తెలంగాణ

telangana

కేంద్రమంత్రి ఇంటిపై ఆందోళనకారుల దాడి.. అమిత్ షా వస్తానన్న కాసేపటికే అలా..

By

Published : May 26, 2023, 8:13 PM IST

Manipur Violence : విదేశాంగ శాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ ఆర్​కే రంజన్​ సింగ్​ నివాసంపై దాడి చేశారు ఆందోళనకారులు. మణిపుర్​లో గత కొన్ని రోజులుగా విధ్వంసం సృష్టిస్తున్న నిరసనకారులు గురువారం రాత్రి మంత్రి నివాసంపై దాడికి పాల్పడ్డారు.

manipur violence
manipur violence

Manipur Violence : విదేశాంగ శాఖ సహాయ మంత్రి, బీజేపీ నాయకుడు ఆర్​కే రంజన్​ సింగ్​ నివాసంపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. ఇంపాల్​లోని ఆయన ఇంటిపై గురువారం రాత్రి 9 గంటల సమయంలో రాళ్లతో దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. పరిస్థితిని సద్దుమణిచేందుకు టియర్​ గ్యాస్​ను ప్రయోగించారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడం వల్ల మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఫలితంగా నిరసనకారులు వెనక్కి తగ్గారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు.

మంత్రి నివాసం వద్ద ఆందోళనకారులు

మణిపుర్​లో గిరిజనుల మధ్య తలెత్తిన వివాదం పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం లేదని మండిపడ్డారు ఆందోళనకారులు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన నిరసనకారులు.. తమకు ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి చేశారు. దాడి జరిగిన సమయంలో మంత్రి రంజన్​ సింగ్ ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటనతో శుక్రవారం ఉదయమే దిల్లీకి వచ్చేశారు. అంతకుముందు గవర్నర్​ అనుసూయతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు రంజన్ సింగ్​.

విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్​కే రంజన్​ సింగ్​

రాష్ట్ర మంత్రి ఇంటిపైనా దాడికి విఫలయత్నం
మరోవైపు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బిశ్వజిత్​ సింగ్​ ఇంటిపైనా దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు. ఆయన ఇంటి వద్ద పటిష్టమైన బందోబస్తు ఉండడం వల్ల ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. అయితే, ఈ దాడిలో మయన్మార్​కు చెందిన కుకీ మిలిటెంట్​ గ్రూపులు పాల్గొన్నాయని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.

మణిపుర్​లో పర్యటిస్తా: అమిత్ షా
Amit Shah Manipur Tour : మరికొన్నిరోజుల్లో మణిపుర్‌ పర్యటనకు వస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించిన కొద్ది సేపటికే ఈ ఘటన జరిగింది. గువాహటిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మణిపుర్​లో మూడు రోజుల పాటు ఉండి ప్రజలతో శాంతి నెలకొనేలా చూస్తానని హామీ ఇచ్చారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు. అందరికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.

వాయిదా వేసిన పరీక్ష తేదీలను ప్రకటించిన NTA
మణిపుర్​లో నెలకొన్న శాంతి భద్రతల నేపథ్యంలో వాయిదా వేసిన పలు జాతీయ ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మెడికల్​ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ పరీక్షలు జూన్​ 3 నుంచి జూన్​ 5 వరకు పోస్ట్​ గ్రాడ్యుయేట్​ కోర్సుల ప్రవేశ పరీక్షను జూన్​ 5 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.

మణిపుర్​ విధ్వంసం

Communal Violence In Manipur : మణిపుర్‌లో మెజారిటీలుగా ఉన్న మైతీలకు ఎస్టీ హోదా కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గిరిజన సంస్థలు ఆందోళనలను ఉద్ధృతం చేశాయి. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన సంఘీభావయాత్ర హింసాత్మక ఘటనలకు దారితీసింది. కొన్నిరోజుల పాటు రాష్ట్రం అట్టుడుకింది. ఆ ఘటనల్లో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే చెలరేగిన హింసాకాండలో ప్రాణ నష్టంతో పాటు కోట్లల్లో ఆస్తి నష్టం కూడా సంభవించింది. 30 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అందులో 26 వేల మందిని సురక్షితంగా ఇతర జిల్లాలకు తరలించారు అధికారులు.

ABOUT THE AUTHOR

...view details