తెలంగాణ

telangana

కూల్చేయ్.. కాల్చేయ్.. రంగు మార్చి ఏమార్చేయ్​!

By

Published : Jun 24, 2023, 12:13 AM IST

Updated : Jun 24, 2023, 7:09 AM IST

'రంగుమార్తాండుడా? ఆయనెవరు? నాకు రంగమార్తాండ మాత్రమే తెలుసే!' అంటూ కాస్త అయోమయంగా చిత్రగుప్తుడి వైపు చూశాడు ఇంద్రుడు. అప్పుడు ఆయన చెప్పిన 'ఆంధ్రా రంగుల రాజకీయం' కథే ఇది!

rangu-maarthaanda-ycp-colours
rangu-maarthaanda-ycp-colours

'ఆకాశంలో నీలం రంగు మాయం.. నైమిషారణ్యంలో హరిత వర్ణం అదృశ్యం.. ఏమిటీ వైపరీత్యం?'.. స్వర్గ లోకంలో కంగారుగా తిరుగుతున్నాడు ఇంద్రుడు.

'మీలో ఇంతటి ఆందోళనకు కారణమేంటి ప్రభూ?'.. యమలోకం నుంచి అప్పుడే వచ్చిన చిత్రగుప్తుడి ప్రశ్న ఇది.

'చిత్రగుప్తా.. స్వాగతం. మీరు వస్తారని అసలు ఊహించనేలేదు. యమపురి వాసులంతా కుశలమేనా? మీ రాకకు కారణమేంటో? సమవర్తి నుంచి ఏదైనా ముఖ్య సందేశమా?" అంటూ ఆప్యాయంగా పలకరించాడు ఇంద్రుడు.

'అదేం లేదు సురేంద్ర. భూలోకవాసుల పాపాల గణనతో అలసి.. కాస్త చల్లగాలి పీల్చుకుందామని ఇలా వ్యాహ్యాళికి వచ్చాను మహాశయ! ఇంతకీ మీ మనసులోని ఈ కల్లోలానికి కారణమేంటో చెప్పనేలేదు?' అని అడిగాడు చిత్రగుప్తుడు. రంగుల విలయంపై తన మదిలోని మాటను యమపురి వాసికి చెప్పాడు ఇంద్రుడు.

ఇదీ చదవండి:'వైసీపీ రంగుల పిచ్చి.. తాగునీటి సమస్య తెచ్చిపెట్టింది'

'ఓ.. ఈ రెండు రంగుల గురించా మీ ఆలోచన? అవి ఆంధ్ర దేశానికి పోటెత్తాయి! బడి, ఆస్పత్రి, ఇళ్లు, నీళ్ల కుండీలు, గోడలు, పాలకుల వేటుతో మోడుబారిన చెట్లు, మొక్కజొన్న కంకిలు, దున్నపోతు కొమ్ములు.. ఇలా ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎక్కడా చూసినా ఆ వర్ణాలే.. చివరకు దేవుడి గుడికి కూడా!! అంతా "రంగుమార్తాండుడి" మాయ!!!' అని బదులిచ్చాడు చిత్రగుప్తుడు.

'రంగుమార్తాండుడా? ఆయనెవరు? నాకు రంగమార్తాండ మాత్రమే తెలుసే!' అంటూ కాస్త అయోమయంగా చిత్రగుప్తుడి వైపు చూశాడు ఇంద్రుడు.

'మీకు తెలిసిన రంగమార్తాండ.. నవరస నటనా యోధుడు. రంగస్థలంపై అద్భుత అభినయంతో వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయగల కళా దిగ్గజం. కానీ.. ఆంధ్ర రాష్ట్రంలోని రంగుమార్తాండ అందుకు పూర్తి భిన్నం. నవరత్నాల ఎరతో గద్దెనెక్కి.. నాలుగేళ్లుగా బాదుడే బాదుడును పనిగా పెట్టుకుని, జనానికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న పరిపాలకుడు!" అని సెలవిచ్చాడు చిత్రగుప్తుడు.

'జనాన్ని హింసించే పాలకులా? ప్రజాస్వామ్యంలో ఇదేం కర్మ? ఇంతకీ ఆ నాయకుడికి, రంగుల అదృశ్యానికి లంకేంటి?' అంటూ ఆసక్తిగా అడిగాడు ఇంద్రుడు.

ఇదీ చదవండి:YSRCP COLOURS TO PHC: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మళ్లీ అవే రంగులు

'మహాశయా.. ఆంధ్ర రాష్ట్రం ఇంతకుముందు ఎంతో మంది నాయకుల్ని చూసింది. వారంతా పాలనాదక్షులు! జనక్షేమం, రాష్ట్రాభివృద్ధే వారికి ప్రధానం. కానీ.. ఇప్పుడు లెక్క వేరు. కక్షాదక్షత నేటి పాలకుడి దుష్ట గుణం. అస్తవ్యస్థ పాలనను ప్రశ్నించిన వారిని కేసులతో కాల్చుకు తినడం, గత ప్రభుత్వాల ప్రగతి యజ్ఞ ఫలాల్ని నిర్వీర్యం చేయడమే వారికి ముఖ్యం. వాటి పర్యవసానమే ఈ రంగుల రాజకీయం!' అని తనదైన శైలిలో చెప్పాడు చిత్రగుప్తుడు.

అర్థం అయ్యీ, కానట్టుగా ఉన్న ఇంద్రుడ్ని చూసి వెంటనే జోక్యం చేసుకున్నాడు చిత్రగుప్తుడు. 'దేవేంద్ర.. ఆంధ్ర రాష్ట్రంలోని అరాచక స్థితి మీకు పూర్తిగా బోధపడినట్టు లేదు. పాలనాదక్షతతో పనిచేస్తే పెట్టుబడులు వస్తాయి. అభివృద్ధి జరుగుతుంది. ప్రగతి ఫలాలు ప్రజలకు చేరతాయి. కానీ.. ఇక్కడ రాజ్యమేలుతోంది కక్షాదక్షత! హింస రాజు వేధింపుల కొరడా దెబ్బకు వ్యాపారులంతా పరార్.. రాష్ట్రం దివాలా.. ఉపాధి కరవు.. పేదల బతుకు బరువు. గద్దెపై ఉన్న నిర్వీర్యుడికి.. సంపద సృష్టిపై అవగాహన శూన్యం. రాష్ట్రాన్ని గట్టెక్కించే మార్గం అగమ్యగోచరం. అందుకే రంగుల రాజకీయంతో జనాన్ని మభ్యపెట్టే యత్నం!' అంటూ ఇంద్రుడికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాడు చిత్రగుప్తుడు.

'రంగులతో జనాన్ని మోసగించొచ్చా? ఎలా?' అని ప్రశ్నించాడు ఇంద్రుడు.

కూల్చేయ్.. కాల్చేయ్.. రంగు మార్చి ఏమార్చేయ్​!

ఇదీ చదవండి:విశాఖ సీఎం టూర్ రద్దు: సుందరీకరణ అంటే, చెట్లు నరికి.. మోడులకు రంగులు వేయడం

'మంచి ప్రశ్న మహాశయా! హింస రాజు, వారి దుష్టగణం సాగిస్తున్న దమనకాండ లెక్కలు రాసేందుకు మా యమలోకంలో ఓ ప్రత్యేక విభాగమే ఉంది. భూకబ్జాలు, పేదల ఇళ్లు కూల్చివేతలు, ప్రశ్నించిన వారికి అక్రమ కేసుల వేధింపులు, గంజాయి దందాలు, మానభంగాలు, శవాల డోర్​డెలివరీలు, పగతో పిల్లల్నీ సజీవదహనం చేసే కిరాతకులకు అండదండలు.. ఇలా ప్రతిదీ పాపాల పుస్తకంలో నిక్షిప్తమవుతున్నాయి. ఇదే క్రమంలో రంగుల రాజకీయం దొంగ లెక్కలూ మా దృష్టికి వచ్చాయి దేవేంద్ర. వాటిలో మంచి ఉదాహరణ.. పేదల ఇళ్లకు పార్టీ రంగు! 80 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వ హయాంలోనే 90శాతానికిపైగా పూర్తయ్యాయి. మరో 70వేల గృహాలు 75శాతం సిద్ధం! ఆ అరొకర పనులు పూర్తి చేసి ఉంటే లక్షన్నర కుటుంబాల సొంతింట కల 3-4ఏళ్ల క్రితమే సాకారమై ఉండేది. వారందరూ సంతోషంలో మునిగితేలేవారు. కానీ.. పక్కవాడి ఆనందాన్ని హింస రాజు తట్టుకోగలడా? అందుకే ఇంతటి జాప్యం! ఇన్నేళ్లూ ప్రతీకారమే పరమసోపానంగా పాలన సాగించిన వారు ఇప్పుడు ఎన్నికల వేళ రంగుమార్తాండుడి అవతారం ఎత్తారు. గత ప్రభుత్వం నిర్మించిన భవనాలకు సొంత రాజకీయ రంగులు, పాత పథకాలకు కొత్త పేర్లతో ఓటర్లకు మరోసారి ఎర వేస్తున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ముసుగులో ముడుపులాట సాగించి.. వేల కోట్లకు పడగలెత్తిన అక్రమానుభవం ఎలానూ ఉంది కదా! కోడికత్తి కుట్ర, గుండెపోటు కథలా ఈ రంగుల రాజకీయమూ పనిచేస్తుందనేది వారి ఆశ!!' అంటూ హింసరాజు పాపాలను దేవేంద్రుడికి పరిచయం చేశాడు చిత్రగుప్తుడు.

ఇదీ చదవండి:ఎన్నికల వేళ టిడ్కో ఇళ్ల రాజకీయం... వసతులు మరిచి.. పార్టీ రంగులతో హడావుడి..

'మా స్వర్గ లోకంలో ఉండే కొందరు ఆంధ్రులు.. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల గురించి చెప్పారు ఆ మధ్య. ఇప్పుడు వాటిదీ అదే రంగుల కథా?' అని ఆసక్తిగా ప్రశ్నించాడు ఇంద్రుడు.

'కథ కాదు.. వ్యథ! ఆకలి తీర్చడం, ఆనందం నింపడం వంటివి రంగుమార్తాండుడికి ఏమాత్రం గిట్టవు. అందుకే వాటి రంగులు మారలేదు.. ఏకంగా మూతపడ్డాయి. హింస రాజు విధ్వంస పాలనకు మౌన సాక్ష్యాలు అయ్యాయి. పేదల ఆకలి కేకలు.. అరణ్యరోదనలుగా మిగిలాయి." అని ఆవేదన వ్యక్తం చేశాడు చిత్రగుప్తుడు.

'మరీ ఇంతటి కుటిల ఆలోచనా? రాజకీయ ప్రత్యర్థులపై పగతో అభాగ్యులపై ప్రతాపమా? ఇది అసలు పాలకుడి లక్షణమేనా? అదీ జనస్వామ్యంలో! ఈ విపత్కర స్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది ఆ ప్రజాస్వామ్యమే. ఆరోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం' అని ఆకాంక్షించాడు ఇంద్రుడు.

'అవును ప్రభూ! ఆంధ్రులూ అదే రోజు కోసం ఎదురుచూస్తున్నారు" అంటూ ముగించాడు చిత్రగుప్తుడు.

--జీఎస్​ఎన్​ చౌదరి.

Last Updated : Jun 24, 2023, 7:09 AM IST

ABOUT THE AUTHOR

...view details