ETV Bharat / sports

ఈసారి దీపావళికి WPL.. విదేశాల్లోనూ మ్యాచ్​లు!.. బీసీసీఐ ప్రకటన

author img

By

Published : Apr 15, 2023, 12:33 PM IST

wpl matches jay shah
wpl

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)ను వచ్చే ఏడాది నుంచి దీపావళి పండుగ జరిగే సమయంలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే?

రానున్న సీజన్​ నుంచి మహిళల ప్రీమియర్‌ లీగ్​ను దీపావళి సమయంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా శుక్రవారం వెల్లడించారు. ఐపీఎల్‌ తరహాలోనే డబ్ల్యూపీఎల్‌లోనూ విదేశాలు, భారత్​లోనూ మ్యాచ్‌లు నిర్వహించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

"వచ్చే సీజన్‌ డబ్ల్యూపీఎల్‌ను దీపావళి సమయంలో ఇంటా, బయటా నిర్వహించే సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నాం. కానీ ఒకే ఏడాదిలో రెండు సీజన్లు కాదు. మార్చిలో కాకుండా విభిన్న సమయంలో నిర్వహించేందుకు చూస్తున్నాం. మహిళల క్రికెట్‌కు ఇప్పుడు ప్రత్యేకమైన ఫ్యాన్​ బేస్​ ఉంది. డబ్ల్యూపీఎల్‌ను ప్రోత్సహిస్తే ఆ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది" అని జై షా తెలిపారు. ఈ ఏడాది మార్చి 4 నుంచి 26 వరకు ముంబయిలోని రెండు స్టేడియాల్లో ఆరంభ డబ్ల్యూపీఎల్‌ మ్యాచ్​లు జరిగాయి.

మరోవైపు, భారత్​లో టీవీ, డిజిటల్‌ ప్రసార హక్కుల కోసం ఈ ఏడాది జూన్‌- జులైలో టెండర్లు ఆహ్వానించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అంతే కాకుండా 2023 ఆసియాకప్‌ కోసం పాకిస్థాన్‌కు భారత్‌ వెళ్లదని ఇప్పటికే స్పష్టం చేసింది. బీసీసీఐ కార్యదర్శి జై షా.. టోర్నీ వేదిక మార్పు, పాక్‌తో టీమ్‌ఇండియా మ్యాచ్‌పై స్పష్టత కోసం ఇతర సభ్య దేశాల అభిప్రాయాల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ.. మొట్టమొదటి మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ఛాంపియన్‌గా అవతరించింది. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ఆటతో ఆకట్టుకున్న హర్మన్‌ ప్రీత్‌ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్​ జట్టు.. రసవత్తరంగా సాగిన ఫైనల్లోనూ పైచేయి సాధించింది. బంతితో వాంగ్‌, హేలీ, అమేలియా.. బ్యాటుతో నీట్‌ సీవర్‌ ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించారు.

మహిళల క్రికెట్​ను కూడా.. మెన్​ క్రికెట్​కు ఉండే ఆదరణ లభించాలని బీసీసీఐ డబ్ల్యూపీఎల్​కు శ్రీకారం చుట్టింది. అనుకున్నదానికంటే.. ఈ లీగ్​కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ టోర్నీ బిడ్‌ మొత్తం విలువ రూ.4,667 కోట్లు కాగా.. ఐదు ప్రాంఛైజీలు ఈ వేలంలో పాల్గొని జట్లను సొంతం చేసుకున్నాయి. ఇందులో రూ.1,289 కోట్లకు అహ్మదాబాద్‌ జట్టును అదానీ స్పోర్ట్స్‌లైన్‌, రూ.913 కోట్లకు ముంబయి జట్టును ఇండియావిన్‌ స్పోర్ట్స్‌, రూ.901 కోట్లకు బెంగళూరు జట్టును రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌, రూ.810 కోట్లకు దిల్లీ జట్టును జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్‌ క్రికెట్‌, రూ.757 కోట్లకు లఖ్‌నవూ జట్టును కాప్రీ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ దక్కించుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.