ETV Bharat / bharat

పిల్లల​ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం- ఏడుగురు నవజాత శిశువులు మృతి, మరో ఐదుగురు సీరియస్​ - fire accident at delhi

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 7:14 AM IST

Updated : May 26, 2024, 9:21 AM IST

Fire At New Baby Care Centre In Delhi : దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వివేక్​ విహార్​లోని బేబీ కేర్​ ఆస్పత్రిలో శనివారం రాత్రి జరిగిన ఘటనలో ఏడుగురు నవజాత శిశువులు మరణించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఉత్తర్​ప్రదేశ్​లో ట్రక్కు, బస్సు ఢీకొని 11 మంది మృతి చెందారు.

Fire At New Baby Care Centre
Fire At New Baby Care Centre (ETV Bharat)

Fire At New Baby Care Centre In Delhi : దిల్లీ వివేక్​ విహార్​లోని​ బేబీ కేర్​ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఏడుగురు నవజాత శిశువులు మరణించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

బేబీ కేర్​ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగినట్లు రాత్రి 11:30గంటలకు ఫైర్ సర్వీస్ కంట్రోల్ రూమ్​కు ఫోన్ వచ్చిందని అధికారి రాజేశ్ తెలిపారు. 'వెంటనే 16 అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకున్నాం. దాదాపు గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాం. ఆస్పత్రితో పాటు పక్కనే ఉన్న మరో భవనం ధ్వంసమైంది. 12 మందిని రక్షించి వారిని ఆస్పత్రికి తరలించాం. పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి' అని రాజేశ్ తెలిపారు.

'ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్లే'
అయితే, ఆస్పత్రిలో ఉన్న ఆక్సిజన్​ సిలిండర్​ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భగత్ సింగ్ సేవాదళ్ అధ్యక్షుడు జితేంద్ర సింగ్ శాంతి అనుమానం వ్యక్తం చేశారు. 'ఆస్పత్రి వెలుపల ఉన్న అంబులెన్స్​లోని సిలిండర్​లో ఆక్సిజన్​ నింపే పని జరుగుతుంది. ఆక్సిజన్ రీఫిల్లింగ్ సమయంలో సిలిండర్ పేలింది. మూడు సిలిండర్లు ఒకదాని తర్వాత మరోకటి పేలాయి. ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న భవనంలోకి కూడా వ్యాపించాయి' అని శాంతి చెప్పారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని
ఈ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాని నరేంద్ర మోదీ, దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిన్నారులు చనిపోవటం మనసును కలిచివేసిందని తెలిపారు. చికిత్స పొందుతున్న చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని విడిచి పెట్టబోమని దిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు.

నివాస భవనంలో మంటలు - ముగ్గురు మృతి
దిల్లీలోని షహదారా ప్రాంతంలో మరో అగ్నిప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి ఓ నివాస భవనంలో మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ముందుగా ఏడుగురిని రక్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మంటలు చెలరేగడానికి గల కారణం తెలియాల్సి ఉంది.

బస్సు, ట్రక్కు ఢీ - 11 మంది మృతి
Road Accident In Uttar Pradesh : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాజహన్‌పూర్‌ జిల్లాలో ఖుతర్ వద్ద ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందగా, మరో 10 మందికి గాయలు అయ్యాయి. పూర్ణగిరికి భక్తులతో వెళుతున్న ఓ బస్సు భోజనం చేసేందుకు దాబా దగ్గర ఆగిందని పోలీసులు తెలిపారు. కొంతమంది భక్తలు బస్సులో కూర్చొని భోజనం చేస్తున్నారని తెలిపారు. ఆ సమయంలో ఓ ట్రక్కు అదుపుతప్పి బస్సును వెనుకు నుంచి ఢీకొన్నట్లు వెల్లడించారు. గాయపడిన వారిన ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

గేమ్​జోన్​ అగ్నిప్రమాదంలో 27మంది మృతి- పైకప్పు కూలి లోపలే చిక్కుకుని మరణం!! - Game Zone Fire Accident

POK స్వాధీనం చేసుకుంటాం- అణుబాంబులకు అస్సలు భయపడం!: అమిత్ షా - POK Issue

Last Updated : May 26, 2024, 9:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.