తెలంగాణ

telangana

Floods: గోదావరి మహోగ్రరూపం.. అల్లాడిపోతున్న జనం

By

Published : Jul 16, 2022, 3:07 PM IST

Floods: ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులన్నీ జలమయమవ్వటంతో.. ప్రజల ఇబ్బందులకు గురయ్యారు. గోదావరి ఉగ్రరూపాన్ని చూసి జనం హడలిపోతున్నారు. లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోగా మరికొన్నింటిని ముంపు ముప్పు వెంటాడుతోంది. ఎగువన వర్షాలు, వరద ప్రవాహంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఏపీలోని ధవళేశ్వరం వద్ద నీటిి మట్టం గంటగంటకూ పెరుగుతుంది.

Floods
Floods

Floods: గోదావరి వరద ప్రజలను కుదుటపడనివ్వటం లేదు. గోదావరి మహోగ్రరూపం దాల్చటంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉద్ధృతి గంటగంటకూ పెరుగుతుండడంతో వరద జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటిమట్టం 20.60 అడుగులగా కొనసాగుతోంది. ఇంకా ప్రవాహం పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. వరద యధావిధిగా కొనసాగితే, 44 మండలాల్లోని 628 గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముండంతో.. చేపట్టాల్సిన చర్యలపై అధికారులు సమాలోచన చేస్తున్నారు.

ఇప్పటివరకు 42 మండలాల్లోని 279 గ్రామాలు ముంపు బారిన పడ్డాయని అధికార్లు లెక్కతేల్చారు. 10 ఎన్డీఆర్‌ఎఫ్‌, 10 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. కీలక శాఖల ఆధ్వర్యంలో సహాయక చర్యల్లో నిమగ్నమైయ్యాయి. వరద బాధితులు లంక గ్రామాల నుంచి ఏటిగట్లను ఆశ్రయిస్తున్నారు.

ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 21.32 లక్షల క్యూసెక్కులు ఉండగా.. సాయంత్రంకు 25 లక్షల క్యూసెక్కులు చేరే అవకాశముంది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇప్పటివరకు బ్యారేజీ నుంచి పంటకాల్వలకు 10,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సముద్రంలోకి 23.94 లక్షల క్కూసెక్కులు విడిచిపెట్టారు.

కోనసీమలో 21, తూర్పుగోదావరిలో 9 మండలాలపై వరద ప్రభావం కనిపిస్తోంది. అల్లూరి జిల్లాలో 5, పశ్చిమగోదావరి జిల్లాలోని 4 మండలాలపై వరద ప్రభావం పడనుంది. ఏలూరులో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాల కూడా ముంపు బారిన పడే అవకాశముంది. ఇప్పటివరకు 62,337 మందిని 220 పునరావాస కేంద్రాలకు తరలించారు.

కోనసీమ..జిల్లాలోని ఐ.పోలవరం మండలంలో ఏటిగట్టు బలహీనంగా మారింది. కాగా.. ఏటిగట్టుకు గండి పడే అవకాశం ఉండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. పశువుల్లంక అన్నంపల్లి అక్విడేట్ వద్ద ఏటిగట్టు మారగా.. పి.గన్నవరం వద్ద డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ వరద ముంపులో ఉంది.

కర్నూలు జిల్లాలో.. మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. నది వద్దనున్న గంగమ్మ ఆలయం, పుష్కర ఘాట్లు..నీటిలో మునిగిపోయాయి. స్నానాలు నిలిపివేసి, అధికారులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో..అల్లూరి జిల్లాలోని గుండాల గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. గ్రామంలోని 50 మంది వరదల్లో చిక్కుకున్నారు. వరద ప్రవాహం పెరగడంతో ఇళ్లపైకి ఎక్కిన గ్రామస్థులు.. సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వారంతా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ప.గో.జిల్లాలో.. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురం వద్ద గోదావరిలో మహిళ గల్లంతైంది. అర్ధరాత్రి బహిర్భూమికి వెళ్లి.. మహిళ గల్లంతైనట్లు స్థానికులు తెలపగా, ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఏలూరులో..ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం బేస్తగూడెం వరదల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో గ్రామంలోని 2 కుటుంబాలు వరదలో చిక్కుకుని.. ఓ భవనంపై తలదాచుకుంటున్నారు.

తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవాహిస్తుంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 70.70 అడుగులకు చేరగా.. 24.13 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతునే ఉంది.

గోదావరి మహోగ్రరూపం..అల్లాడిపోతున్న జనం

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details