రాల‌ను అందించామని... అవి పూర్తి వినియోగంలో ఉండేలా చూడాలని తెలిపారు.

ఆదివారం కూడా...

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టేవరకు బస్తీ దవాఖానాలు, పీహెచ్​సీలు, సబ్‌సెంటర్లు ఆదివారం కూడా పనిచేయాలని మంత్రి హరీశ్‌ ఆదేశించారు. వ్యాక్సినేషన్‌, నిర్ధరణ పరీక్షలు, హోంఐసోలేషన్‌ కిట్ల పంపిణీ జరగాలన్నారు. కేంద్రం ఆదేశాల ప్రకారం ప్రతీ పీహెచ్​సీలో రాత్రి 10 వరకు వాక్సినేషన్ కొనసాగాలన్న మంత్రి... ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు సిబ్బంది పీహెచ్​సీలో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. కరోనా వచ్చి సాధారణ లక్షణాలు ఉన్నవారికి కిట్లు ఇవ్వడంతో పాటు... వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ... అవసరమైతే వారిని సమీప ప్రభుత్వాస్పత్రికి పంపించే ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.

ప్రతిఒక్కరికీ రెండు డోసులు...

వాక్సినేషన్‌లో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉండాలని మంత్రి సూచించారు. అర్హులైన ప్రతీఒక్కరికీ రెండు డోసులు ఇవ్వాలని... అందుకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు వందశాతం బూస్టర్‌ డోస్ పూర్తి చేయాలన్న హరీశ్... రాష్ట్రంలో రెండోడోస్‌ వందశాతానికి వైద్యసిబ్బంది కృషి చేయాలన్నారు. 15 నుంచి 18 ఏళ్లు వారి టీకా కార్యక్రమం వేగవంతం చేయాలని... వైద్యసిబ్బంది ఇంటింటికి వెళ్లి పిల్లలకు వ్యాక్సిన్‌ వేయాలని పేర్కొన్నారు. కరోనా నుంచి ప్రజల్ని రక్షించేందుకు.. ప్రభుత్వం 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు సమకూర్చినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

ఇదీ చూడండి: కరోనా థర్డ్​వేవ్​ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: మంత్రి హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.