ETV Bharat / state

ఇసుకాసురులు: 'దుందుభీ'లో అక్రమార్కులదే ఇష్టారాజ్యం!

author img

By

Published : Feb 5, 2021, 12:29 PM IST

నాగర్ కర్నూల్ జిల్లాలో దుందుభీ వాగు నిలువు దోపిడికీ గురవుతోంది. అనుమతుల పేరిట అక్రమార్కులు ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు వందలాది జనాలతో దుందుభీవాగులో పరిసరాలు చిన్నపాటి జాతరను తలపిస్తున్నాయి. నిఘా పెట్టాల్సిన అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరించడం వల్ల ఇసుక అక్రమ రవాణా యధేచ్ఛగా జరుగుతోంది.

ఇసుక అక్రమాలకు అడ్డాగా... దుందుభీ వాగు
ఇసుక అక్రమాలకు అడ్డాగా... దుందుభీ వాగు

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లికి సమీపంలోని దుందుభీ వాగు దోపిడికీ గురవుతోంది. వాగులోని ఇసుకను అనుమతుల పేరిట అక్రమార్కులు తోడేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్రాకర్లు వాగులో ఇసుకను తోడుకుని వెళ్తున్నాయి. అక్కడి వాతావరణం ట్రాక్టర్లు.. జనాలతో చిన్నపాటి జాతరను తలపిస్తోంది.

అక్రమ జాతర..
అక్రమ జాతర..

అభివృద్ధి పథకాలకు అనుమతిస్తే..

జిల్లాలో చేపట్టే వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కోసం దుందుభీ వాగులో ఇసుకను తవ్వుకునేందుకు గతంలో అధికారులు అనుమతులిచ్చారు. సందట్లో సడేమియా అన్నట్లు అనుమతులు లేని వాహనాలు.. ఇసుకను తరలిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. డంపుల కొద్దీ ఇసుకను నిత్యం తరలించుకు వెళ్తున్నాయని అంటున్నారు.

దొరికినంత దోచుకుంటున్నారు
దొరికినంత దోచుకుంటున్నారు

వ్యవసాయానికి కూలీలే లేరాయే..!

ప్రస్తుతం డిండి చింతపల్లిలో వ్యవసాయ పనులు చేద్దామంటే కూలీలు దొరకడం లేదంటే ఇసుక వ్యాపారం ఎంత ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ట్రాక్టర్ ఇసుకను నింపితే ఆ కూలీల బృందానికి 800 రూపాయలు చెల్లిస్తారు. అలా ఒక్కో బృందం రోజుకు 10 ట్రాక్టర్ల వరకూ నింపుతోంది. ఒక్కో కూలీ రోజుకు వెయ్యు రూపాయల వరకూ సంపాదిస్తున్నారు. అలాంటి బృందాలు సైతం అక్కడ 20కి పైగానే ఉన్నాయి. ఇసుకను బహిరంగ మార్కెట్ లో అక్రమార్కులు మూడు నుంచి 5వేల విక్రయిస్తున్నారు.

గట్టుదాటాలంటే.. తప్పదుమరి..!
గట్టుదాటాలంటే.. తప్పదుమరి..!

అక్రమార్కులకు కాసుల వర్షం

అనుమతులు లేకుండా ఇసుక తరలివెళ్లొద్దనే ఉద్దేశంతో స్థానిక వీఆర్ఏలు, పోలీసుల్ని సైతం అక్కడ నిఘా కోసం ఉంచారు. కానీ వాహనాలు పట్టుబడగానే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల నుంచి వాహనాలను వదిలేయాలంటూ ఒత్తిళ్లు రావడం వల్ల చేసేదేమీ లేక.. వదిలేస్తున్నారు. అందులోనూ సిబ్బంది, పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే డిండి చింతలపల్లిలో ఇసుక వ్యాపారం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోందన్న ప్రచారం సాగుతోంది.

ఎత్తుకెళ్లిపోతున్నారు
ఎత్తుకెళ్లిపోతున్నారు

అధికారులేమంటున్నారు

వాగులో ఇసుక దోపిడీపై నిఘా పెంచుతాం. ఎస్సై స్థాయి అధికారులను నియమించి అనుమతులు లేని వాహనాలకు అడ్డుకట్ట వేస్తాం. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. -రాజు నాయక్, వంగూరు తహసీల్దారు.

ఇదీ చూడండి: సినీఫక్కీలో చోరీ... తాళ్లతో కట్టేసి ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.