ETV Bharat / state

masab cheruvu kabja : మాయమవుతున్న మాసాబ్​ చెరువు.. పట్టించుకోని అధికారులు

author img

By

Published : May 23, 2023, 1:35 PM IST

masab cheruvu kabja in rangareddy : రియల్టర్ల కబంద హస్తాలకింద రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లోని మాసాబ్ చెరువు.. కనుమరుగవుతోంది. దశాబ్ధాలుగా ప్రజలకు సాగు, తాగు నీళ్లు అందించిన ఆ చెరువు నేడు కబ్జాకోరల్లో పడి ఛిద్రం అవుతున్నా, పట్టించుకున్న దిక్కేలేకుండా పోతోంది. కబ్జాకోరులు చెరువును రెండుగా చీల్చి.. మధ్యలో రోడ్డు వేస్తున్నా సర్కారు యంత్రాంగం మొద్దు నిద్ర వీడటం లేదు.

Etv Bharat
Etv Bharat

కబ్జాకోరల్లో మాసాబ్​ చెరువు... అధికారులు స్పందించేనాా....?

masab cheruvu kabja in rangareddy : రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లోని మాసాబ్‌ చెరువు ఇది. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం, రియల్టర్ల భూదాహంతో... ఐదు వందల ఎకరాల్లో విస్తరించిన చెరువు కరిగిపోతోంది. ఇప్పటికే దాదాపు వంద ఎకరాలు కబ్జాకు గురైందని చెబుతున్న సంబంధిత అధికారులు.. మిగిలి ఉన్న చెరువును కాపాడటంలోనూ విఫలం అవుతున్నారని స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. సాగర్ హైవేకు ఆనుకొని నిండుకుండలా ఉన్న చెరువును... అక్రమార్కులు చెరువును రెండు భాగాలుగా విభజించారు. రాత్రికి రాత్రే వందల లారీల మట్టితో నింపి... చెరువు మధ్యలో రోడ్డు వేశారు. నలువైపుల నుంచి... మట్టితో పెద్ద పెద్ద బండారళ్ళతో పూడ్చి వేశారు

masab cheruvu kabja in turkayamjal : మాసాబ్‌ చెరువులో కబ్జాపై.. స్థానికులు పోరాడుతున్నారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కొందరు కౌన్సిలర్స్‌, ప్రకృతి ప్రేమికులు కలిసి.. అఖిలపక్షంగా ఏర్పడ్డారు. చెరువు కబ్జా కాకుండా ప్రతి రోజూ కాపలాగా ఉంటున్నారు. ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసుకుని సేవ్ మాసాబ్ చెరువు పేరుతో ఉద్యమిస్తున్నారు. జాయింట్ కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను కలిసి ఫిర్యాదు చేశారు. కోర్టు కేసు సాకు చూపిస్తున్న అధికారులు... అందిన కాడికి దండుకుంటన్నారని అఖిలపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

'కలెక్టర్​ను, జాయింట్​ కలెక్టర్​ను, స్థానిక ఎమ్మెల్యేను, ఎంపీను అందరిని కలిశాం. కానీ అందరు చెప్పే విషయం ఏంటంటే.. ఈ సమస్య కోర్టు పరిధిలో ఉందని. దీంట్లో ఎవ్వరు అడుగు పెట్టకూడదు అని. చిన్న కోర్టు ఆర్డర్​ను చూపించి తప్పించుకుంటున్నారు. అదే కోర్టు ఆర్డర్​లో కాలమ్​ నంబర్​ 4లో ఈ చెరువులో ఎలాంటి డంపింగ్​ లాంటివి చేయకూడదు అని కూడా ఉంది. చెరువులో పెద్దపెద్ద రాళ్లు తీసుకొచ్చి వేశారు. ఇప్పుడు చెరువు రెండు భాగాలుగా అయ్యింది. ఇలా అవుతుంటే కూడా ఇరిగేషన్​ వాళ్లు, రెవెన్యూ వారు , మున్సిపల్​ వారు ఏం చేస్తున్నారు.' - అఖిలపక్ష నాయకులు.

మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి.. మాసాబ్‌ చెరువు వద్ద కబ్జాలను పరిశీలించి... చెరువు పరిరక్షణ సమితికి సంఘీభావం ప్రకటించారు. 15రోజులుగా ఆందోళన చేస్తుంటే.. అధికారులు కన్నెత్తి చూడకపోవడం ఏంటని... చెరువు పరిరక్షణ సమితి ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కబ్జాదారుల నుంచి... మాసాబ్ చెరువును కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కబ్జాలకు సంబంధించి... అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం నీటిపారుదలశాఖ ఏఈఈ గంగ... తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనంతరం విచారణ చేపట్టిన అధికారులు.. సంబంధిత పనులతో ప్రమేయం ఉన్న పది మందిపై మీర్‌పేట్‌ ఠాణాలో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని.. అధికారులు తెలిపారు.

'కేసు ఫైల్​ చేశాం, కలెక్టర్​కు మేము డిటైల్​గా రిపోర్ట్ ఇచ్చాము. హెచ్​ఎండీఏకి కూడా లెటర్​ ఇచ్చాము. చెరువు ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎంత వరకి ఆక్రమణ జరిగింది అనే అంశాలపైన లెటర్​ ఇచ్చాము '. - గంగ, ఏఈఈ నీటిపారుదలశాఖ

ప్రధాన రహదారి పక్కనే ఉన్న మాసాబ్‌ చెరువు... సుందరీకరణ పనులను కొన్ని నెలల కిందట... మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ట్యాంక్‌ బండ్‌ తరహాలో... సేదతీరే ప్రాంతంగా రూపాంతరం చెందుతుందని భావిస్తున్న పరిస్థితుల్లో... కబ్జారాయుళ్లు బరితెగించటం.. సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.