ETV Bharat / state

ఇక ఎమ్మెల్యేల వంతు.. అధికార పార్టీలో క్రాసింగ్ గుబులు.. నేడు ఎమ్మెల్సీ ఎన్నిక

author img

By

Published : Mar 22, 2023, 8:20 PM IST

Updated : Mar 23, 2023, 6:20 AM IST

ఎమ్మెల్సీల ఎన్నిక
ఎమ్మెల్సీల ఎన్నిక

MLA QUOTA MLC ELECTION : ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరగనున్నఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ నుంచి ఏడుగురు సభ్యులు, ప్రతిపక్షం తెలుగుదేశం నుంచి ఒకరు బరిలో ఉండటంతో ఎవరిని విజయం వరిస్తుందనేది రసవత్తరంగా మారింది. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేసే ఎమ్మెల్యేలతో ఫలితాలు తారుమారు కానుండగా.. తమ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలుస్తుందని టీడీపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

MLA QUOTA MLC ELECTION : రాష్ట్రంలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ నుంచి ఏడుగురు సభ్యులు, ప్రతిపక్షం తెలుగుదేశం నుంచి ఒకరు బరిలో ఉండటంతో ఎవరిని విజయం వరిస్తుందనేది రసవత్తరంగా మారింది. ఏడుగురు సభ్యుల్నీ గెలిపించుకునే బలం తమకుందని అధికార పక్షం ధీమా వ్యక్తం చేస్తుంటే.. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేసే ఎమ్మెల్యేలతో తమ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలుస్తుందని తెలుగుదేశం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు కావాల్సి ఉన్నందున.., విప్‌ లేకుండా జరిగే రహస్య బ్యాలెట్‌లో ఏ ఓటు ఎటు పడుతుందనే ఉత్కంఠ చర్చనీయాంశమైంది.

రసవత్తరంగా మారిన అంతరాత్మ ప్రబోధానుసారం అంశం.. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకూ అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే పోలింగ్​కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 7స్థానాలకు జరుగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతరాత్మ ప్రబోధానుసారం అంశం రసవత్తరంగా మారింది. అధికార వైఎస్సార్సీపీరీ సాంకేతికంగా 6 స్థానాలు మాత్రమే గెలుచుకునే బలం ఉన్నా 7స్థానాల్లోనూ తమ అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టింది. అయితే ఇటీవల 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన అధికార పార్టీ.. ఎమ్మెల్యే కోటా ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అసంతృప్తి ఎమ్మెల్యేలపై ప్రత్యేక నిఘా పెట్టి క్రాసింగ్ ఓటింగ్ చేస్తారనే అనుమానం ఉన్నవారి లిస్ట్ తయారు చేసుకుని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. ప్రతిపక్షం టీడీపీ సాంకేతికంగా ఒకటి గెలుచుకునే అవకాశం ఉన్నా.., నైతిక మద్దతు లేనికారణంతో తటపటాయిస్తూనే తమ అభ్యర్థిగా బీసీ మహిళ పంచుమర్తి అనురాధను ఎన్నికల బరిలో నిలబెట్టింది.

విజయానికి 22 తొలి ప్రాధాన్యత ఓట్లు.. ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్యేల సంఖ్య, ఖాళీ స్థానాలకు అదనంగా ఒకటి జోడించి భాగించాల్సి ఉంది. ఈ లెక్కన మొత్తం శాసనసభ్యులున్న 175 సంఖ్యను 8తో భాగిస్తే ఒక్కో అభ్యర్థి గెలుపుకోసం 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు అవసరం. ఏ ఇద్దరు అభ్యర్థులైనా 22 మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించకపోతే.. రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్నాయి. టీడీపీ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు పడే అవకాశం లేనప్పటికీ.. అధికార పార్టీ నుంచి ఒక్క ఓటు క్రాస్ అయినా అభ్యర్థి గెలుపు లాంఛనమే.

వైఎస్సార్సీపీలో ముసలం... అసెంబ్లీలో అధికార వైఎస్సార్సీపీకి 151 మంది సభ్యుల బలం ఉండగా.. ఈ బలం ఆరుగురు సభ్యులను మాత్రమే గెలిపించుకునేందుకు సాధ్యపడుతుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్‌ వైఎస్సార్సీపీలో చేరారు. వీరితోపాటుగా జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్‌ వైఎస్సార్సీపీతో ఉన్నారు. దీంతో తమకు నైతికంగా 156 మంది సభ్యుల బలం ఉందని వైఎస్సార్సీపీ చెప్తోంది. అయితే అధికార పార్టీ అసంతృప్తి ఎమ్మెల్యేల్లో ముసలం వేధిస్తోంది. ఆ పార్టీ నుంచి గెలుపొందిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కొంత కాలంగా ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతరాత్మ ప్రబోధానుసారం తాము ఓటు వేస్తామని వారిద్దరూ బహిరంగంగానే ప్రకటించిన నేపథ్యంలో అధికార పార్టీలో అలజడి మొదలైంది.

రహస్య ఓటింగ్​పై టీడీపీ ధీమా... ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేయకుంటే అధికార వైఎస్సార్సీపీ బలం 154కు తగ్గుతుంది. పార్టీ నిలబెట్టిన ఏడుగురు సభ్యులకు ఒక్కొక్కరు 22ఓట్లు వేసేందుకు విజయానికి సరిపోతుంది. ఇక్కడే అధికార పార్టీని క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. ఇప్పటికే 3సార్లు మాక్ పోలింగ్ నిర్వహించినా 132మందికి మించి సభ్యులు హాజరు కాకపోవటం, హాజరైనా వారిలోనూ నలుగురు ఎమ్మెల్యేలు చెల్లని ఓట్లు వేయటం వంటి పరిణామాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యాన మొత్తం ఎమ్మెల్యేలను ఏడు బృందాలుగా విభజించి ప్రతీ బృందానికి ఇద్దరు, ముగ్గురు మంత్రులు పర్యవేక్షించేలా జాగ్రత్తపడుతోంది. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటెయ్యాలంటూ టీడీపీ ఇస్తున్న పిలుపునకు అనుగుణంగా పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారనే అనుమానం అధికార పార్టీకి లేకపోలేదు. రహస్య ఓటింగ్ ఫలితంలో తమ అభ్యర్థి విజయం ఖాయమని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.

వెంటనే ఫలితాలు... అధికార పార్టీ నుంచి ఒకరిద్దరు అభ్యర్థులు గైర్హాజరైనా లేక, చెల్లని ఓటేసినా టీడీపీకి వచ్చే లాభం ఏమీ లేకపోవటంతో క్రాస్ ఓటింగ్​పైనే ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. అందుకుతోడు తమ పార్టీలో ప్రస్తుతం ఉన్న 19మంది ఎమ్మెల్యేలు ఎలాంటి తప్పు లేకుండా ఓటు వేసుకునేలా కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నిక ప్రక్రియ పూర్తవగానే స్వల్ప విరామంతోనే కౌంటింగ్ ప్రారంభం కానుంది. 175 ఓట్లు మాత్రమే కాబట్టి.. రాత్రిలోపే తుది ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవీ చదవండి :

Last Updated :Mar 23, 2023, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.