ETV Bharat / state

Rahul Gandhi On Coalition: 'భాజపా చేతిలో తెరాస రిమోట్.. మాకు ఎవరితోనూ పొత్తు వద్దు'

author img

By

Published : May 7, 2022, 5:08 AM IST

Updated : May 7, 2022, 6:42 AM IST

Rahul Gandhi On Coalition: తెలంగాణలో భాజపా రిమోట్‌ కంట్రోల్‌ సర్కార్‌ నడుస్తోందని... కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. రాష్ట్రంలో తెరాస- భాజపాల మధ్య రహస్య ఒప్పందం ఉందన్న రాహుల్‌.... తెలంగాణను దోచుకున్నవారితో కలిసి వెళ్లేది లేదన్నారు. పొత్తుల గురించి ఎవరు మాట్లాడినా పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఓరుగల్లు సభా వేదికగా హెచ్చరికలు పంపారు.

Rahul Gandhi
Rahul Gandhi

'భాజపా చేతిలో తెరాస రిమోట్.. మాకు ఎవరితోనూ పొత్తు వద్దు'

Rahul Gandhi On Coalition: ఎన్నో అనుమానాలు..! మరెన్నో సందేహాలు...! రాష్ట్రంలో త్రిముఖ ఎన్నికల పోరు ఖాయమనుకున్న వేళ పొత్తులపై ఎన్నో సందిగ్ధం..! రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరుతారన్న సమయంలో ఎంతో గందరగోళం నెలకొంది. ఇలాంటి సందిగ్ధతలకు తెరదించుతూ కాంగ్రెస్‌ నేతలు, శ్రేణులకు ఓరుగల్లు రైతు సంఘర్షణ సభావేదికగా పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పూర్తి స్పష్టత నిచ్చారు. తెలంగాణను దోచుకున్న వారితో పొత్తులుండవని తెరాసనుద్దేశించి పరోక్ష విమర్శలు చేసిన రాహుల్‌... గులాబీపార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసివెళ్లేది లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాలు, విధానాలను విమర్శించేవారు ఎంతటివారైనా ఊపేక్షించబోమని స్పష్టమైన హెచ్చరికలు పంపారు.

ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ విషయం కచ్చితంగా గుర్తుంచుకోండి. ఏ వ్యక్తైతే తెలంగాణను మోసం చేశాడో, ఏ వ్యక్తైతే లూటీ చేశాడో, తెలంగాణ ఆకాంక్షలను దెబ్బతీశాడో ఆయనతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు ఉండబోదు. దీని తర్వాత కూడా ఎవరైనా ఇదే ప్రశ్న అడిగితే వారిని కాంగ్రెస్‌ నుంచి బహిష్కరిస్తాం. ఎవరైనా, ఎంతటివారైనా ఊపేక్షించేది లేదు. పొత్తు కోరుకునే కాంగ్రెస్‌ నేతలు.. తెరాస లేదా భాజపాలోకి వెళ్లవచ్చు. మేము రాజుతో పొత్తు పెట్టుకోం. ఇది కాంగ్రెస్-తెరాస మధ్య పోరాటం... ఆ పార్టీని ఎన్నికల్లో ఓడిస్తాం.

-- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

వారి మధ్య దోస్తీ: ఓవైపు తెరాసపై ఘాటు విమర్శలు చేస్తూనే భాజపాపైనా రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెరాస-భాజపా మధ్య దోస్తీ నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ప్రత్యక్షంగా గెలవలేని భాజపా... రిమోట్‌ కంట్రోల్‌లాంటి తెరాస సర్కార్‌ ఉండాలని భావిస్తోందని విమర్శించారు.

పొత్తు ఉందంటే అది తెరాస-భాజపా మధ్యే. నరేంద్రమోదీ మూడు నల్లచట్టాలను పార్లమెంటులో ఆమోదించుకుంటే తెరాస నేతలు ఏం చెప్పారు? తెలంగాణను నేరుగా పాలించలేమని భాజపాకు తెలుసు. అందుకే వారికి రిమోట్‌ కంట్రోల్‌ అవసరం. భాజపాతో కాంగ్రెస్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోబోదని వారికి తెలుసు. అందుకోసమే తెలంగాణలో తెరాస సర్కార్‌ ఉండాలని భావిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎంత దోపిడీ చేసినా ఆయనపై ఈడీ, సీబీఐ ప్రయోగించకపోవడమే ఇందుకు సాక్ష్యం.

-- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

రాచరిక పాలన: తెరాస సర్కార్‌పైనా రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణను ఒక వ్యక్తి, ఒక కుటుంబం కోసం ఏర్పాటు చేయలేదని చెప్పారు. రైతులు, ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించి తెలంగాణ రాష్ట్రం ఇస్తే... ప్రస్తుతం రాచరిక పాలన నడుస్తోందని ఆరోపించారు. 8ఏళ్లైనా ప్రజల ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని మండిపడ్డారు.

తెలంగాణ మొత్తం చూస్తే ఒక్క కుటుంబానికి మాత్రమే ప్రయోజనం కలిగింది. తెలంగాణ ప్రజలకు ఏం లబ్ధి కలిగిందని అడుగుతున్నాను. వితంతువులైన రైతుల భార్యలు ఇక్కడ రోదిస్తున్నారు. ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని భావించాం. ఐతే ఇక్కడ ప్రజల సర్కార్‌ రాలేదు. ఉన్నది ముఖ్యమంత్రి కాదు... రాజు. ముఖ్యమంత్రి ఐతే ప్రజల మాటలు వింటారు. రాజు మాత్రం జనంమాటకు బదులుగా మనస్సులో ఏది అనిపిస్తే అది చేసేస్తారు.

-- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

పనిచేసే వారికే టికెట్లు: వచ్చే ఎన్నికల్లో నేతల పనితీరు ప్రాతిపదికన రైతులు, పేదప్రజల పక్షాన పనిచేసేవారికే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్‌కు ఒక్కసారి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు. రానున్న రోజుల్లో ఆదివాసీల సమస్యల కోసం డిక్లరేషన్‌ ఇస్తామన్న రాహుల్‌... ఈ వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లకు పూర్తి మద్దతు ఉంటుందని తేల్చిచెప్పారు.

ఇదీ చూడండి:

Last Updated :May 7, 2022, 6:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.