ETV Bharat / bharat

గేమ్​జోన్​ అగ్నిప్రమాదంలో 28మంది మృతి- పైకప్పు కూలి లోపలే చిక్కుకుని మరణం!! - Game Zone Fire Accident

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 6:49 AM IST

Game Zone Fire Accident In Rajkot : వేసవి సెలవులు అందులోనూ వారాంతం. సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు అనూహ్యంగా పెను ప్రమాదంలో చిక్కుకుపోయారు. గేమ్‌జోన్‌లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టాయి. తప్పించుకునే ప్రయత్నం చేసే లోపే పైకప్పు కూలిపోవడం వల్ల వెలుపలికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘోర ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నగరంలో జరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం తొమ్మిది చిన్నారులు సహా 28 మంది దుర్మరణం పాలయ్యారు.

Game Zone Fire Accident In Rajkot
Game Zone Fire Accident In Rajkot (ANI)

Game Zone Fire Accident In Rajkot : గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో తొమ్మిది చిన్నారులు సహా మొత్తం 28 మంది దుర్మరణం పాలయ్యారు. శనివారం స్థానిక టీఆర్‌పీ గేమ్‌ జోన్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా అక్కడి ఉన్నవారిని వారిని చుట్టుముట్టాయి. తప్పించుకునే ప్రయత్నం చేసే లోపే పైకప్పు కూలిపోవడం వల్ల వెలుపలికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 28 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. ఇందులో తొమ్మిదిమంది చిన్నారులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకొని నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృత దేహాలను సహాయ సిబ్బంది వెలికి తీశారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తీవ్రంగా కాలిపోవడం వల్ల మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్న పిల్లలతో పాటు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులూ ఉన్నారు.

క్షతగాత్రులను పరామర్శించిన గుజరాత్ సీఎం
సీఎం భూపేంద్రభాయ్ పటేల్, హోంశాఖ మంత్రి హర్ష సంఘవి కలిసి ఘటనాస్థలానికి వెళ్లారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

దర్యాప్తు కోసం సిట్​
ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని సహాయక పనులను పర్యవేక్షిస్తున్న రాజ్‌కోట్‌ కలెక్టర్‌ ప్రభాస్‌ జోషి తెలిపారు. భారీ మంటలు ఎగసినందు వల్లే టీఆర్‌పీ గేమ్‌జోన్‌ కప్పుగా ఉన్న ఫైబర్‌ డోమ్‌ కుప్పకూలిందని వెల్లడించారు. ఆ సమయంలో చిన్నారులతో పాటు పలువురు వ్యక్తులు వివిధ ఆటల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. టీఆర్‌పీ గేమ్‌ జోన్‌ యువరాజ్‌ సింగ్‌ సోలంకి అనే వ్యక్తిపేరు మీద ఉందని రాజ్‌కోట్‌ పోలీస్‌ కమిషనర్‌ రాజు భార్గవ్‌ తెలిపారు. శిథిలాల తొలగింపు చురుగ్గా జరుగుతోందన్నారు. నగరంలోని ఇతర గేమ్‌జోన్‌లను మూసివేయాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిపారు. దర్యాప్తు కోసం గుజరాత్‌ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని సిట్‌ను ఏర్పాటు చేసింది. గేమ్‌జోన్‌ యజమాని యువరాజ్‌ సింగ్‌ సోలంకి, మేనేజర్‌ నితిన్‌జైన్‌ సహా ముగ్గురిని అరెస్టు చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం
రాజ్‌కోట్‌ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. చిన్నారులు సహా పలువురి ప్రాణాలను కబళించిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్‌ పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి సహాయ చర్యల గురించి ఆరా తీశారు. తన ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల గురించేనని ప్రధాని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు గుజరాత్‌ సీఎం భూపేంద్రభాయ్‌ పటేల్‌ ప్రకటించారు. గాయపడిన ఒక్కొకరికి 50వేలు అందిస్తామన్నారు.

దేశంలో ప్రశాంతంగా ఆరో విడత పోలింగ్- ఓటింగ్​ శాతం ఎంతంటే? - lok sabha election 2024

POK స్వాధీనం చేసుకుంటాం- అణుబాంబులకు అస్సలు భయపడం!: అమిత్ షా - POK Issue

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.