తెలంగాణ

telangana

అన్నం దొరక్క ప్రజల ఇక్కట్లు.. సాగుబాట పట్టిన సైన్యం!

By

Published : Jun 19, 2022, 7:17 AM IST

Updated : Jun 19, 2022, 7:25 AM IST

ఒకప్పుడు బియ్యం ఉత్పత్తిలో స్వయంసమృద్ధమైన శ్రీలంక నేడు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటోంది. లక్షలమంది ఆహారం కోసం అల్లాడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ కొరత తీర్చటానికి ప్రభుత్వం.. సైన్యాన్ని రంగంలోకి దింపింది. సైనికులు కలుపు తీసి దుక్కి దున్ని వివిధ పంటలకు నాట్లు వేస్తారు. వీరికి వ్యవసాయ నిపుణులు తోడ్పడతారు.

srilanka crisis
శ్రీలంక సైన్యం

సాధారణంగా ఏ దేశం సైన్యమైనా సరిహద్దుల్లో కాపలా కాస్తుంది. శత్రువును ఎదుర్కొనే సన్నాహాల్లో మునిగి తేలుతూ ఉంటుంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోని సైన్యం మాత్రం సాగుబాట పట్టింది. కలుపు తీసి.. దుక్కి దున్ని.. నాట్లు వేయడానికి సిద్ధమైంది. 2021 ఏప్రిల్‌లో దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స రసాయన ఎరువుల దిగుమతిని నిషేధించి.. ప్రకృతి సేద్యం తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆ దేశ వ్యవసాయం కుదేలైంది. ఒకప్పుడు బియ్యం ఉత్పత్తిలో స్వయంసమృద్ధమైన లంక నేడు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటోంది. 2.2 కోట్ల లంక జనాభాలో 40 నుంచి 50 లక్షలమంది ఆహారం కోసం అల్లాడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ కొరత తీర్చటానికి ప్రభుత్వం.. సైన్యాన్ని రంగంలోకి దింపింది. జులై నుంచి 1,500 ఎకరాల ప్రభుత్వ బంజరు భూముల్లో సైన్యం సేద్యం చేపట్టనున్నది. దీనికోసం గురువారం.. హరిత వ్యవసాయ సారథ్య సంఘాన్ని ఏర్పాటు చేసింది. సైనికులు కలుపు తీసి దుక్కి దున్ని వివిధ పంటలకు నాట్లు వేస్తారు. వీరికి వ్యవసాయ నిపుణులు తోడ్పడతారు. స్థానిక, రాష్ట్ర స్థాయుల్లోనూ వ్యవసాయ యోగ్య భూములను గుర్తించి సేద్యం చేయడానికి గవర్నర్లు, జిల్లా అధికారులు, గ్రామ సిబ్బంది సైన్యానికి సహకరిస్తారు. సైనికులతో పాటు.. ప్రభుత్వ అధికారులు వచ్చే మూడు నెలలపాటు వారానికి ఒక రోజు సెలవు పెట్టి ఆహారోత్పత్తిలో పాలు పంచుకోవడానికి మంత్రివర్గం అనుమతించింది.

కార్యాలయాలు, పాఠశాలల బంద్‌:తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్న శ్రీలంక వచ్చేవారం ప్రభుత్వ కార్యాలయాలనూ, పాఠశాలలనూ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి ఇది అమలులోకి వస్తుంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు ఖాళీ అయిపోవడంతో శ్రీలంక ఇంధనాన్ని దిగుమతి చేసుకోలేకపోతోంది. ఫలితంగా ప్రజా రవాణా స్తంభించిపోయింది. ప్రైవేటు వాహనాలూ పెట్రోలు, డీజిల్‌ కొరతతో గ్యారేజీలు దాటి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోతోంది. పెట్రోలు బంకుల ముందు వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. ఇప్పటికి చాలా నెలల నుంచి దేశంలో రోజుకు 13 గంటల సేపు విద్యుత్‌ సరఫరా బంద్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి రవాణా సౌకర్యం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం కూడా సెలవు ప్రకటించారు.

Last Updated :Jun 19, 2022, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details