ETV Bharat / sukhibhava

మధుమేహానికి రక్తపోటు తోడైతే గుండెకు ప్రమాదమా?

author img

By

Published : Oct 18, 2021, 6:19 PM IST

మధుమేహం ఉన్నవారికి అధిక రక్తపోటు తోడైతే గుండెకు పెద్ద ముప్పు పొంచి ఉన్నట్లే. ప్రతి 10 మంది మధుమేహుల్లో ఒకరికి రాత్రిపూట రక్తపోటు ఎక్కువగా ఉంటున్నట్టు ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. ఫలితంగా మరణించే ముప్పు రెండు రెట్లు అధికంగా ఉన్నట్లు బయటపడింది. ఈ నేపథ్యంలో రక్తపోటును తగ్గించుకోవడానికి మార్గాలేంటో తెలుసుకుందాం.

diabetes and high blood pressure
మధుమేహం, రక్తపోటు

మధుమేహం, అధిక రక్తపోటు జంట శత్రువులు. ఇవి రెండూ తోడైతే గుండెకు పెద్ద ముప్పు పొంచి ఉన్నట్టే. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారిలో రాత్రిపూట రక్తపోటు తక్కువగా ఉండేవారితో పోలిస్తే ఎక్కువగా ఉండేవారికి మరణించే ముప్పు రెండు రెట్లు అధికంగా ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. సాధారణంగా రక్తపోటు రాత్రిపూట తగ్గుతుంటుంది. అయితే కొందరికి అంతగా తగ్గదు. పగటి పూట కన్నా ఎక్కువగానే ఉంటుంది (రివర్స్‌ డిపింగ్‌).

మధుమేహుల్లో ఇలాంటి అసాధారణ రక్తపోటుకూ గుండెజబ్బులకు, మరణాలకూ సంబంధం ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ పీసా పరిశోధకులు గుర్తించారు. ప్రతి 10 మంది మధుమేహుల్లో ఒకరికి రాత్రిపూట రక్తపోటు ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. సుమారు మూడింట ఒకవంతు మందిలో గుండె, రక్తనాళాలను నియంత్రించే నాడులు దెబ్బతింటున్నట్టూ బయటపడింది. ఈ నాడులు క్షీణించటం వల్ల గుండె వేగం, రక్తపోటు అదుపు తప్పుతాయి. ఇది గుండెపోటు, మరణాలకు దారితీస్తుంది.

రక్తపోటు తగ్గాలంటే?

  • అధిక రక్తపోటుకు మందులు వాడుకోవటం తప్పనిసరి. అలాగే జీవనశైలిలో కొన్ని మార్పులూ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధిక బరువు, ఊబకాయంతో రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవాలి.
  • రోజుకు కనీసం అరగంట చొప్పున క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • పండ్లు, కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు, వెన్న తీసిన పాలు, పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
  • ఉప్పు వాడకం తగ్గించాలి. కూరలు, చిరుతిళ్లు అనిం్నటినీ కలిపినా రోజుకు చెంచాడు ఉప్పు కన్నా మించనీయొద్దు.
  • పొగతాగే అలవాటుంటే మానెయ్యాలి.
  • మద్యం అలవాటుంటే పరిమితం చేసుకోవాలి.
  • ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకు ధ్యానం, ప్రాణాయామం వంటి పద్ధతులు ఉపయోగపడతాయి.
  • అప్పుడప్పుడు రక్తపోటును పరీక్షించుకోవాలి. మందులు వేసుకుంటున్నా తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలి.

ఇదీ చూడండి: దీర్ఘకాల వాపు సమస్యకు ఈ ఆహారంతో చెక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.