ETV Bharat / state

అప్పుడు కరవు పొమ్మంది... ఇప్పుడు ఉపాధి రమ్మంది

author img

By

Published : Oct 11, 2020, 7:40 PM IST

జీవితం...వెలుగునీడల సమాహారం. ఒక ఉదయం ముందర చీకట్లు... విజయం ముందర ఇక్కట్లు... రావడమన్నది మామూలేనని ఓ సినీకవి రాతలకు వారి జీవితాలే నిదర్శనం. ఊపాధి కరవై ఊరును వదిలి.. పడరాని పాట్లు పడి.. ప్రభుత్వ భరోసాతో తిరుగొచ్చారు. బతుకుపై కొత్త ఆశలు చిగురించగా... ఆత్మవిశ్వాసంతో సొంతంగా యూనిట్లు పెట్టుకుని గౌరవంగా బతుకున్నారు వరంగల్ పరిసర ప్రాంతాల చేనేత కార్మికులు. ఇప్పుడు వారు తయారు చేసే వస్త్రాల్లోనే కాదు... వారి జీవితాల్లోనూ సంతోషపు కాంతులు కనపడుతున్నాయి.

అప్పుడు కరవు పొమ్మంది... ఇప్పుడు ఉపాధి రమ్మంది
అప్పుడు కరవు పొమ్మంది... ఇప్పుడు ఉపాధి రమ్మంది

ఉన్న ఊళ్లో ఉపాధి కరవైంది. భారమవుతున్న కుటుంబ పోషణను భుజాన వేసుకున్నారు. భార్యా బిడ్డలతో 40 ఏళ్ల కిందట వలస బాట పట్టారు వరంగల్​ పరిసర ప్రాంతాల్లోని చేనేత కార్మికులు. రాష్ట్రం కాని రాష్ట్రంలో కూలీల్లా మారి రేయింబవళ్లు శ్రమించారు. చెమటను నమ్ముకుని కడుపుని నింపుకున్న వారి బతుకుల్లో నేడు సంతోషం విరభూస్తోంది. ఇప్పుడా వలస బతుకుల్లో పారిశ్రామిక వెలుగులీనుతున్నాయి. వరంగల్ శివార్లలోని మడికొండలో పరిశ్రమలు నెలకొల్పి... వ్యాపారవేత్తలుగా మారుతున్నారు. తమ బతుకులు బాగు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్​, కేటీఆర్​కు పదే పదే కృతజ్ఞతలు చెబుతున్నారు.

వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ తదితర ప్రాంతాలనుంచి వందల మంది చేనేత కార్మికులు ఉపాధి కోసం గుజరాత్‌, మహారాష్ట్రకు దశాబ్దాల క్రితమే వలస వెళ్లారు. ప్రధానంగా సూరత్, షోలాపూర్, బీవండి ప్రాంతాల్లో అనేక తెలుగు కుటుంబాలు ఈ విధంగా వలస వచ్చినవే. సొంతూళ్లకు వెళ్లాలంటే... వీరు పడే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. బంధువులు చనిపోయినప్పుడు రావాలన్నా ఎంతో కష్టమైయ్యేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... ప్రభుత్వం నేతన్నలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల వారి జీవితాల్లో మార్పులు వచ్చాయి.

కూలీ నుంచి యజమానిగా...

వరంగల్‌ ప్రాంతంలోనే వస్త్రోత్పత్తి పార్కును ప్రారంభించే క్రమంలో... కాకతీయ చేనేత సొసైటీగా ఏర్పడి ప్రభుత్వ సహకారంతో మడికొండలోని పారిశ్రామిక వాడ ప్రాంతంలో 60 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. దీనిని తెలంగాణ రాష్ట్ర మౌళిక వసతులు కల్పన సంస్థ అభివృద్ధి చేసింది. ఈ పార్కులో 345 వస్త్ర యూనిట్లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలతో సొంతంగా వస్త్ర యూనిట్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారులుగా మారుతున్నారు వలస నుంచి తిరుగొచ్చిన నేతన్నలు. ఇప్పటికే సుమారు 17 యూనిట్లు తెరచుకున్నాయి. మరో రెండు మూడు నెలల్లో మిగిలిన యూనిట్లూ తెరుచుకోనున్నాయి. కూలీలుగా బతికిన తమను యజమానులుగు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు చెబుతున్నారు.

ఉపాధి దొరికింది

ఒక్కో యూనిట్లలో 20 మందికి ఉపాధి కూడా దొరుకుతోంది. మొత్తం పార్కు ప్రారంభమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా అయిదు వేల మంది వరకు ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి ఎంతో మంది వరంగల్‌ తిరిగిరాగా... మిగిలిన వాళ్లూ...తిరిగి వచ్చేందుకు సిద్ధమైతున్నారు. ఈ పార్కులో ఉత్పత్తి ప్రారంభమైతే వస్త్రాల దిగుమతికి అహ్మదాబాద్, సూరత్ నగరాలపైన ఆధార పడాల్సిన అవసరం తీరనుంది. కష్టపడేతత్వానికి ప్రభుత్వ సహకారం తోడవడం వల్ల నేతన్నల జీవితాలే మారిపోతున్నాయి.

ఇదీ చూడండి: 'అప్పుడు మీరు చేస్తే ఒప్పు... ఇప్పుడు మేము చేస్తే తప్పా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.