ETV Bharat / state

అద్దెలు భరించలేక అక్కడికి వెళ్తే.. అన్నీ అరకొర సౌకర్యాలే..!

author img

By

Published : Jan 3, 2023, 8:42 AM IST

Updated : Jan 3, 2023, 8:58 AM IST

ap state
అరకొర వసతులతో టిడ్కో ఇళ్లు

AP govt Tidco houses structure updates: రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు నిర్మించిన టిడ్కో ఇళ్లపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరకొర వసతులతో టిడ్కో ఇళ్లను నిర్మించి అందజేయడంతో నానా అవస్థలు పడుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిడ్కో భవనాల ముందు చెట్లు పెరిగి పాములు సంచరిస్తున్నాయని, వీధుల్లో రాత్రిపూట లైట్లు వెలగక.. దొంగాల భయంతో భయాందోళన చెందుతున్నామని వాపోతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక అనేక ఇబ్బందులు పడుతున్నా, అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అద్దెలు భరించలేక అక్కడికి వెళ్తే.. అన్నీ అరకొర సౌకర్యాలే..!

AP govt Tidco houses structure updates: వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత గత ప్రభుత్వం చేపట్టిన పథకాలను నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. అరకొర వసతులతో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. అద్దెలు భరించలేక కొంతమంది అక్కడికి వెళ్లినా.. మౌలిక సదుపాయాలు లేక తీవ్ర అవస్థలుపడుతున్నారు. మరికొందరు ఆ ఇళ్లవైపే కన్నెత్తి చూడటం లేదు. అరకొర వసతులతో ఇబ్బంది పడలేమని.. ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తేనే వెళ్తామని తేల్చి చెబుతున్నారు.

పట్టణ పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు గత ప్రభుత్వం టిడ్కో గృహ సముదాయాలను ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టింది. అన్ని రకాల మౌలిక సదుపాయాలతో పాటు.. పిల్లలు ఆడుకునేందుకు ఆటస్థలం, ఉద్యానవనాలు, నడక మార్గాలు, షాపింగ్‌ కాంప్లెక్స్ వంటి సౌకర్యాలు కల్పించింది. నెల్లూరులో 80కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. అన్నిచోట్ల ఇదే విధంగా ఏర్పాటు చేస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం.. రెండేళ్ల పాటు టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పట్టించుకోలేదు. ఇప్పుడు అరకొర సౌకర్యాలతో లబ్ధిదారులకు అందిస్తూ.. అక్కడి మౌలిక సదుపాయల బాధ్యతను పురపాలక సంఘాలకే వదిలేసింది. లబ్ధిదారులు వేలల్లో ఉన్నందున అక్కడ పాఠశాలలు, వసతిగృహాలు, అర్బన్‌ క్లినిక్‌లు, ఇతర వాటి ఏర్పాటుకు అన్ని శాఖలకు నివేదిస్తామని చెబుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ముందుకొస్తే పార్కు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసే వీలుంటుందని అధికారులు అంటున్నారు.

వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 46వేల ఇళ్లను అప్పగించగా.. అందులో గత ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తవ్వగా, 10శాతం పనులు ఇప్పుడు చేసి అందజేస్తున్నారు. అత్యధిక శాతం పూర్తయిన ఇళ్లున్న చోటే అరకొరగా మౌలిక సదుపాయాలు కల్పించి అప్పగించేస్తున్నారు. తక్కువ శాతం నిర్మాణాలు పూర్తయిన వాటిని రెండో ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. మొత్తంగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన 2.62 లక్షల ఇళ్ల నిర్మాణాలున్న గృహసముదాయాల్లో తాగునీరు, రహదారులు, మురుగుకాలువలు, విద్యుత్తు సౌకర్యం, ఎస్టీపీ తరహా మౌలిక సదుపాయాల కల్పనకు 3 వేల కోట్లు అవసరమవుతుందని అధికారుల అంచనా. ఇప్పటి వరకు సుమారు వెయ్యి కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇందులో 300 కోట్లు గత ప్రభుత్వ హయాంలోనే ఖర్చు చేశారు.

టిడ్కో గృహసముదాయాల్లో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందజేయాలని... నిర్వహణ సరిగా ఉండాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే కనీస వసతులు కూడా పూర్తిస్థాయిలో కల్పించకుండానే లబ్ధిదారులకు ఇళ్లు అంటగట్టేశారు. రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల పరిధిలో లబ్ధిదారులకు అప్పగించిన 8 గృహ సముదాయాల్లో ‘ఈనాడు- ఈటీవీ’ ఇటీవల క్షేత్రస్థాయి పరిశీలన చేయగా.....90 శాతం గృహసముదాయాల్లో తాగునీటి సమస్య ఉంది. కొన్ని చోట్ల ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నా.. సరిపడా అందడం లేదు. 55 శాతం వరకు విద్యుత్తు సౌకర్యం లేదు. 33 శాతం మురుగు కాలువల సమస్య ఉంది. విశాఖలోని సుద్దగెడ్డలో మొత్తం 240 ఇళ్లు పంపిణీ చేయగా.. వసతలు లేవని ఒక్కరూ చేరలేదు.

రాజమహేంద్రవరం బొమ్మూరులో 2వేల 528 మందికి టిడ్కో ఇళ్లు అప్పగించగా....కేవలం 250 మంది మాత్రమే చేరారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. పార్కు ఏర్పాటు కోసం తెచ్చిన పరికరాలన్నీ మూలనపడేయడంతో తుప్పుపట్టిపోతున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 2వేల 500 ఇళ్లు పంపిణీ చేయగా విద్యుత్ సౌకర్యం లేక ఒక్కరూ చేరలేదు. తాగునీటి వసతి లేదు. డ్రైనేజీ పనులు పూర్తిస్థాయిలో చేయలేదు. విజయనగరం సారిపల్లిలో 800 మందికి ఇళ్లు ఇస్తే ఒక్కరూ చేరలేదు. ఇక్కడా ఇదే పరిస్థితి. విద్యుత్తు మీటర్లకు డబ్బులు కట్టిన వారికి కనెక్షన్లు ఇస్తున్నారు. పాలకొల్లులో 7వేల 150 ఇళ్లల్లో వెయ్యి మందికి పంపిణీ చేయగా....700 మంది చేరారు. 4 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన నీటి ట్యాంకు నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతోంది. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా సరిపడా అందడం లేదు. వీధిదీపాల కోసం కనీసం స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేదు. పారిశుద్ధ్యం పూర్తిగా గాలికొదిలేశారు. ఇళ్ల మధ్యనే ముళ్లపొదలు పెరిగాయి. నిర్వహణ లేక మురుగుకాలువల్లో చెత్త పేరుకుపోతోంది.

కర్నూలు జగన్నాథగట్టులో మొత్తం 9వేల 900 ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. 4వేల 500 మందికి టిడ్కో ఇళ్లు అందజేసినా.. ఒక్కరంటే ఒక్కరూ చేరలేదు. విద్యుత్ సౌకర్యం లేకపోగా.. తాగునీటి ట్యాంకులు ఇంకా నిర్మించలేదు. కొన్ని ఇళ్లలో చెదలు పట్టగా...మరికొన్నింటికి తలుపులు, కిటికీలు పాడైపోయాయి. వాటిని కనీస మరమ్మతు చేయకుండానే రంగులు వేసి అప్పగించేశారు. పార్కులు, మైదానం, కమ్యూనిటీహాళ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు స్థలం కేటాయించినా ఒక్కదానికీ అడుగుపడలేదు. ఆత్మకూరులో 1056ఇళ్లు అప్పగించగా 210 మంది మాత్రమే చేరారు. అనకాపల్లి జిల్లా పరవాడలో 512 మందికి అందజేసినా.. విద్యుత్ సౌకర్యం లేకపోవడం, నీళ్ల ట్యాంకుల నిర్మాణం పూర్తికాకపోవంతో ఒక్కరూ చేరలేదు.

టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అధికారులు ఎక్కువగా లబ్ధిదారుల వాటాపైనే ఆధారపడుతున్నారు. 300 చ.అడుగుల విస్తీర్ణం ఇళ్లను గత ప్రభుత్వం ఉచితంగానే ఇవ్వగా.. 365 చ.అడుగుల ఇంటికి 3 లక్షల65వేలు, 430 చ.అడుగుల ఇంటికి 4 లక్షల 65 వేలు చొప్పున బ్యాంకులు లబ్ధిదారు పేరు మీద టిడ్కోకు ఇవ్వాలి. ప్రైవేటు బ్యాంకులు రుణాలిచ్చేందుకు వెనకడుగు వేస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 18 వందల కోట్లు రుణం సేకరించారు. ఇంకో 2 వేల కోట్ల వరకు రావాల్సి ఉంది. మొత్తం 2లక్షల 62 వేల ఇళ్ల నిర్మాణం పూర్తవ్వాలంటే ఇంకా 6వేల కోట్లు అవసరమని తెలుస్తోంది. ఇప్పటి వరకు పనులు చేసిన గుత్తేదారులకు 600 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఇవీ చదవండి

Last Updated :Jan 3, 2023, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.