ETV Bharat / state

Dalitha Bandhu Scheme : వాసాలమర్రిలో ఎస్సీ కార్పొరేషన్ అధికారుల పర్యటన

author img

By

Published : Aug 12, 2021, 11:24 AM IST

దళిత బంధు పథకం(Dalitha Bandhu Scheme)పై ఎస్సీ కార్పొరేషన్ అధికారులు దళితులకు అవగాహన కల్పిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించి.. ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. లబ్ధిదారులకు పథకం గురించి తెలియజేసి.. వారు ఆ నగదును ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో వివరిస్తున్నారు.

వాసాలమర్రిలో ఎస్సీ కార్పొరేషన్ అధికారుల పర్యటన
వాసాలమర్రిలో ఎస్సీ కార్పొరేషన్ అధికారుల పర్యటన

దళితబంధు(Dalitha Bandhu Scheme) నగదు ఇవ్వడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. లబ్ధిదారుల కోసం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో అధికారులు పర్యటిస్తున్నారు. దళితవాడల్లో తిరుగుతూ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు.. ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.

దళిత బంధు పథకం(Dalitha Bandhu Scheme) కింద వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాల కోసం ప్రభుత్వం యాదాద్రి జిల్లా కలెక్టర్ ఖాతాలో 7.60 కోట్లు ఇప్పటికే డిపాజిట్ చేసింది. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వనున్న నేపథ్యంలో వాసాలమర్రిలోని దళితులకు ఈ పథకంపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

" సీఎం కేసీఆర్.. వాసాలమర్రిలో పర్యటించి దళిత బంధు పథకం కింద ప్రతి ఎస్సీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఆ డబ్బుతో వాళ్లు ఏం చేద్దామనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే... ఆ నగదును ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు వంటి విషయాలను వారికి వివరిస్తున్నాం. మా బృందంతో కలిసి ఇంటింటికి తిరిగి లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నాం."

- శ్యాంసుందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, ఫీల్డ్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్ నేతృత్వంలో ఆఫీసర్లు నాలుగు రోజులుగా దళిత వాడల్లో తిరుగుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలతో ఏం చేస్తారు? దేనికి వినియోగించుకుంటారు? ఎలాంటి వ్యాపారం చేస్తారు? లాంటి ప్రశ్నలను అడుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. దళిత బంధు డబ్బులతో ఏ ఉపాధి పొందవచ్చు, ఎలాంటి వ్యాపారాలు చేయవచ్చో వారికి వివరిస్తున్నారు. ఈ పథకంపై వాసాలమర్రిలోని దళితులకు ఏ మేరకు అవగాహన ఉంది? వారి ఆలోచనల వివరాలపై ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసర్లు రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.