తెలంగాణ

telangana

Corona Vaccination: హైదరాబాద్​లో జోరుగా వ్యాక్సినేషన్​.. నిత్యం 80వేల డోసుల పంపిణీ

By

Published : Sep 8, 2021, 9:01 AM IST

భాగ్యనగరంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి ప్రాంతాల్లో మంగళవారం నాటికి మొత్తం సుమారు 91.91 లక్షల మందికి టీకా పంపిణీ చేశారు.

corona vaccination in hyderabad
corona vaccination in hyderabad

హానగరంలో టీకా కోటి డోసులకు చేరువవుతోంది. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి ప్రాంతాల్లో మంగళవారం నాటికి మొత్తం సుమారు 91.91 లక్షల మందికి టీకా పంపిణీ చేశారు. ఇందులో 25 లక్షల మంది రెండు డోసులు తీసుకున్నారు. అయితే ఇటీవల వరకు తొలి డోసు కార్యక్రమమంత వేగంగా రెండో డోసు ప్రక్రియ సాగడం లేదు. నిర్ణీత సమయం మించి పోతున్నా సరే...కొందరు రెండో డోసుకు నోచుకోవడం లేదు. ఇప్పుడిప్పుడే రెండో డోసు టీకా పంపిణీ కూడా ఊపందుకుంటోంది. రానున్న పండుగల నేపథ్యంలో టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు వైద్యఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్వంలో 550 మొబైల్‌ వాహనాలను రంగంలోకి దించారు. మైకుల్లో ప్రతి కాలనీకి తిరిగి ప్రచారం చేస్తున్నారు. లబ్ధిదారుల వద్దకే వెళ్లి టీకా అందిస్తున్నారు. తాజాగా మూడు జిల్లాల పరిధిలో నిత్యం 80 వేల మందికి టీకాలు వేస్తున్నారు. ఇందులో హైదరాబాద్‌ జిల్లా ముందుంటోంది.

వైరస్‌లో రకరకాల ఉత్పరివర్తనాలు బయటపడుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండు డోసులు తీసుకున్నాసరే...ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలన్నారు. కొన్ని కేంద్రాల పరిధిలో వైద్య సిబ్బంది మధ్య సమన్వయ లోపం కారణంగా టీకాల కోసం వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఏ కేంద్రంలో ఏ టీకా ఇస్తున్నారో.. ఎన్నో డోసు అందిస్తున్నారో.. తదితర సమాచారం అందుబాటులో ఉండటం లేదని వాపోతున్నారు. కేంద్రాలకు వెళ్లి ఆరా తీసినా సరే...ప్రయోజనం ఉండటం లేదని, అక్కడి సిబ్బంది నిర్లక్ష్య పూరితంగా సమాధానం ఇస్తున్నారని పేర్కొంటున్నారు. ఇలాంటి లోపాలను సరిదిద్ది ప్రతి ఒక్కరికి టీకా అందించే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు.


ఇదీచూడండి:CORONA: థర్డ్​వేవ్​ భయం.... కొలువుకి వెళ్లాలా? వద్దా? అన్న సందిగ్ధం!!

ABOUT THE AUTHOR

...view details