ETV Bharat / state

'వైసీపీ రంగుల పిచ్చి.. తాగునీటి సమస్య తెచ్చిపెట్టింది'

author img

By

Published : Mar 23, 2023, 10:36 AM IST

government changed colours of the water tank
వాటర్ ట్యాంక్​కు రంగులు మార్చిన ప్రభుత్వం

NTR Sujala water tank colour changed issue: వైసీపీ ప్రభుత్వ రంగుల పిచ్చి.. తమ గ్రామంలో ప్రజలకు తాగునీరు లేకుండా చేసిందని గుంటూరు జిల్లా మందడం గ్రామస్థులు వాపోతున్నారు. వాటర్ ట్యాంక్​కు రంగులు మార్చడం వల్ల తాగునీటి సమస్య ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?..

NTR Sujala water tank colour changed issue: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రంగుల పిచ్చి తమ గ్రామంలో తాగునీరు లేకుండా చేసిందని గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలోని మందడం గ్రామస్థులు వాపోతున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న సురక్షిత తాగునీటి పథకం ట్యాంకుకు రంగులు మార్చడం వల్ల వారు నీటి సరఫరా ఆపివేశారు. దీంతో మేము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పరిధిలోకి వచ్చే మందడం గ్రామ ప్రజల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలా రంగులు మార్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసిన తర్వాత ఇక్కడి గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎన్టీఆర్ ట్రస్టు ముందుకొచ్చింది. ఇక్కడి గ్రామాల్లో ప్రత్యేకంగా ట్యాంకులు ఏర్పాటు చేసి ఉచితంగా తాగునీరు అందజేశారు. స్థానికంగా స్థలం చూపిస్తే అక్కడ ట్యాంకు ఏర్పాటు చేసి నీటిని శుభ్రపరిచి ప్రజలకు అందించేవారు. ఈ క్రమంలో తుళ్లూరు మండలం మందడం గ్రామంలో కూడా రెండు చోట్ల ట్యాంకులు ఏర్పాటు చేసి మంచినీరు ఇస్తున్నారు.

వీటిలో ఒకటి మందడం ప్రభుత్వ పాఠశాలకు ఆనుకుని ఉంది. వాస్తవానికి ఈ స్థలాన్ని పుష్పావతమ్మ అనే మహిళ విరాళంగా ఇచ్చింది. అక్కడ గ్రంథాలయం, పాఠశాలను నిర్మించారు. మిగిలిన స్థలం కొంత భాగంలో ఎన్టీఆర్ సుజల తాగునీటి ట్యాంకు ఏర్పాటు చేశారు. అప్పట్లో నారా లోకేష్​తో పాటు ఎంపీ గల్లా జయదేవ్ వచ్చి ఈ ట్యాంకుని ప్రారంభించారు. అప్పటి నుంచి గ్రామస్థులకు ఉచితంగా తాగునీరు అందుతోంది. వైసీపీ ప్రభుత్వం నాడు నేడులో భాగంగా ఇటీవల ఇక్కడి పాఠశాలకు రంగులు వేసింది.

ఇదే క్రమంలో పక్కనే ఉన్న ఎన్టీఆర్ సుజల ట్యాంకుకు తెలుపు రంగు వేశారు. ఈ ట్యాంకు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా దానిపై నాడు నేడు అని రాశారు. తాము ఏర్పాటు చేసిన ట్యాంకుకు రంగులు మార్చటంతో దాని నిర్వహణ నుంచి ఎన్టీఆర్ ట్రస్టు వైదొలిగింది. దీంతో తాగునీటి సరఫరా ఆగిపోయింది. ప్రజలు ఇప్పుడు తాగునీరు లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి గ్రామస్థులు గ్రామంలో ఉన్న మరో ట్యాంకు నుంచి నీరు తెచ్చుకుంటున్నారు.

అయితే అక్కడి ట్యాంకు గ్రామ ప్రజలందరి అవసరాలు పూర్తిగా తీర్చలేని పరిస్థితి. దీంతో తాగునీటికి రెండు రోజులుగా ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. రాజధాని ఉద్యమం తీవ్రంగా ఉన్న గ్రామాల్లో మందడం ముందువరుసలో ఉంటుంది. పైగా ముఖ్యమంత్రి ఇదే మార్గంలో సచివాలయానికి, అసెంబ్లీకి వెళ్తుంటారు. ఎన్టీఆర్ ట్రస్టు పేరుతో ఉన్న ట్యాంకు ముఖ్యమంత్రి చూడలేక ఇలా రంగులు మార్చారని.. దీంతో తమకు తాగునీటి సమస్య తలెత్తిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

"వైసీపీ సర్కారు మా గ్రామంలో ఉన్న రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నెల 21వ తేదీ నుంచి మాకు తాగునీటి సరఫరా లేదు. మా ఇళ్లళ్లో చుక్క మంచి నీళ్లు కూడా లేవు. అసలే వచ్చేది ఎండాకాలం. తాగునీరు లేక వృద్ధులు, చిన్నపిల్లలతో సహా మేమంతా చాలా ఇబ్బంది పడుతున్నాము."
- రాధిక, గ్రామస్థురాలు

ట్యాంకుపై ఎన్టీఆర్​తో పాటు చంద్రబాబు ఫొటోలు ఉండేవి. వైసీపీ సర్కారు వచ్చాక చంద్రబాబు ఫొటో తొలగించారు. అలాగే ప్రభుత్వ సహకారం లేకపోవటంతో కొన్నిచోట్ల తాగునీటి సరఫరాలో అవాంతరాలు వస్తున్నాయి. ఇప్పుడు రంగుల మార్పు వ్యవహారం పండుగ వేళ గ్రామస్థులకు తాగునీటి ఇబ్బంది తెచ్చిపెట్టింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.