ETV Bharat / state

Young Farmer Doing Fish Farming : చేపల పెంపకంతో రూ.లక్షల్లో ఆదాయం గడిస్తున్న యువ రైతు

author img

By

Published : May 21, 2023, 2:23 PM IST

Young Farmer Doing Fish Farming
Young Farmer Doing Fish Farming

Young Farmer Doing Fish Farming : కష్టపడి పని చేయాలనుకునే వారికి మార్గాలెన్నో ఉంటాయి. ఏదైనా పనిని ఇష్టంతో చేస్తే.. అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఓ యువ రైతు కూడా ఇలాగే ఆలోచించారు. అందరిలా తనకున్న పొలంలో పత్తి, మిరప, కంది, మినుము, మొక్కజొన్న లాంటివి పండించకుండా.. చేపల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. పెంపకానికి కావాల్సిన చేప పిల్లలు, వాటికి వేసే ఆహారం, మందులు వంటి అంశాలపై అధ్యయనం చేసి చేపల పెంపకం మొదలుపెట్టాడు. వాటితో ఎకరానికి రూ.4 నుంచి రూ.5 లక్షల ఆదాయం ఆర్జించవచ్చని చెబుతున్నాడీ యువ రైతు. అదెలాగో చూద్దామా..!

చేపల పెంపకంతో అధిక దిగుబడి తీస్తున్న యువరైతు

Young Farmer Doing Fish Farming : ఓ యువ రైతు చేపల పెంపకంతో వాణిజ్య పంటల కంటే.. మిన్నగా ఆదాయం వస్తుందని అంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగిర్తిపేట గ్రామానికి చెందిన మునిగాల రాజు అనే యువ రైతు.. ఎకరం భూమిలో ఏడాదికి రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం వస్తుందని వివరిస్తున్నారు. గ్రామంలో ఆయనకు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మిగతా రైతుల కంటే భిన్నంగా కొత్త పంటను సాగు చేయాలన్న ఆలోచనతో కొర్ర మీను(బొమ్మె) చేపల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరుకు వెళ్లి చేపల పెంపకానికి కావాల్సిన చేప పిల్లలు, వాటికి వేసే ఆహారం, మందులు వంటి అంశాలపై పూర్తిగా అధ్యయనం చేశారు. గతేడాది ఒకటిన్నర ఎకరం భూమిలో 20 గుంటల చొప్పున మూడు మడులు తయారు చేశారు. ఏపీలో రూ.12 చొప్పున సుమారు రూ.16 వేల చేప పిల్లలను కొనుగోలు చేసి రెండు మడుల్లో వాటిని పెంచారు. సుమారు రూ.12 లక్షలు పెట్టుబడి రూపంలో ఖర్చు చేశారు. సుమారు 30 క్వింటాళ్ల చేపలు చేతికి వచ్చాయి. మార్కెట్లో రూ.250 నుంచి రూ.350 వరకు విక్రయించగా ఆదాయం రూ.9 లక్షలు వచ్చింది.

చేపల పెంపకం చేస్తున్న యువ రైతు: మొదటి ఏడాదిలో అవగాహన లేని కారణంగా సుమారు రూ.3 లక్షలు నష్టం వచ్చింది. రెండో సంవత్సరం సగం పిల్లలను ఆంధ్రాలో కొనుగోలు చేసి.. మిగతావి చెరువులోనే పిల్లల ఉత్పత్తి చేపట్టారు. దీంతో పెట్టుబడి వ్యయం తగ్గించుకున్నారు. ప్రస్తుతం ఒక్కో చేప 500 గ్రాముల నుంచి కిలోకు పైగా సైజు వరకు పెరిగింది. ఈ ఏడాది రూ.5 లక్షలు వరకు ఖర్చు చేయగా ఒక మడిలో 30 క్వింటాళ్లు, మరో మడిలో 5 టన్నుల చేపలు చేతికి వచ్చే అవకాశం ఉంది. సుమారు రూ.15 నుంచి రూ.18 లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఉందని రాజు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపల పెంపకందారులకు రాయితీ ఇస్తోంది: చేప పిల్లల ధర, నిర్వహణ, చేపల ఆహారం, మందులు, కూలీ ఖర్చులు అన్ని పోనూ ఏడాదికి ఎకరానికి రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని చెబుతున్నారు. ప్రభుత్వం చేపల పెంపకందారులకు రాయితీలు కూడా ఇస్తోందని.. వాటికి కూడా తాను దరఖాస్తు చేసినట్లు చెప్పారు. బోరు బావిలో సరిపడా సాగునీరు ఉంటే మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటల కంటే కొర్రమీను చేపల పెంపకం లాభదాయకమేనని అంటున్నారు ఈ యువరైతు.

ఒకటిన్నర ఎకరం భూమిలో చేపల పెంపకం చేస్తున్నాను. ఈ బొమ్మె చేపల పెంపకం గత ఏడాది స్టార్ట్ చేశాను. మాకు తెలిసీ తెలియక రూ.3 లక్షలు నష్టం వచ్చింది. అంతటితో ఆగకుండా ముందుకు వెళ్లాను. ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను. ఖర్చులు మొత్తం పోనూ ఎకరానికి రూ.2.50 లక్షలు మిగులుతుందని అనుకుంటున్నాను. - రాజు, యువరైతు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.