ETV Bharat / state

సర్కారు చెప్పినట్టు విన్నా.. జొన్న రైతులకు తప్పని పడిగాపులు..

author img

By

Published : Jun 20, 2022, 4:15 AM IST

అధికారులు వరి వద్దని కరాఖండీగా చెప్పారు. వేసినా కొనుగోలు చేయమన్నారు. ఆందోళన చెందిన రైతులు ప్రత్యామ్నాయ పంటగా జొన్న సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చినా.. కొనుగోళ్లు చేపట్టక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వర్షాలు కురుస్తుండగా.. రోడ్డుపై పోసిన జొన్నలను ఏం చేయాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మాట విని ఆరుతడి పంట వేస్తే.. ఇప్పుడు కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Sorghum farmers problems in kamareddy
Sorghum farmers problems in kamareddy

కామారెడ్డి జిల్లాలో పంట చేతికొచ్చి మూడు నెలలు గడిచినా జొన్న రైతులు అమ్ముకోలేకపోతున్న దీనస్థితి నెలకొంది. జిల్లాలో వ్యవసాయాధికారుల నివేదిక ప్రకారం 16 వేల 571 మంది రైతులు... లక్షా 24 వేల 204 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. 5 లక్షల 56 వేల 698 క్వింటాళ్ళు దిగుబడి ఉంటుందని అంచనా వేశారు. ఒక ఎకరానికి పెట్టుబడి ఖర్చులకు 20వేల రూపాయల వరకు రైతులు వెచ్చించారు. ఒక ఎకరానికి 22-25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కేంద్రం ఎమ్మెస్పీ ప్రకారం క్వింటాకు 2970గా ధర ఉంది. ఈ పంట కొనుగోళ్లు పూర్తయితే తప్ప రైతులు వానాకాలం పంటలు వేసుకునేందుకు.. పెట్టుబడి పైసలు లేని దుస్థితిలో ఉన్నారు. యాసంగిలో వరి సాగు చేయొద్దని.. వరి వేస్తే ఉరేనని గ్రామాల్లో వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటిఇంటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ధాన్యం ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయమని తెగేసి చెప్పారు. వీరి మాట విని జొన్న పంటను సాగు చేసిన రైతులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం చెప్పినా వినకుండా వరి పండించిన రైతుల ధాన్యం కొనుగోలు చేసి.. సొమ్ము వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రభుత్వం, అధికారుల మాట విని ఆరుతడి పంట సాగు చేస్తే ఆ రైతులను మాత్రం సర్కారు పట్టించుకోకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

3 నెలల కిందట జొన్న పంట చేతికొచ్చింది. గ్రామాల సమీపంలో కుప్పలుగా పంటను పోశారు. పిట్లం మండలం రాంపూర్‌లో వంద మందికి పైగా రైతులు ఏకంగా 200ఎకరాలకు పైగా జొన్న పంట సాగు చేశారు. పంట చేతికొచ్చినా కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో పంట తడిచిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుప్పలపై సంచులను కప్పినా వర్షానికి.. తడిసి మొలకలు వస్తున్నాయని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పిట్లం, రాజంపేట మండలాల్లో ఈనెల 13న రైతులు రాస్తారోకో చేశారు. జొన్న కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అయినా ఎవరూ స్పందించలేదని నిరుత్సాహం చెందుతున్నారు. ఇప్పటికైనా కొనకపోతే తీవ్ర ఆందోళన చేపడుతామని అంటున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. జొన్నలు కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వానాకాలం పంటలు వేసుకునేందుకు జొన్నల అమ్మకం అడ్డంకిగా మారిందని.. పంట అమ్మితేనే పెట్టుబడికి డబ్బులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.