తెలంగాణ

telangana

కర్ణాటకలో బీజేపీకి షాక్.. గుజరాత్ ఫార్ములా ఫెయిల్!​.. పార్టీకి ప్రముఖ నేతలు గుడ్​బై!!

By

Published : Apr 14, 2023, 3:21 PM IST

Karnataka Elections 2023 : కర్ణాటకలో వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ తొలిసారి అమలు చేసిన గుజరాత్‌ తరహా ఫార్ములా బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు 212 మందితో రెండు జాబితాలు విడుదల చేయగా 60 మంది సిట్టింగ్‌లను టికెట్లు దక్కలేదు. టికెట్లు రాని ఎమ్మెల్యేలు కొందరు ఇప్పటికే రాజీనామా చేయగా.. మరికొందరు అదే బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అసంతృప్తులను బుజ్జగించేందుకు కమలం పెద్దలు మాజీ సీఎం యడియూరప్పను బరిలోకి దించినా పరిస్థితులు అదుపులోకి వస్తున్నట్లు కనిపించటం లేదు.

karnataka elections 2023 bjp rebels
karnataka elections 2023 bjp rebels

Karnataka Elections 2023 : కర్ణాటకలో భారతీయ జనతా పార్టీలో టికెట్ల పంపిణీ అగ్గిరాజేసింది. పార్టీ టికెట్‌ ఆశించి భంగపడిన వారంతా రాజీనామాల బాటపట్టారు. ఇప్పటివరకు రెండు జాబితాలు విడుదల చేసిన కమలనాథులు.. దాదాపు 60మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నేతలు రాజీనామా చేశారు. మరికొందరు కూడా అదే బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

కర్ణాటకలో అధికారం నిలబెట్టుకోవాలని ఆశిస్తున్న కమలం పార్టీ.. ఈసారి గుజరాత్‌ తరహా ఫార్ములా అమలు చేసింది. అంతర్గత ఓటింగ్‌ విధానం ద్వారా అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం చుట్టింది. జిల్లా, తాలుకా, బూత్ స్థాయిలో నేతల అభిప్రాయం మేరకు ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున 672 మంది అభ్యర్థుల పేర్లను హస్తినకు పంపారు. భాజపా పార్లమెంటరీ బోర్డు ముగ్గురు పేర్లపై చర్చించి అందులో ఒకరిని ఖరారు చేసింది.

60 మంది సిట్టింగ్​ MLAలకు షాక్!
కర్ణాటకలో మొత్తం 224 స్థానాలు ఉండగా.. ఇప్పటివరకు 212 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. రెండు జాబితాల్లో కలిపి 60 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను కమలం పెద్దలు పక్కనపెట్టారు. చిక్‌మగళూరు జిల్లా ముదిగెరె ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే కుమారస్వామికి టికెట్‌ నిరాకరించారు. అక్కడ దీపక్‌ దోడ్డయ్యకు అవకాశం ఇచ్చారు. దీంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే కుమారస్వామి పార్టీకి రాజీనామా చేశారు. రెండు దశాబ్దాలకుపైగా భాజపాలో కొనసాగిన ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఎమ్మెల్యే కుమారస్వామి

'టికెట్​ రాకుండా జిల్లా అధ్యక్షుడు అడ్డు!'
తూమకూరు నుంచి పోటీ చేయాలని ఆశించిన మాజీ మంత్రి సొగడు శివన్నకు టికెట్‌ దక్కకపోవటం వల్ల ఆయన రాజీనామా చేశారు. తనకు టికెట్‌ రాకుండా ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు అడ్డుపడ్డారని ఆరోపించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే జ్యోతి గణేశ్​కు రెండోసారి అవకాశం దక్కింది. ధార్వాడ్‌లోని కలఘట్టగి సిట్టింగ్‌ ఎమ్మెల్యే నింబన్నవారాను పక్కనబెట్టిన భాజపా.. ఇటీవల పార్టీలో చేరిన నాగరాజ్‌ ఛబ్బికి టికెట్‌ ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యే తన మద్దతుదారులతో సమావేశమై భవిష్యత్తు నిర్ణయం ప్రకటించనున్నట్లు నింబన్నవారా తెలిపారు.

మాజీ మంత్రి సొగడు శివన్న

'సీఎం బొమ్మై వల్ల నాకు టికెట్​ ఇవ్వలేదు!'
హావేరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్‌కు.. రెండోసారి టికెట్‌ దక్కలేదు. అక్కడ గవి సిద్ధప్పు అవకాశం ఇచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్‌.. తనకు టికెట్‌ రాకపోవటానికి సీఎం బసవరాజ్‌ బొమ్మై కారణమని ఆరోపించారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు హావేరిలో ఆందోళనకు దిగారు. బెళగావి జిల్లా హుక్కెరి టికెట్‌ ఆశించిన మాజీ మంత్రి శశికాంత్‌ నాయక్​కు భంగపాటు ఎదురైంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న భాజపా పెద్దలు దివంగత మాజీమంత్రి ఉమేశ్​ కత్తి కుమారుడు నిఖిల్‌ కత్తికి టికెట్‌ ఇచ్చారు. పార్టీ నిర్ణయంపై మాజీ మంత్రి శశికాంత్‌ నాయక్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కత్తి కుటుంబం వేధింపులు తట్టుకోలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అథాని టికెట్‌ ఆశించి భంగపడిన ఎమ్మెల్సీ లక్ష్మణ్‌ సవాడి రాజీనామా చేసి కాంగ్రెస్‌ చేరారు. టికెట్‌ రాకపోవటం వల్ల హోస్‌దుర్గ ఎమ్మెల్యే గులిహట్టి శేఖర్‌ భాజపాకు గుడ్‌బై చెప్పారు. తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మొదటి జాబితాలో టికెట్లు దక్కకపోవటం వల్ల దక్షిణ కన్నడ జిల్లా సుల్యా ఎమ్మెల్యే అంగార, ఎమ్మెల్సీ శంకర్‌, మాజీ ఎమ్మెల్యే దొడ్డప్పగౌడ పాటిల్‌ మరికొందరు భారతీయ జనతా పార్టీని వీడారు.

ఎమ్మెల్సీ లక్ష్మణ్‌ సవాడి

దిల్లీ పెద్దలు అప్రమత్తం!
ఊహించని విధంగా అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడటం వల్ల దిల్లీ పెద్దలు అప్రమత్తమయ్యారు. పార్టీ గెలుపు అవకాశాలు ఏమాత్రం దెబ్బ తినకుండా టికెట్లు రాని వారిని దారికి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. అందుకోసం మాజీ సీఎం యడియూరప్పను రంగంలో దించారు. టికెట్లు రానివారితో సమావేశమై ఒప్పించాలని సూచించినట్లు తెలుస్తోంది. యడియూరప్ప మంత్రాంగం ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి.

ABOUT THE AUTHOR

...view details