ETV Bharat / state

Huzurabad by election: రంగంలోకి సీఎం కేసీఆర్​.. రెండు రోజుల పాటు రోడ్​షోలు..!

author img

By

Published : Oct 22, 2021, 4:47 AM IST

cm-kcr-road-shows-for-todays-in-huzurabad
cm-kcr-road-shows-for-todays-in-huzurabad

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా రెండు రోజులపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోడ్‌షోలు నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. ఎన్నికల సంఘం నిబంధనల నేపథ్యంలో బహిరంగ సభకు ప్రత్యామ్నాయంపై నేతలు దృష్టి సారించారు. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై షెడ్యూలు రూపకల్పన చేసి నేడు సీఎంకు పంపనున్నట్లు తెలుస్తోంది.

హుజూరాబాద్​ ఉపఎన్నిక ప్రచారంపై అధికార తెరాస మరింత పదును పెట్టనుంది. ఇప్పటికే నియోజకవర్గంలో హోరహోరి ప్రచారం జరుగుతుండగా.. ముఖ్యనేతలంతా అక్కడే మకాం పెట్టారు. మరోవైపు మూడు ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా బరిలో దిగగా.. ఎలాంటి అవకాశాన్ని వదులుకోకుండా నియోజకవర్గ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముందు నుంచే.. ఆ పనిలో నిమగ్నమైన తెరాస.. ఈసారి పదునైన అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. ట్రబుల్​ షూటర్​ హరీశ్​రావు ముందు నుంచే.. విజయానికి క్షేత్రస్థాయిలో తీవ్ర కృషి చేస్తోంటే.. ఇక చివరగా గులాబీబాస్​ రంగంలోకి దిగనున్నారు.

రెండు రోజులపాటు రోడ్​షోలు..

ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి పొరుగున ఉన్న జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహించరాదనే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల నేపథ్యంలో తెరాస అధిష్ఠానం వ్యూహం మార్చింది. ఉప ఎన్నిక జరిగే హుజూరాబాద్‌కు పొరుగున ఉన్న హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభ విషయంలో పునరాలోచిస్తున్నట్లు తెలిసింది. సభ సాధ్యం కాని పక్షంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే రెండు రోజుల పాటు రోడ్‌షోలు నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై నేడు స్పష్టత వచ్చే వీలుంది.

ఈసీ ఆదేశాలతో మారిన వ్యూహం..

ఈ నెల 30న పోలింగ్‌ జరగనుండగా సీఎం కేసీఆర్‌ 26 లేదా 27న సభ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక జరిగే పొరుగు జిల్లాల్లో సభలు, సమావేశాలు పెట్టకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం గురువారం తన నివాసంలో మంత్రులు, ఇతర నేతలతో సమావేశమయ్యారు.

26, 27 తేదీలకు సీఎం ఓకే..

హుజూరాబాద్‌లోని మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సభపై ఆంక్షలున్నందున దానికి ప్రత్యామ్నాయంగా ఎన్నికల నిబంధనలు అనుసరించి నియోజకవర్గంలోనే రోడ్‌షోలు నిర్వహించాలనే అంశం చర్చకు వచ్చింది. ఈ నెల 26, 27 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించాలని మంత్రులు కోరగా... సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

రోడ్​షోలకు షెడ్యూల్​..

రోడ్‌షోలకు సంబంధించిన షెడ్యూలును రూపొందించి పంపాలని కేసీఆర్‌ స్థానిక మంత్రులు, నేతలకు సూచించారు. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ నేతలతో సమావేశమై షెడ్యూలుకు రూపకల్పన చేసి.. నేడు సీఎంకు పంపనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.