తెలంగాణ

telangana

Dalitha Bandhu: దళితబంధు అమలుపై ఇవాళ సమీక్షించనున్న సీఎం కేసీఆర్​

By

Published : Aug 27, 2021, 3:20 AM IST

Updated : Aug 27, 2021, 9:04 AM IST

నేడు దళితబంధుపై సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్షకు మంత్రులు హరీశ్​రావు, గంగుల, కొప్పులతో పాటు ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు హజరుకానున్నారు. నిన్న రాత్రే కరీంనగర్​లోని తీగలగుట్టపల్లికి సీఎం చేరుకున్నారు.

cm kcr
సీఎం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధుపై సీఎం కేసీఆర్ తొలి నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. పథకం ప్రారంభం నుంచి అనేక సార్లు సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. పైలెట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించిన ఈ పథకానికి నిథుల కేటాయింపు కూడా జరిగిపోయింది. ఇప్పటికే కలెక్టర్ ఖాతాలో దళితబంధు నిధులు రూ.2 వేల కోట్లు జమ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే నేడు దళితబంధుపై సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్షకు మంత్రులు హరీశ్​రావు, గంగుల, కొప్పులతో పాటు ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు హజరుకానున్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తనయుని వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్ నిన్న రాత్రి రోడ్డు మార్గాన కరీంనగర్ చేరుకున్నారు. సీఎంకు మంత్రి గంగుల కమలాకర్​తో పాటు కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ ఘన స్వాగతం పలికారు.

నేటి నుంచి సర్వే..

మరోవైపు హజూరాబాద్‌లో నేటి నుంచి దళితబంధుపై ఇంటింటి సర్వే జరగనుంది. దళితబంధు ఇంటింటి సర్వేపై అధికారులకు పూర్తిస్థాయి శిక్షణ నిర్వహిస్తున్నారు. రోజుకు 100-150 ఇళ్లు సర్వే చేయనున్న జిల్లాస్థాయి అధికారులు. దళిత బంధు సర్వేలో మొత్తం 350 మంది అధికారులు పాల్గొననున్నారు. సర్వే అనంతరం గ్రామసభలో అభ్యంతరాలు స్వీకరిస్తారు.

దశల వారీగా అమలు

రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి వంద చొప్పున పేద దళిత కుటుంబాలను ఎంపిక చేసి పథకం కింద ఈ ఏడాది ఆర్థికసాయం అందిస్తారు. మిగతా వారికి దశల వారీగా అమలు చేస్తారు. వచ్చే ఏడాది బడ్జెట్​లో దళితబంధు కోసం రూ.30 వేల కోట్లు వరకు కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అఖిలపక్షం, హుజురాబాద్ దళిత ప్రతినిధులతో ఇప్పటికే సమావేశమై దళితబంధు పథక తీరుతెన్నులు, అమలుపై సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో జీవనోపాధి, వ్యాపారం కోసం కొన్ని యూనిట్లను కూడా సిద్ధం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంత అవసరాలను దృష్టిలో ఉంచుకొని యూనిట్ల జాబితాను సిద్ధం చేశారు. లబ్ధిదారులు వారికి నచ్చిన ఉపాధిమార్గాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మార్గానిర్ధేశం, పర్యవేక్షణ ఉంటుంది. కొంత మంది లబ్ధిదారులు కలిసి ఎక్కువ పెట్టుబడితో పెద్ద యూనిట్ పెట్టుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో దళితబంధు అమలు కానుంది.

అన్ని రకాలుగా అండగా ఉండేలా..

వార్డు, గ్రామ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేకాధికారులను నియమించనున్నారు. కేవలం ఆర్థిక ప్రేరణ ఇవ్వటం వరకే పరిమితం కాకుండా దళితులను వివిధ వ్యాపార రంగాల్లో ప్రోత్సహించేందుకు ప్రత్యేక రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొంది ఏర్పాటు చేసుకునే ఫర్టిలైజర్ షాపులు, మెడికల్ షాపులు, ఆస్పత్రులు, వసతి గృహాలు, సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టులు, ఇంకా ప్రభుత్వం ద్వారా లభించే ఇతర కాంట్రాక్టులు, వైన్, బార్ షాపుల ఏర్పాటుకు లైసెన్స్ ఇచ్చే దగ్గర ప్రభుత్వం.... దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.

ఇదీ చదవండి:కరీంనగర్​కు సీఎం.. దళితబంధుపై సమీక్ష

Last Updated :Aug 27, 2021, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details