ETV Bharat / bharat

దేశంలో ప్రశాంతంగా ఆరో విడత పోలింగ్- ఓటింగ్​ శాతం ఎంతంటే? - lok sabha election 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 6:03 PM IST

Updated : May 25, 2024, 6:52 PM IST

Lok Sabha Election Phase 6 Polling : సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 889 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

Lok Sabha Election Phase 6 Polling :
Lok Sabha Election Phase 6 Polling (Associated Press)

Lok Sabha Election Phase 6 Polling : దేశంలో సార్వత్రిక ఎన్నికలో భాగంగా ఆరో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 889 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు 57.70 శాతం పోలింగ్‌ నమోదైంది. బంగాల్‌లో అధికంగా 77.99 శాతం ఓటింగ్ నమోదు కాగా, జమ్ముకశ్మీర్‌ 51.35 శాతం పోలింగ్ నమోదైంది.

మరోవైపు, ఆరో విడతలో భాగంగా దేశ రాజధాని దిల్లీలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయలోని పోలింగ్ కేంద్రంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఓటు వేశారు. ప్రతీ ఓటరూ తమ బాధ్యతను నెరవేర్చాలని ఆమె పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ఆయన సతీమణి సుదేశ్‌ నార్త్ ఎవెన్యూ ప్రాంతంలోని CPWD సర్వీసు పోలింగ్‌ కేంద్రంలో క్యూలో నిలబడి ఓటు వేశారు. విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. APJ అబ్దుల్ కాలం లేన్‌లోని అటల్ ఆదర్శ విద్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తొలిపురుషుడు ఆయనే కావడంతో అధికారులు జైశంకర్‌కు ధ్రువపత్రం ఇచ్చారు.

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ హస్తినలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ దిల్లీలోని నిర్మన్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఓటు వేశారు. దిల్లీలోని లోధి రోడ్‌లోని పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమార్తె మిరయా, కుమారుడు రేహాన్‌ వాద్రా లైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా చాందినీ చౌక్‌లోని సివిల్ లైన్స్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. తూర్పు దిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బన్సూరీ స్వరాజ్, ఆమె తండ్రి కౌశల్‌ స్వరాజ్‌, కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ దంపతులు హస్తినలో ఓటు వేశారు. దిల్లీ మంత్రులు సౌరభ్‌ భరద్వాజ్‌, ఆతిశీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్​ జనరల్ అనిల్ చౌహాన్, ఆయన భార్య దిల్లీలో ఓటు వేశారు. క్రికెటర్ కపిల్ దేవ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ దిల్లీలో ఓటు వేశారు.

హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ కుటుంబ సమేతంగా అంబాలాలోని మిర్జాపుర్ మార్జాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మాజీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్ కర్నాల్‌లోని ప్రేమ్‌నగర్‌ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ కుటుంబం కురుక్షేత్రలో ఓటుహక్కు వినియోగించుకుంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భువనేశ్వర్‌లో ఆయన నివాసం సమీపంలోని ఏరోడ్రోమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ రాంచీలో ఓటు వేశారు. భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రాంచీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం పోలింగ్ కేంద్రానికి వద్దకు తరలిరాగా పోలీసులు కట్టడి చేశారు.

Last Updated : May 25, 2024, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.