ETV Bharat / sports

IPL 2023 : అదరగొట్టిన బ్రూక్​.. రూ.13 కోట్లకు న్యాయం చేశాడుగా!

author img

By

Published : Apr 15, 2023, 9:25 AM IST

Updated : Apr 15, 2023, 4:09 PM IST

ఐపీఎల్‌ వేలంలో భారీ ధర పలికితే ఇక ఆ ఆటగాడి ప్రదర్శన అటకెక్కినట్లే. అయితే ఈసారి వేలంలో రూ.13.25 కోట్లు పలికిన హ్యారీ బ్రూక్‌ తొలి మూడు మ్యాచ్‌ల్లో తుస్సుమనిపించేసరికి అతను కూడా ఆ జాబితాలో చేరుతున్నట్లే కనిపించింది. కానీ నాలుగో మ్యాచ్‌లో ఈ ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ చెలరేగిపోయాడు. శుక్రవారం కోల్‌కతాపై బ్రూక్‌ చెలరేగి ఆడి సెంచరీ సాధించాడు. ఈ ఐపీఎల్‌లో బ్రూక్‌దే తొలి సెంచరీ కావడం విశేషం.

harry-brook-smashes-first-century-of-ipl-2023-against-kkr
harry brook

ఒక్క ప్లేయర్..​ సన్​రైజర్స్​ టీమ్​ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 55 బంతుల్లో శతకాన్ని బాది జట్టును గెలిపించాడు. అతడే సన్​రైజర్స్​కు చెందిన హ్యారీ బ్రూక్​. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌ వేలంలో రూ.13.25 కోట్లకు బ్రూక్​ను దక్కించుకుంది సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టు. టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున గతేడాదే అరంగేట్రం చేసిన బ్రూక్​​.. 9 ఇన్నింగ్స్‌ల్లో 809 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. హ్యారీ బ్రూక్​.. ఇంగ్లాండ్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

పేరుకు టెస్టులే కానీ.. ఆ ఫార్మాట్లో అతను పరిమిత ఓవర్ల క్రికెట్‌ వేగం చూపించాడు. ఇక ఈ ఐపీఎల్​ మ్యాచ్​లో బ్రూక్​ ఆటను చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు. అతడికి సన్‌రైజర్స్‌ అంత రేటు పెట్టడం కరెక్ట్నే సంబరపడిపోతున్నారు. కానీ లీగ్‌లో అడుగు పెట్టిన తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 13, 3, 13 పరుగులే స్కోర్​ చేయడం వల్ల.. బ్రూక్​ కూడా 'రేటు ఎక్కువ- ఆట తక్కువ' ఆటగాళ్ల జాబితాలోనే చేరుతాడేమో అన్న సందేహాలు తలెత్తాయి. కానీ నాలుగో మ్యాచ్​తో బ్రూక్‌ ఆటతీరే మారిపోయింది. బ్రూక్​ తన టాలెంట్​ను కోల్‌కతాతో జరిగిన మ్యాచ్​లో బయటపెట్టాడు. తొలి బంతి నుంచే చెలరేగిన బ్రూక్​.. చివరి వరకు దూకుడు కొనసాగించి సెంచరీతో అజేయంగా నిలిచాడు.

ఐపీఎల్ ఆరంభమైన తర్వాత తొలి మూడు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శనతో అభిమానులకు నిరాశ కలిగించాడు బ్రూక్​. దీంతో అతడి ఆట తీరుకు నిరాశ చెందిన అభిమానులు.. సోషల్​ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు. అయితే తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన బ్రూక్​.. ఏకంగా సెంచరీని బాదేసి.. అరంగేట్ర ఐపీఎల్‌లోనే ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.

కేకేఆర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ బౌండరీల వర్షం కురిపించాడు. వరుసపెట్టి ఫోర్లు, సిక్సర్లు బాదుతూ సన్‌రైజర్స్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా కోల్‌కతా పేసర్లనే లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించిన హ్యారీ 55 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి..

అంతే కాకుండా ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి శతకం నమోదు చేసిన ప్లేయర్​గా కూడా రికార్డుకెక్కాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్.. ఎస్ఆర్‌హెచ్‌పై 99 పరుగుల దూరంలో ఆగిపోగా.. బ్రూక్​ మాత్రం 100 పరుగులు పూర్తి చేసి నాటౌట్‌గా నిలిచాడు. ధావన్ తర్వాత చెన్నై ప్లేయర్ 92 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ అయ్యాడు. హ్యారీ బ్రూక్‌కు ఇది తొలి శతకం కాగా.. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 76వది కావడం విశేషం.

Last Updated :Apr 15, 2023, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.