తెలంగాణ

telangana

చిన్నస్వామిలో రెచ్చిపోయిన RCB బౌలర్లు.. వరుసగా ఐదోసారి దిల్లీ ఓటమి

By

Published : Apr 15, 2023, 7:12 PM IST

Updated : Apr 15, 2023, 7:19 PM IST

ఐపీఎల్​ 16వ సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్​కు మళ్లీ నిరాశ. ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమిపాలైన దిల్లీ.. బెంగళూరు చేతిలోనే ఓడిపోయింది. 23 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.

ipl 2023 royal challengers bangalore delhi capitals match winner
ipl 2023 royal challengers bangalore delhi capitals match winner

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్​లో భాగంగా చిన్నస్వామి స్డేడియంలో దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు బౌలర్లు రెచ్చిపోయారు. ఫలితంగా దిల్లీ జట్టు.. లక్ష్యాన్ని ఛేదించలేక చతికలపడింది. వరుసగా ఐదో ఓటమిని చవిచూసింది. 23 పరుగుల భారీ తేడాతో బెంగళూరు ఘన విజయం సాధించి రెండో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. అరంగేట్ర మ్యాచ్​లోనే బెంగళూరు బౌలర్​ విజయ్​ కుమార్​ వైశాఖ్ దుమ్మురేపాడు. ఈ మ్యాచ్​లో​ మూడు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లు పార్నెల్​, హసరంగ, హర్షల్​ పటేల్​ తలో వికెట్​ తీశారు.

బెంగళూరు నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్‌కు సిరాజ్‌ వేసిన తొలి ఓవర్లోనే గట్టి షాక్‌ తగిలింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన పృథ్వీ షా (0) రనౌటయ్యాడు. నాలుగో బంతికి అనవసర పరుగుకు యత్నించిన పృథ్వీ షాను అనుజ్‌ రావత్‌ డైరెక్ట్ త్రో విసిరి ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన మిచెల్​ మార్ష్​(0).. పార్నెల్ వేసిన రెండో ఓవర్‌లో నాలుగో బంతికి విరాట్ కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చాడు. సిరాజ్ వేసిన మూడో ఓవర్‌లో రెండో బంతికి యశ్‌ ధూల్ (0) కూడా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కాస్త స్కోరు బోర్డు పరిగెత్తించేందుకు ప్రయత్నిస్తున్న కెప్టెన్‌ డేవిడ్ వార్నర్ (19) ఔటయ్యాడు. అరంగేట్ర ఆటగాడు విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన ఆరో ఓవర్‌లో నాలుగో బంతికి కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన హర్షల్ పటేల్ వేసిన 8.5 ఓవర్‌కు అభిషేక్‌ పొరెల్ (5) పార్నెల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మరో బ్యాటర్​ అక్షర్‌ పటేల్ (21) కూడా ఔటయ్యాడు. విజయ్‌కుమార్‌ వైశాఖ్ వేసిన 12.2 ఓవర్‌కు సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన మనీష్‌ పాండే ఔటయ్యాడు. హసరంగ వేసిన 14 ఓవర్లో వరుసగా 4,6,4 బాదాడు. తర్వాతి బంతికి రెండు పరుగులు చేసి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన లలిత్​ యాదవ్​ (4)ను కూడా విజయ్​ కుమార్​.. పెవిలియన్​కు పంపాడు. సిరాజ్‌ వేసిన 18 ఓవర్లో మూడో బంతికి అమాన్‌ఖాన్‌ (18) కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చాడు. నోర్ట్జ్​(23), కుల్​దీప్​ యాదవ్​ (7*) నాటౌట్​గా నిలిచారు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు జట్టుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్‌ శుభారంభం చేశారు. ఇద్దరూ బంతిని బౌండరీలను దాటించారు. మెరుపు షాట్లు ఆడారు. కానీ దూకుడుగా ఆడుతున్న ఆర్‌సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌ (22)కు మిచెల్‌ మార్ష్‌ అడ్డుకట్ట వేశాడు. ఫోర్‌ కొట్టి ఊపు మీదున్న డుప్లెసిస్‌ మరో షాట్‌కు యత్నించాడు. అయితే మిడ్‌ వికెట్‌ స్థానంలో ఉన్న అమాన్‌ ఖాన్‌ ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. డుప్లెసిస్ ఔటయ్యాక.. ఐపీఎల్​ కెరీర్​లో 47వ అర్ధ శతకం పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ (50; 34 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఔటయ్యాడు. లలిత్‌ యాదవ్‌ వేసిన 10.1 ఓవర్‌కు డీప్‌ మిడ్‌ వికెట్‌లో యశ్‌ ధూల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన మహిపాల్.. మిచెల్ మార్ష్‌ వేసిన 13 ఓవర్‌లో రెండో బంతికి సిక్సర్‌ బాదాడు. తర్వాతి బంతికే వికెట్‌ కీపర్‌ అభిషేక్‌ పొరెల్‌కు మహిపాల్ లామ్రోర్‌ (26) క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. మొదట అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. దిల్లీ డీఆర్‌ఎస్‌కు వెళ్లడంతో అక్కడ వారికి సానుకూల ఫలితం వచ్చింది. అక్షర్‌ పటేల్ వేసిన 14 ఓవర్‌లో ఐదో బంతికి సిక్సర్‌ బాదిన హర్షల్ పటేల్ (6) తర్వాతి బంతికే వికెట్‌ కీపర్‌ అభిషేక్‌ పొరెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దూకుడుగా ఆడిన మ్యాక్స్‌వెల్ (24).. కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన చక్కటి బంతికి డేవిడ్ వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన వికెట్​ కీపర్​ దినేష్​ కార్తీక్​ నిరాశపరిచాడు. మొదటి బంతికే గోల్డెన్​ డక్​గావెనుదిరిగాడు. కుల్దీప్​ యాదవ్​ వేసిన బంతికి లలిత్​ యాదవ్​కు క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​ చేరాడు. షాబాజ్‌ అహ్మద్ (*), అనుజ్​ రావత్​ (15*) నాటౌట్​గా నిలిచారు. ఫలితానికి బెంగళూరు జట్టు 174 పరుగులు సాధించింది. దిల్లీ జట్టు బౌలర్లలో మిచెల్​ మార్ష్​, కుల్దీప్​ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. అక్షర్​ పటేల్​, లలిత్​ యాదవ్ చెరో ఒక వికెట్​ పడగొట్టారు.

విరాట్ అరుదైన ఘనత..
ఈ మ్యాచ్​లో విరాట్​ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఒకే మైదానంలో 2500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. దిల్లీతో జరిగిన మ్యాచ్​లో హాఫ్​ సెంచరీ బాదిన విరాట్​.. ఈ ఘనత అందుకున్నాడు. అది కూడా హోం గ్రౌండ్​లోనే ఈ రికార్డు సాధించడం గమనార్హం.

Last Updated :Apr 15, 2023, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details