Health Benefits Of Selfie : ప్రస్తుత సాంకేతిక యుగంలో సెల్ఫీ లేకుండా రోజు గడపని వారు చాలా మంది ఉన్నారు. సెల్ఫీ దిగడం కూడా రోజూవారి పనుల్లో భాగంగా ఫీలవుతున్నవారు కొందరు. చేస్తున్న ప్రతి పనిని సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇంకొందరు. ఏదైమైనా సెల్ఫీ దిగడం మనిషికి ఓ ఆలవాటులా మారిపోయింది. అయితే సరదాగా మీరు దిగుతున్న సెల్ఫీలు మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి మేలు చేకూరుస్తున్నాయని మీకు తెలుసా. అవును మీరు ఎంతో ఇష్టంగా దిగుతున్న ఫొటోలు మిమ్మల్ని చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయట. ఇంకెందుకు ఆలస్యం అదెలాగో తెలుసుకుందాం.
వ్యాధులను గుర్తించడంలో
సెల్ఫీలు కొన్ని సందర్భాల్లో మీ ప్రాణాలను కాపాడగలవంటే నమ్మగలరా. వాస్తవానికి సెల్ఫీలు వ్యాధులను గుర్తించడంలో సహాయపడతాయని కొత్త అధ్యయనాలు చూపించాయి. వ్యక్తికి గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉందా లేదా అనే తెలుసుకోవడానికి వైద్యులకు స్వీయ చిత్రాలు(సెల్ఫీలు) సహాయపడతాయట. వాటిలో కనిపించే ముఖ లక్షణాలను విశ్లేషించి వ్యాధి ప్రమాదాలను గుర్తించవచ్చట.
సెల్ఫ్ కేర్ విత్ సెల్ఫీ
సెల్ఫీ దిగడం ఓ పిచ్చి అలవాటు, పనికిమాలిన పని అని అంతా అనుకుంటుంటారు. కానీ ఈ అలవాటు స్వీయ రక్షణను పెంపొందిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా మంది ఉద్యోగం, ఇంటి విషయాల కారణంగా కలిగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి సెల్ఫీ ద్వారా రిలీఫ్ పొందుతున్నారట. ఫోటోలో తాము అందంగా కనిపించడం చూసి సంతృప్తిగా ఫీల్ అవ్వడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడుతున్నారట.
మానసికంగా మరింత మెరుగ్గా
నవ్వుతూ ఉండడం ద్వారా మనిషి మానసికంగా చాలా మెరుగువుతాడు. అలాగే మీరు ఇష్టంగా సంతోషంగా దిగే సెల్ఫీల ద్వారా కూడా మీరు హ్యాపీగా ఫీలవుతారు. వాటిని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపించడం కూడా కొందరిలో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది మీకు తెలియకుండానే మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి
సెల్ఫ్ లవ్ అనేది చాలా ముఖ్యం. నిజానికి ఇతరుల చేత ప్రేమించబడటం కన్నా మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా అవసరం. మానసికంగా బలంగా ఉండాలంటే మనల్ని మనం ప్రతి రోజూ ప్రేమించుకోవాల్సి ఉంటుంది. అలా మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా మలుచుకుని,సెల్ఫ్ లవ్‌ను మెరుగుపరచడానికి, మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి సెల్ఫీలు చాలా బాగా సహాయపడతాయి.
సెల్ఫ్ రిఫ్లెక్షన్‌కు అద్దం
సెల్ఫీలు మీ జీవితాలకు ప్రతిబింబాలుగా కనిపిస్తాయి. తరచూ సెల్ఫీలు దిగడం వల్ల మీ పురోగతిని మీరు అంచనా వేసుకోగలుగుతారు. అలాగే గతంలో మీ పరిస్థితిని గుర్తచేసుకోవచ్చు. మీరు ఎలాంటి కష్టమైన స్థితిని చూశారో, ఎంత శక్తి కూడగట్టుకుని దాని నుంచి బయటపడ్డారో మీకు మీరే తెలుసుకుని గర్వపడతారు.
సామాజిక ఎదుగుదలకు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువ మంది షేర్ చేస్తున్న ఫొటొలు సెల్ఫీలే. వీటిని షేర్ చేయడం వల్ల మీరు ఎక్కువ మందికి తెలుస్తారు. ఎక్కువ మందితో మాట్లాడగలుగుతారు. ఒంటరిగా అనిపించినప్పుడు, డల్‌గా ఫీల్ అయినప్పుడు ప్రపంచంతో మీ సంబంధాన్ని పెంపొందించుకోవడానికి సోషల్ మీడియా చక్కాగా ఉపయోగపడుతుంది. అలాగే మీకున్న ప్రతిభ ఆధారంగా మీకు ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి.
గుర్తులు పదిలం
గతం అనేది ఎప్పుడూ తిరిగిరాదు. దాన్ని పదిలంగా దాచుకోవడానికి, మధుర జ్ఞాపకాలను ఎప్పుడూ మనతోనే ఉంచుకునేందుకు మనకున్న చాలా తక్కువ మార్గాల్లో సెల్ఫీ ఒకటి. ఇది మీ అనుభూతులను, గురుతులను మీతో ఎప్పటికీ ఉంచేందుకు, తిరిగి చూసుకోవడానికి సహాయపడుతుంది. అందుకే సెల్ఫీ దిగడం ఆరోగ్యానికి మంచిదే. కాకపోతే ఎక్కడ దిగుతున్నామా ఎలా దిగుతున్నామా అనే విషయాలను గమనించుకుంటూ ఉండడం తప్పనిసరి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.