ETV Bharat / state

Ex Journalist Murder: 'ప్రత్యర్థితో సన్నిహితంగా ఉండటం జీర్ణించుకోలేకే హత్య'

author img

By

Published : Apr 17, 2023, 11:47 AM IST

Updated : Apr 17, 2023, 10:26 PM IST

karunakar
karunakar

Ex journalist Karunakar Reddy murder case: తన అనుచరుడు.. ప్రత్యర్థితో సన్నిహితంగా ఉండటం జీర్ణించుకోలేకపోయాడు. తన గురించి అంతా తెలిసిన వ్యక్తి.. అవతలి వ్యక్తులతో కలిసి ఉండటం ఎప్పటికైనా ఇబ్బంది అనుకున్నాడు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోయి పక్కా పథకం ప్రకారం తన అనుచరులతో కిడ్నాప్‌ చేయించి హత్య చేయించాడు. రంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారిన మాజీ జర్నలిస్టు కరుణాకర్ రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు.

Ex journalist Karunakar Reddy murder case: రంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారిన మాజీ జర్నలిస్టు కరుణాకర్ రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆయన హత్యకు కొత్తూరు ఎంపీపీ పిన్నింటి మధుసూదన్‌రెడ్డి ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం మల్లాపూర్‌కు చెందిన మామిడి కరుణాకర్‌రెడ్డి, పిన్నింటి మధుసూదన్‌రెడ్డి దూరపు బంధువులు. కరుణాకర్‌ చిన్న తనంలోనే అతని తండ్రి మోహన్‌రెడ్డి మరణించాడు. అతను తల్లితో కలిసి ఉంటున్నాడు. సోదరుడు రాఘవేందర్‌ అమెరికాలో చదువుతున్నాడు.

ప్రత్యర్థితో చనువుగా ఉండటం చూసి..: మధుసూధన్‌రెడ్డి ప్రస్తుతం కొత్తూరు ఎంపీపీగా.. ఆయన భార్య హరిత మల్లాపూర్‌ ఉప సర్పంచ్​గా కొనసాగుతున్నారు. మధుసూధన్ రెడ్డి గతంలో ఉప సర్పంచ్​గా ఉన్నప్పటి నుంచే కరుణాకర్‌రెడ్డి ఆయనకు ప్రధాన అనుచరుడు. రెండేళ్ల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కరుణాకర్‌రెడ్డి ఎంపీపీకి దూరంగా ఉంటున్నాడు. మల్లాపూర్‌ గ్రామ సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచి హరిత మధ్య పంచాయతీ అభివృద్ధి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఇదే సమయంలో కొద్ది రోజులుగా సర్పంచ్‌ సాయిలుతో కరుణాకర్‌రెడ్డి సన్నిహితంగా ఉండటం గమనించిన మధుసూధన్‌ రెడ్డి ప్రతీకారంతో రగిలిపోయాడు.

గతంలో తమ్ముళ్లతో కలిసి దాడి: గ్రామంలో భూ సంబంధిత వ్యవహారాల్లో సర్పంచ్​కు కరుణాకర్‌రెడ్డి సహకరిస్తున్నాడని.. తన లోగుట్టు తెలిసిన వ్యక్తి అతనితో ఎలా చేతులు కలుపుతాడని కక్ష పెంచుకున్నట్లు సమాచారం. గతేడాది దసరా పండుగ రోజున ఎంపీపీ తమ్ముళ్లు విక్రమ్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి కరుణాకర్‌ ఇంట్లోకి చొరబడి కరుణాకర్ రెడ్డి, ఆయన తల్లి స్వరూపపై దాడి చేశారు. ఈ వ్యవహారంలో ఇరువర్గాలూ పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. రెండు నెలల క్రితం కరుణాకర్‌రెడ్డిపై నకిలీ ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు పెట్టించేందుకు యత్నించినా ఫలించలేదు.

మధుసూధన్‌రెడ్డి నుంచి తన కుమారుడికి ప్రాణహాని ఉందని తెలుసుకున్న తల్లి స్వరూప.. నిత్యం కరుణాకర్‌రెడ్డి వెంటే ఉంటోంది. కరుణాకర్‌ రెడ్డి నాలుగు నెలల క్రితం వరకూ ఓ పత్రికలో విలేకరిగా పని చేశాడు. ప్రస్తుతం కొత్తూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద డాక్యుమెంట్‌ రైటర్‌గా పని చేస్తున్నాడు. పాత కక్షలతో ప్రతీకారం పెంచుకున్న ఎంపీపీ మధుసూధన్‌ రెడ్డి.. కరుణాకర్‌ను హత మార్చేందుకు అవకాశం కోసం ఎదురు చూశాడు. ఇదే క్రమంలో ఆదివారం సాయంత్రం దాన్ని అమలు చేశాడు. సాయంత్రం 5 గంటలకు కరుణాకర్‌రెడ్డి తనకు పరిచయస్థులైన చిట్టెడి శ్రీధర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డితో మామిడిపల్లి గ్రామానికి వెళ్లారు.

పక్కా పథకం ప్రకారం హత్య: రాంచంద్రారెడ్డిని దింపి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న మధుసూధన్‌రెడ్డి తన సోదరులు, అనుచరుల్ని రంగంలోకి దింపాడు. శ్రీధర్‌రెడ్డి, కరుణాకర్‌ సాయంత్రం 6 గంటలకు తీగాపూరు శివారులోని వంతెన దగ్గరికి వచ్చారు. అప్పటికే మాటువేసిన ఎంపీపీ సోదరులు విక్రమ్, విష్ణువర్దన్, డ్రైవర్‌ ఆరిఫ్, బంధువు అరుణ్‌కుమార్‌రెడ్డి నెంబరు ప్లేటు లేని స్కార్పియో కారుతో కరుణాకర్‌ వాహనాన్ని అడ్డగించారు. శ్రీధర్‌రెడ్డిపై దాడి చేసి కరుణాకర్‌ను తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు.

శ్రీధర్‌రెడ్డి ఫోన్‌ను ధ్వంసం చేశారు. కొద్దిసేపటి తర్వాత దాన్ని సరిచేసి శ్రీధర్‌రెడ్డి ముందు కుటుంబ సభ్యులు, పోలీసులకు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టినా కరుణాకర్‌ ఆచూకీ దొరకలేదు. తమ వాహనంలో కరుణాకర్‌ను ఎక్కించుకున్న దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. తల, కణతి భాగంలో పిడిగిద్దులు కురిపించడంతో కరుణాకర్‌ స్పృహ కోల్పోయాడు. దీంతో భయపడిపోయిన నిందితులు.. కారును నేరుగా గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

దాడి చేసి ఆసుపత్రిలో చేర్పించి..: కరుణాకర్‌ను ఆసుపత్రిలో చేర్పించి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని.. చికిత్స కోసం తీసుకొచ్చామని వైద్యులను నమ్మించే ప్రయత్నం చేశారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించడంతో ఇప్పుడే వస్తామంటూ అక్కడి నుంచి జారుకున్నారు. ఆసుపత్రి వర్గాలు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చాయి. సమాచారం అందుకున్న కొత్తూరు పోలీసులు కరుణాకర్‌గా గుర్తించారు.

పోలీసుల సూచనతో మధుసుధన్‌రెడ్డితో రాజీ అయ్యేందుకు తాము వెళ్లామని.. క్షమాపణలు చెప్పి కాళ్లావేళ్లాపడ్డా తన బిడ్డను చంపేశారని కరుణాకర్‌ తల్లి స్వరూప కన్నీంటి పర్యంతమయ్యారు. రాజీతో క్షమిస్తున్నట్లు నటించిన ఎంపీపీ.. దారుణంగా హతమార్చాడని ఆరోపించారు. ఎంపీపీ హత మారుస్తాడని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Apr 17, 2023, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.